Health

నవ్వు నవ్య ఔషధం

Laughter Is The New Modern Medicine-Telugu Health News

కోపం కోటి విధాలుగా నాశనం చేస్తే.. నవ్వు నాలుగు నిమిషాల్లోనే ఆ కోపాన్ని తగ్గిస్తుందని అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ క్యాన్సాస్‌ పరిశోధకులు. నవ్వుతూ ఉండే వ్యక్తుల మధ్య బంధం దృఢంగా ఉంటుందనేది వారి అభిప్రాయం. నేడు నవ్వుల దినోత్సవం కదా? ఆ నవ్వుతో ఏం సాధించొచ్చో తెలుసుకుందాం.
**భార్యాభర్తలు కావచ్చు.. పిల్లల మధ్య కావచ్చు.. స్నేహితుల మధ్య కావచ్చు. బంధం అనేది నవ్వు ద్వారానే బలపడుతుందని క్యాన్సాస్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెప్తున్నారు. ‘నవ్వు-జీవితం’ అంశంపై ఇటీవల వారు పరిశోధన చేశారు. దీంట్లో భాగంగా 39 సంవత్సరాల వయసు పైబడిన 15000 మందిపై దాదాపు 35 అధ్యయనాలు చేశారు. ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం కదా.. అన్నీ జీవనశైలి ఆరోగ్య సమస్యలే. వీటిలో దాదాపు 70% ఒత్తిడికి సంబంధించినవే. హైపర్‌టెన్షన్‌.. హార్ట్‌ ఎటాక్‌.. డిప్రెషన్‌.. మైగ్రేన్‌ వంటి అన్ని సమస్యలూ ఒత్తిడితోనే వస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. వీటివల్ల మనం పట్టుమని పది నిమిషాలు కూడా నవ్వలేకపోతున్నాం. ఫలితంగా ఒత్తిడి మరింత పెరిగి సమస్యలు జటిలం అవుతున్నాయి. కాబట్టి నవ్వుతూ ఉంటే ఏ సమస్యా దరిచేరదు. నవ్వు ద్వారానే ఇలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయట. మనం ఒకసారి నవ్వితే శరీరంలోని 108 కండరాలకు శక్తి వస్తుందంటే నవ్వు ఉపయోగం ఎలాంటిదో తెలుసుకోవచ్చు.
**నవ్వు నాలుగు విధాల మేలు
నవ్వు ఆరోగ్యాన్ని అందించడమే కాదు.. ఆయుష్షునూ పెంచుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో నవ్వు కొరవడింది కాబట్టి యోగాసనాల ద్వారా నవ్వు ప్రాక్టీస్‌ చేస్తే మంచిదని అంటున్నారు. ఈ ఐడియా ఇప్పటిదే కాదు. ముంబైకి చెందిన మదన్‌ కటారియా అనే వైద్యుడు దీనిని ప్రపంచానికి పరిచయం చేశాడు. దానిని ఇప్పుడు దాదాపు 72 దేశాలు అనుసరిస్తున్నాయి.
**నవ్వుల దినోత్సవం
కంటినిండా నిద్ర.. కడుపునిండా భోజనం ఎలాగో మనసారా నవ్వు కూడా ముఖ్యమే అని 1995లో కటారియా నవ్వుల దినోత్సవాన్ని ఏర్పాటుచేశారు. మార్నింగ్‌ వాకింగ్‌కు వెళ్లినప్పుడు ఏదో కోల్పోయిన ముఖాలతో ఉన్న సహచరులను గ్రహించిన కటారియా నవ్వు లేకపోవడమే దీనికి కారణం అని గ్రహించారు. అందరికీ నవ్వును కంపల్సరీ చేయాలనే ఆలోచనతో లాఫింగ్‌ క్లబ్‌ ఏర్పాటుచేశారు. కటారియా సందేశం అర్థమైనవాళ్లు లాఫింగ్‌ క్లబ్‌లుగా ఏర్పడి అంతో ఇంతో నవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. రోజుకు మగవాళ్లు 8 సార్లు నవ్వితే.. ఆడవాళ్లు 62 సార్లు.. పిల్లలు 35 సార్లు నవ్వుతారట. సహజసిద్ధంగా వచ్చిన ఈ గుణాన్ని ఇలాగే కొనసాగించేందుకు వాళ్లు స్వేచ్ఛగా నవ్వేందుకు అవకాశం కల్పిద్దాం. నవ్వుల దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం.