Kids

హాయ్ పిల్లలు…నాణెలు నాతోనే చేస్తారు

Telugu Kids News-The Story Of Coins

నికెల్ లోహం… ‘ఇదేదో మాకు తెలియదు’ అనుకుంటున్నారు కదూ? కానీ మీరు నన్ను చూస్తూనే ఉంటారు. కచ్చితంగా అది నేనే అన్నవిషయం మీకు తెలియదంతే. మీ అమ్మనాన్న చిల్లర డబ్బులు ఇస్తుంటారుగా. అదిగో ఆ నాణేలు తయారయ్యేవి నాతోనే మరి. వెండి తెలుపుతో తళతళా మెరుస్తూ.. కొంచెం బంగారం కాంతిలో ఉంటా.
* ఆవర్తన పట్టిక నాల్గవ పీరియడ్లో కనిపిస్తుంటా. నా పరమాణు సంఖ్య 28. చాలా గట్టిగా ఉండటమే గాక తీగలు, రేకులుగా సాగగలను. ఇనుము ఖనిజమైన లిమోనైట్లో ఒకటి నుంచి రెండు శాతం వరకు లభిస్తుంటా.
** ఎక్కడి నుంచి వస్తానంటే?
* కెనడాలోని ఆంటారియో దగ్గర్లో ఉన్న సడ్బర్రీ ప్రాంతపు గనుల నుంచి నన్ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు.
* మీ దేశంలో నా గనులు లేవు. కానీ అసోం, కశ్మీర్ ప్రాంతాల్లో నా నిల్వలు ఉన్నాయని భూగర్భశాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
** ఇవే నా గొప్పలు!
* ఎంతటి ఉష్ణోగ్రతల దగ్గరనైనా నేను కరగను. అందుకే మిగతా లోహాలు దెబ్బతినకుండా ఉండటానికి నా పూత పూస్తుంటారు.
* స్టెయిన్లెస్ స్టీలు వంటి మిశ్రమలోహాల తయారీకీ నన్ను వినియోగిస్తారు.
* నాణేల ముద్రణకు, ఇంజినీరింగ్ పరిశ్రమలకు కావాల్సిన లోహాల్ని మీరు కెనడా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వాహనాలు, విమానాల పరిశ్రమల్లో నాకు మంచిగిరాకీ ఉంది. అంతేకాదు టాంక్లు, యుద్ధనౌకలు రాడార్ వంటి రకరకాల నిర్మాణాల్లో నన్ను బాగా ఉపయోగిస్తున్నారు.
* రేడియో వాల్వ్లు, కాథోడ్ కిరణాల గొట్టాలు, తదితర ఎలక్ట్రానిక్ పరికరాల్లోనూ నేనుంటా. ఎందుకంటే నేను తుప్పు పట్టను. అందుకే మీ దేశంతోపాటు దాదాపు ముప్ఫయి దేశాలు నాణేల ముద్రణకు నన్నే ఉపయోగిస్తున్నాయి.
* నన్ను ఉపయోగించి కుళాయిలు, షవర్హెడ్ వంటివీ తయారుచేస్తారు.
**బ్యాటరీల తయారీలో…
* నాతో ఇతర లోహాల్ని జతచేసి ప్రత్యేకమైన బ్యాటరీలు తయారు చేస్తుంటారు. నికెల్- ఐరన్ బ్యాటరీలు థామస్ అల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త తయారు చేశాడు. లెడ్ బ్యాటరీలకన్నా వీటికి జీవితకాలం ఎక్కువ.
* దీపాల్లో నికెల్-కాడ్మియం బ్యాటరీలను వాడతారు.
* క్షారాలకు, ఆహార పదార్థాలకు నేను ప్రభావితం అవ్వను. అందుకే కెమికల్ ఇంజినీరింగ్లో నికెల్ క్లాడ్ భారీ పాత్రలను పారిశ్రామికంగా ఉపయోగిస్తున్నారు.
* నికెల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీలను తయారు చేసి రీఛార్జి బ్యాటరీలుగా వాడుతున్నారు. ఈ విధానం 1980 నుంచి వాడుకలోకి వచ్చింది.
* నికెల్ – వెండి మిశ్రమలోహంతో తాళం చెవులు చేస్తారు. ఇవి చాలా బలంగా ఉంటాయి.
* సీసానికి ఆకుపచ్చరంగు వచ్చేందుకు గాజులో నన్ను కలుపుతారు.
**అతుక్కుపోతా!
* నా మిశ్రమలోహం నికెల్ఫెర్రో అయస్కాంత పదార్థం. అంటే ఇది అయస్కాంతానికి ఆకర్షితమవుతుంది. అంతేకాదు అయస్కాంతంగా మారగలదు.
* చాలా లోహాలు అయస్కాంతత్త్వాన్ని ప్రదర్శించవు. నాతోపాటు ఇనుము, కోబాల్టు, గాడోలీనియం, నియోడైమినమ్, సమారియం లోహాలు మాత్రం అయస్కాంతత్త్వాన్ని ప్రదర్శిస్తాయి.
**మీ ఒంట్లోకి వస్తా…
* ఆహారం, తాగే నీరు ద్వారా మీ శరీరంలోకి ప్రవేశిస్తుంటా. బ్లాక్టీ, గింజలు, విత్తనాలు, సోయామిల్క్, చాక్లెట్ మిల్క్, చాక్లెట్, కోకో పౌడర్లు, నిల్వ చేసిన చేపలు, మాంసం వంటి ఆహార పదార్థాల్లో ఉంటా.
* మీరు నా విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. నికెల్ కార్బోనైట్ మీకు చాలా విషపూరితంగా చేటు చేస్తుంది. అధికంగా దీన్ని పీలిస్తే ఆరోగ్యపరంగా ఇబ్బందులు మొదలవుతాయి. కొన్ని నికెల్ సమ్మేళన పదార్థాలు క్యాన్సర్ కారకాలట. అందుకేనేమో ఆరోగ్యానికి చేటు చేసే పదార్థాల జాబితాలో నన్నూ చేర్చారు.
* స్టెయిన్ లెస్ స్టీలు పాత్రల్లో వంట చేసుకోవడం వల్ల చాలా స్వల్ప పరిమాణంలో ఆహారపదార్థాల్లో కలుస్తా. అయితే దీని వల్ల హాని ఏమీ ఉండదు. స్టెయిన్లెస్ పాత్రల్లో పుల్లటి పదార్థాలు వండినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త.