WorldWonders

తల్లీ కూతుళ్లను వేధించిన ఏపీ పోలీసులు

AP Police Suspended Over Sexual Abuse On Mother And Daughter

న్యాయం కోసం పోలీసుస్టేషన్‌కు వచ్చిన తల్లి, కుమార్తెల పట్ల అనుచిత ప్రవర్తనకు పాల్పడిన ఘటనలో బాధ్యులైన పోలీసులపై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపించారు. అరండల్‌పేట ఎస్సై, కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేయడంతోపాటు డీఎస్పీ, సీఐలకు ఛార్జి మెమోలు జారీ చేస్తూ గురువారం ఐజీ వినీత్‌బ్రిజ్‌లాల్‌, అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణలు ఉత్తర్వులు జారీ చేశారు.

పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన 18 ఏళ్ల యువతికి నగరానికే చెందిన యువకుడు ప్రేమపేరుతో దగ్గరయ్యాడు. ఆ తర్వాత పెళ్లిచేసుకోనంటూ ముఖం చాటేశాడు. ఆ యువతి తండ్రి చనిపోయాడు. తల్లితో కలిసి నివసిస్తోంది. ప్రేమికుడు మోసగించడంతో తనకు న్యాయం చేయాలంటూ యువతి తన తల్లిని తీసుకొని అరండల్‌పేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈక్రమంలో స్టేషన్‌ ఎస్సై బాలకృష్ణ ఆ యువతికి మాయమాటలు చెప్పి తాను న్యాయం చేస్తానంటూ నమ్మించాడు. గత నెల 31న ఆ యువతి ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. అదే పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ రాము ఆ యువతి తల్లి పట్ల అసభ్యంగా మాట్లాడుతూ అనుచితంగా ప్రవర్తించారని వాపోయింది. ఈ ఘటనపై ఈనెల 27న తల్లీకుమార్తెలు అర్బన్‌ ఎస్పీ కార్యాలయం స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను అర్బన్‌ ఎస్పీ రామకృష్ణ సీరియస్‌గా తీసుకున్నారు.

*** డీఎస్పీ విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు!: 
ఫిర్యాదుపై ప్రత్యేక దర్యాప్తు నిర్వహించాలని తూర్పు డీఎస్పీ కె.సుప్రజను అర్బన్‌ ఎస్పీ రామకృష్ణ ఆదేశించారు. వెంటనే డీఎస్పీ సదరు బాధిత యువతిని, ఆమె తల్లిని పిలిపించి లోతుగా దర్యాప్తు చేయగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. విశ్వసనీయ సమాచారం మేరకు సదరు ఎస్సై తాము ఇద్దరం ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లం…నీకు నేను న్యాయం చేస్తానంటూ నమ్మించాడని యువతి తెలిపింది. తన చరవాణి నంబర్‌ తీసుకొని వాట్సప్‌ ఛాటింగ్‌ చేశాడని పేర్కొంది. ఎస్సై పరిచయమైనప్పటి నుంచి అతను మాట్లాడిన సంభాషణలు, సందేశాలను భద్రపరచుకున్నట్లు తెలిపింది. ఓ రోజు తన తల్లిని కానిస్టేబుల్‌ లాడ్జికి వెళదామా అంటూ అడిగాడని చెప్పింది. డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి ఎస్సై బాలకృష్ణ తన ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపినట్లు తెలిసింది. జరిగిన ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేస్తానని భావించిన ఎస్సై తన చరవాణిలో భద్రపరచుకున్న అతని సంబాషణలు, ఛాటింగ్‌లను ఓ కానిస్టేబుల్‌ ద్వారా తొలగించాడని వాపోయింది. అప్పటికి తాను కొన్ని వాట్సప్‌ సందేశాలను వేరే ఫోల్డర్‌లో భద్రపరచుకున్నానని వాటిని డీఎస్పీకి చూపించినట్లు తెలిసింది.

*** రాజీ కుదుర్చే యత్నం!: 
యువతి ఫిర్యాదుపై డీఎస్పీ సుప్రజ ప్రత్యేక దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులు రాజీ కుదిర్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని, తాము ఎలాంటి తప్పు చేయలేదని ప్రత్యేక దర్యాప్తు అధికారి ముందు చెప్పాలని, అందుకు తగిన ప్రతిఫలం ముట్టచెబుతామంటూ బాధిత యువతితో బేరాలు సాగించినట్లు తెలిసింది. అదే పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌ మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. బాధితురాలితో రాజీకి యత్నిస్తున్నారనే అంశాలను డీఎస్పీ పసిగట్టి ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లారు. ప్రత్యేక అధికారిగా డీఎస్పీ సుప్రజ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నివేదికలను గుంటూరు రేంజ్‌ ఐజీ వినీత్‌బ్రిజ్‌లాల్‌కు, అర్బన్‌ ఎస్పీ రామకృష్ణకు అందజేశారు.మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ఉపేక్షించం. యువతి, ఆమె తల్లి పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఎస్సై జి.బాలకృష్ణ, కానిస్టేబుల్‌ సీహెచ్‌ రాములను సస్పెండ్‌ చేశాం. ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పశ్చిమ డీఎస్పీ బీవీ రామారావు, అరండల్‌పేట సీఐ బి. శ్రీనివాసరావులకు ఛార్జి మెమోలు ఇచ్చాం. చట్టవిరుద్ధమైన పనులు చేసిన కానిస్టేబుల్‌ హనుమంతురావును అర్బన్‌ ఎస్పీ రామకృష్ణ సస్పెండ్‌ చేశారు. పోలీసుశాఖలోని వాళ్లు అవినీతికి పాల్పడినా, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినా ఉపేక్షించం. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. -వినీత్‌బ్రిజ్‌లాల్‌, గుంటూరు రేంజ్‌ ఐజీ

*** యువకుడిపై కేసు నమోదు
ఈ యువతిని ప్రేమపేరుతో మోసగించిన నగరానికి చెందిన డేవిడ్‌పై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు.