DailyDose

మెట్రో సమయం పొడిగింపు-తాజావార్తలు-12/30

Hyd Metro Timings Extended For New Year Celebs-Telugu Breaking News Roundup-12/30

* దేశ రాజధాని దిల్లీలోని లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో ఉన్న ప్రధాని మోదీ అధికారిక నివాసంలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. సాయంత్రం 7.25 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 9 ఫైరింజన్లతో సంఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. స్వల్ప అగ్నిప్రమాదమేనని వారు తెలిపారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం సంభవించిందని ప్రధాని మంత్రి కార్యాలయం (పీఎంవో) తెలిపింది.

* గోదావరి, మానేరు జలాలతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సస్యశ్యామలం అవుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. సాగునీటి రంగంలో తెలంగాణ కోసం కన్నకలలు సాకారమవుతున్నాయని చెప్పారు. కాళేశ్వరం జలాలతో మొట్టమొదటి ప్రయోజనం కరీంనగర్‌ జిల్లాకే కలుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే సిరిసిల్ల ప్రాంతం పాపికొండలుగా మారబోతోందని కేసీఆర్‌ చెప్పారు. కరీంనగర్ కూడా థేమ్స్‌ నది ఒడ్డున ఉన్న లండన్‌లా మారుతుందన్నారు.

* రాజధాని ప్రాంత రైతులు వ్యక్తిని నమ్మి భూములు ఇవ్వలేదని.. ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. అమరావతిని రాజధానిగా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్‌ మాట్లాడారు. మూడు రాజధానులు ఎందుకని పవన్‌ ప్రశ్నించారు.

* అభివృద్ధి, సంక్షేమమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని వివరించారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద ఉన్న వనరులకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాజధాని అభివృద్ధి సాధ్యం కాదన్నారు.

* రాజధాని ఆందోళనల్లో భాగంగా మీడియా ప్రతినిధులపై దాడి చేశారనే ఆరోపణలపై అరెస్టయిన ఆరుగురు రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. ఆదివారం ఉదయం నాగరాజు, నరేశ్‌, సురేంద్ర, శ్రీనివాసరావు, నరసింహస్వామి, భుక్యా లోక్‌నాయక్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి తెనాలి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే.

* నియోజకవర్గ సమస్యలపై సీఎం జగన్‌ను కలిశానని తెదేపాకు చెందిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమస్యలతో పాటు సీఎఫ్‌ఎంఎస్‌ బకాయిల అంశాన్ని జగన్‌ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. రాజధాని అంశంలో సీఎం జగన్‌కు స్పష్టమైన ఆలోచన ఉందని మద్దాలి గిరి చెప్పారు.

* ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా వినియోగదారుల సంఖ్య భారీగా తగ్గింది. ఒక్క నవంబర్‌ నెలలోనే 3.63 కోట్ల మంది వినియోగదారులు తగ్గడంతో కంపెనీ ప్రస్తుత వినియోగదారుల సంఖ్య 33.63 కోట్లకు చేరినట్లు సమాచారం. అక్టోబర్‌ నెలలో 1.89 లక్షల మంది వినియోగదారులు పెరిగినట్లు అంతకుముందు ఆ కంపెనీ ప్రకటించడం గమనార్హం.

* ఆర్టికల్ 370 రద్దు చేసిన నాటి నుంచి జమ్ము కశ్మీర్‌లో గృహనిర్బంధంలో ఉంచిన రాజకీయ నేతల్లో ఐదుగురిని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీరంతా పీపుల్ డెమోక్రటిక్‌, నేషనల్ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు. కానీ కశ్మీర్‌కు చెందిన ముగ్గురు ప్రముఖ రాజకీయ నాయకులు, నేషనల్ కాన్పరెన్స్‌ పార్టీ అగ్రనేతలు ఫరూక్‌ అబ్దుల్లా, ఆయన తనయుడు ఒమర్‌ అబ్దుల్లా, పీపుల్ డెమోక్రటిక్‌ పార్టీ అధినేత మోహబూబా ముఫ్తీలను మాత్రం విడుదల చేయలేదు.

* శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) కార్డుతో ఆధార్‌ అనుసంధానం గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పొడిగించింది. రేపటితో గడువు ముగుస్తుండగా.. తాజాగా దాన్ని వచ్చే ఏడాది (2020) మార్చి 31 వరకు పొడిగించింది. పాన్‌- ఆధార్‌ అనుసంధానం ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. రిటర్నులు దాఖలు చేసే వారికి అనుసంధానం తప్పనిసరి.

* జావా సంస్థ మార్కెట్లో తీసుకురానున్న సరికొత్త బైకు పెరాక్‌ బుకింగ్స్‌ జనవరిలో మొదలుపెట్టనుంది. ఇప్పటికే నవంబర్‌లో ఈ సంస్థ బైకు ధరను రూ.1.94 లక్షలుగా వెల్లడించింది. ఇక బైకు డెలివరీలను మాత్రం ఏప్రిల్‌లో మొదలుపెట్టనున్నట్లు సమాచారం. ఇవి జులై వరకు కొనసాగిస్తుంది. పరిమిత సంఖ్యలో మాత్రమే బుకింగ్స్‌ను స్వీకరించనుంది.

* నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని డిసెంబర్‌ 31 రాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు నడపనున్నట్లు హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రత్యేక సర్వీసులు అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఆరోజు రాత్రి మద్యం సేవించిన వారికీ మెట్రో రైలు ఎక్కేందుకు అనుమతిస్తున్నట్లు వివరించారు.

* కరీంనగర్‌ జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌.. మిడ్‌మానేరు (రాజరాజేశ్వర) జలాశయాన్ని పరిశీలించారు. కాళేశ్వరం జలాలతో నిండిన జలాశయానికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించిన జలహారతి ఇచ్చారు. వేములవాడ రాజన్న దర్శనం అనంతరం సీఎం నేరుగా మిడ్‌మానేరు సందర్శనకు వెళ్లారు. సీఎం పర్యటనలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

* పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనల వల్ల రైల్వేకు రూ.80 కోట్ల మేర ఆస్తినష్టం సంభవించిందని రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిని గుర్తించి వారి నుంచి ఆ మొత్తం వసూలు చేస్తామని ప్రకటించారు.

* సీఎం జగన్‌తో తెదేపా ఎమ్మెల్యే భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి సీఎంను కలిశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మద్దాలి గిరిని జగన్‌ వద్దకు తీసుకెళ్లారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

* మహారాష్ట్రలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరింది. ఊహాగానాలను నిజం చేస్తూ ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన గెలిచిన ఆదిత్యకు కూడా కేబినెట్‌లో చోటు దక్కింది. మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ చవాన్‌ మంత్రిగా ప్రమాణం చేశారు. వీరితో పాటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు చెందిన 35 మంది నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

* ఉమ్మడి పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ఏ ఒక్క భారతీయుడికీ వ్యతిరేకంగా లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇందిరాపార్కు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘పాక్‌, బంగ్లాదేశ్‌లో ఉన్న మైనార్టీల రక్షణ కోసం చట్టం తీసుకొచ్చాం. పాక్‌, బంగ్లాను ఇస్లామిక్‌ దేశాలుగా మార్చారు. పాకిస్థాన్‌లో మైనార్టీలు 3 శాతానికి పడిపోయారు. పాక్‌లో మైనార్టీలంతా ఏమయ్యారు?’’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

* దేశ తొలి మహాదళాధిపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌) పేరును అతి త్వరలోనే ప్రకటించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైలుకు నియామకాల కమిటీ(ఏసీసీ) నుంచి క్లియరెన్స్‌ లభించినట్లు సమాచారం. దీనిపై అధికారిక నోటిఫికేషన్‌ మాత్రమే మిగిలిఉంది. నేడుగానీ, రేపుగానీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడవచ్చు.

* అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఆకాంక్షించారు. ఒకరికి న్యాయం చేసి, ఇంకొకరికి అన్యాయం జరగాలని ఎవరూ కోరుకోకూడదన్నారు. 3 రాజధానుల అంశంపై జరుగుతున్న చర్చ అందరికీ తెలుసన్నారు. ప్రస్తుతం కొన్ని ఇబ్బందికర పరిస్థితులున్నాయని, ఇలాంటి సమయంలోఅందరం ఒక అవగాహనకు రావాలని అన్నారు.

* అప్ఘానిస్తాన్‌లో జరిగిన సాయుధ బలగాల దాడిలో కరడుకట్టిన తాలిబన్‌ కమాండర్‌ క్వారీ సైఫుల్లా మెహసూద్‌ హతమయ్యాడు. ఇక్కడి ఖోస్త్‌ ప్రావిన్స్‌లోని గులూన్‌ స్థావరం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక వేర్పాటువాద గ్రూపు హక్కానీ నెట్‌వర్క్‌ ఈ దాడి చేసినట్టుగా భావిస్తున్నారు. ఈ ఘటనలో తెహ్రిక్‌-ఇ-తాలిబన్‌- పాకిస్థాన్‌ (టీటీపీ)కి చెందిన సైఫుల్లాతో సహా ముగ్గురు సభ్యులు మృతిచెందినట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు.

* దేశీయ మార్కెట్లు సోమవారం తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 17 పాయింట్లు కోల్పోయి 41,558 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 12,256 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.31గా కొనసాగుతోంది.