DailyDose

కియా కార్నివల్ వచ్చేసింది-వాణిజ్యం

Kia Carnival Released To Indian Market-Telugu Business News Roundup

* దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ మరో సరికొత్త వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. మూడు వేరియంట్లలో లభించే ఈ కార్నివాల్‌ కారు ధర రూ.24.95లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు టొయోటా ఇన్నోవాకు పోటీ ఇచ్చే విధంగా తీర్చిదిద్దారు. కియా మోటార్స్‌ భారత్‌లో విడుదల చేసిన రెండో వాహనం ఇదే. ఇది ప్రీమియం, ప్రెస్టేజ్‌, లిమోజిన్‌ మోడళ్లలో లభిస్తోంది. ఈ కారులో 9మంది ప్రయాణించే విధంగా రూపొందించారు. ఇప్పటికే ఈ కారుకు 3,500 బుకింగ్స్‌ వచ్చాయి. ఈ కారులో 2.2లీటర్ల బీఎస్‌-6 డీజిల్‌ ఇంజిన్‌ను అమర్చారు. 202 పీఎస్‌ శక్తి, 440 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనిలో 8స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మెషిన్‌ను అమర్చారు. ఈ కారులో త్రీజోన్‌ క్లైమెట్‌ కంట్రోల్‌, ఆటో డీఫాగర్‌, ఆటో హెడ్‌ల్యాంప్స్‌, ఎలక్ట్రిక్‌ స్లైడింగ్‌ డోర్‌ వంటి ఫీచర్లను అన్ని వేరియంట్లకు ఇచ్చారు. వీటితోపాటు టెలిస్కోపిక్‌ స్టీరింగ్‌, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ టైల్‌ ల్యాంప్స్‌, పవర్‌ టెయిల్‌ గేట్‌, డ్యూయల్‌ ప్యానల్‌ సన్‌ రూఫ్‌, పవర్‌ ఫోల్డింగ్‌ ఓఆర్‌వీఎం, వైర్‌లెస్‌ ఛార్జర్‌, స్మార్ట్‌ వాచ్‌తో కనెక్ట్‌ అయి పనిచేసే 37రకాల కనెక్ట్‌ ఫీచర్లు అందించారు. కియా కార్నివాల్‌ ప్రారంభ వేరియంట్‌ ధర రూ.24.95 లక్షలు(ఎక్స్‌షోరూం) వద్ద మొదలవుతుంది. టాప్‌వేరియంట్‌ ధర రూ.33.95లక్షలుగా నిర్ణయించారు.

* ప్రముఖ భారతీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా విద్యుత్‌తో నడిచే ఈకేయువీ100 కారును మార్కెట్లోకి విడుదల చేసింది. దిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో-2020లో మహీంద్రా ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈకేయువీ 100 ప్రారంభ ధరను రూ.8.25 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న విద్యుత్‌ కార్లతో పోలిస్తే ఈ కారు సరసమైన ధరకు లభించనుంది. చూడటానికి పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే సంప్రదాయ కేయువీ 100 వాహనాన్ని పోలి ఉన్నప్పటికీ.. ఈ ఎలక్ట్రిక్‌ కారులో పలు కీలక మార్పులు చేసినట్లు మహీంద్రా తెలిపింది. హెడ్‌ల్యాంప్‌, గ్రిల్, వెనక లైట్లుతో పాటు కారు ఇంటీరియర్‌లో కూడా మార్పులు చేశారు. టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్, కనెక్టెడ్ కార్‌ టెక్నాలజీ, లోకేషన్‌ ట్రాకింగ్ వంటి ఆధునిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

* బంగారం ధర దిగొస్తోంది. వరుసగా మూడో రోజు పసిడి ధర తగ్గడంతో రూ.41వేల మార్క్‌ దిగువకు పడిపోయింది. బుధవారం రూ.396 తగ్గడంతో పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.40,871కి చేరింది. ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ లేమి, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తగ్గుముఖం పట్టడంతో పుత్తడి ధర పడిపోతున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది.

* దిగుమతి చేసుకునే ఫినిష్డ్‌ ఉత్పత్తులపై కస్టమ్స్‌ డ్యూటీ పెంచిన కారణంగా మొబైల్‌ ఫోన్ల ధరలు 2శాతం నుంచి 7శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో తయారు చేసిన మొబైల్‌ ఫోన్ల దిగుమతి భారత్‌లో తక్కువే ఉండడం గమనార్హం. ఫోన్ల తయారీలో వినియోగించే కొన్ని విడిభాగాల దిగుమతిపైనా డ్యూటీ పెంచడంతో ధరల పెరుగుదల తప్పకపోవచ్చునని తెలుస్తోంది. బడ్జెట్‌లో ఛార్జర్ల దిగుమతిపై సుంకాన్ని 15శాతం నుంచి 20శాతానికి, ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డుల(పీసీబీఏ)పై 10శాతం నుంచి 20శాతానికి పెంచుతూ ప్రతిపాదనలు చేశారు. మరికొన్ని విడిభాగాలపైనా ఇదే తరహా పెంపును ప్రతిపాదించారు. ఫీచర్‌ ఫోన్లలో వాడే పీసీబీఏ దిగుమతి ప్రస్తుతం ఆరు శాతంగా ఉందని.. తాజా పెంపు వల్ల ఆ సెగ్మెంట్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అయితే దేశీయంగా మొబైల్‌ ఫోన్ల తయారీని ప్రోత్సహించడం కోసమే ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.