DailyDose

సుప్రీం వద్దకు నిర్భయ ఉరి-తాజావార్తలు

Nirbhaya Hanging Case Goes To Supreme Again-Telugu Breaking News

* రాబోయే ఐదేళ్లలో భారత్ ఐదు బిలియన్‌ డాలర్ల రక్షణ రంగ ఎగుమతులపై దృష్టిసారించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఉత్పాతదక రంగాన్ని పెంపొందించేందుకు, పెట్టుబడిదారులు భారత్‌లో తమ స్థావరాలు నెలకొల్పే విధంగా వారిని ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీదారులను భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. యూపీలోని లఖ్‌నవూలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో కలిసి ప్రధాని మోదీ 11వ డిఫెన్స్‌ ఎక్స్‌పోను ప్రారంభించారు.

* కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు విభాగాల్లో 6.83 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని సిబ్బంది వ్యవహారాల శాఖ బుధవారం లోక్‌సభకు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 38,02,779 పోస్టులు ఉండగా.. 2018 మార్చి 1 నాటికి 31,18,956 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఇంకా 6,83,823 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

* నిర్భయ దోషుల మరణశిక్షపై దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం, దిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరిశిక్ష అమలుపై స్టేను ఎత్తివేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురు దోషులను వేర్వేరుగా ఉరితీయడం కుదరదని కోర్టు తేల్చిచెప్పింది. వారంలోగా దోషులు తమకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలనూ వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం, దిల్లీ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశాయి.

* మెట్రోరైల్‌ మొదటి దశలో చివరిదైన జూబ్లీ బస్‌స్టేషన్‌ (జేబీఎస్‌) నుంచి మహాత్మా గాంధీ బస్‌స్టేషన్‌ (ఎంజీబీఎస్‌) కారిడార్‌ ప్రారంభోత్సవంతో దేశంలో రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా హైదరాబాద్‌ మెట్రోరైల్‌ అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నెల ఏడో తేదీన మెట్రో మూడో కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్, మెట్రో రైల్, పోలీసు అధికారులతో ప్రగతి భవన్‌లో ఆయన సమీక్షించారు. కారిడార్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని.. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించారు.

* మేడారం మహాజాతర ప్రారంభ ఘట్టానికి సర్వం సిద్ధమైంది. జాతరలో భాగంగా కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారం బయల్దేరింది. డప్పు వాయిద్యాల నడుమ గిరిజన సంప్రదాయ పద్ధతిలో సారలమ్మను ఊరేగింపుగా తీసుకెళ్లారు. మేడారానికి సుమారు నాలుగున్నర కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లిలో సారలమ్మ ఆలయం ఉంది. అక్కడి నుంచి అమ్మవారిని ఊరేగింపుగా మేడారం తీసుకురానున్నారు. జంపన్న వాగు మీదుగా రాత్రి 10 గంటల ప్రాంతంలో గద్దెలపై సారలమ్మను ప్రతిష్ఠించనున్నారు.

* ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఉపయోగించుకొని ఆమెను తొలగించాల్సిందిగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ప్రధాని మోదీకి సూచించారు. ‘డియర్‌ పీఎం.. ఆర్థికవ్యవస్థ క్షీణిస్తోంది. దీనికి సంబంధించి నిందలు పడకుండా ఉండాలనే దానిపై మీరు దృష్టి సారించండి. అవగాహనలేని నిర్మలాజీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను మీరు ఉపయోగించుకోండి. ఆమెను తొలగించి.. నిందలన్నీ ఆమె మీదకు తోసేయండి. సమస్య పరిష్కారమవుతుంది’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

* స్థిరాస్తి వ్యాపారం కోసమే తెలంగాణలో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి ఆరోపించారు. దిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ని కలిసిన ఆయన.. ఫార్మా సిటీ భూ అక్రమాలపై విచారణ జరిపించాల్సిందిగా కోరారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఫార్మా సిటీ అనుమతులను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. పేద రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని గోయల్‌ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల వద్ద ఎకరా రూ. 8 లక్షలకు కొనుగోలు చేసి రూ. కోటిన్నరకు విక్రయిస్తున్నట్లు కోమటిరెడ్డి ఆరోపించారు.

* ఎన్టీఆర్‌ – రామ్‌ చరణ్‌ – రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘#ఋఋఋ’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ మారుతుందంటూ గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతుంటంతో అభిమానులు కూడా నిజమేనా అని అనుకుంటున్నారు. ఈ సమయంలో చిత్రబృందం అభిమానులకు ఓ సందేశం ఇచ్చింది. సినిమా విడుదల తేదీని మారుస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 8న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

* న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో ఓటమి పాలైన టీమ్‌ఇండియాకు మరో షాక్‌! భారత జట్టుకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. ఆటగాళ్ల మ్యాచు ఫీజులో ఏకంగా 80 శాతం కోత విధించింది. నిర్దేశించిన సమయంలో ఓవర్లు వేయకపోవడమే (స్లో ఓవర్‌రేట్‌) ఇందుకు కారణం. నాలుగు ఓవర్లు ఆలస్యంగా వేసినందుకు ఒక్కో ఓవర్‌కు 20 శాతం చొప్పున ఐసీసీ రిఫరీ క్రిస్‌బ్రాడ్‌ కోత విధించారు. కివీస్‌తో నాలుగు, ఐదో టీ20లో ఇదే కారణంతో కోహ్లీసేనకు 20 శాతం జరిమానా పడిన సంగతి తెలిసిందే.

* ప్రముఖ భారతీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా విద్యుత్‌తో నడిచే ఈకేయువీ100 కారును మార్కెట్లోకి విడుదల చేసింది. దిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో-2020లో మహీంద్రా ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈకేయువీ 100 ప్రారంభ ధరను రూ.8.25 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న విద్యుత్‌ కార్లతో పోలిస్తే ఈ కారు సరసమైన ధరకు లభించనుంది.