Politics

ఆఖరి దశకు హైదరాబాద్ మెట్రో

KTR Speaks And Reviews Final Phase Of Metro Between JBL-MGBS

మెట్రోరైల్‌ మొదటి దశలో చివరిదైన జూబ్లీ బస్‌స్టేషన్‌ (జేబీఎస్‌) నుంచి మహాత్మా గాంధీ బస్‌స్టేషన్‌ (ఎంజీబీఎస్‌) కారిడార్‌ ప్రారంభోత్సవంతో దేశంలో రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా హైదరాబాద్‌ మెట్రోరైల్‌ అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నెల ఏడో తేదీన మెట్రో మూడో కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్, మెట్రో రైల్, పోలీసు అధికారులతో ప్రగతి భవన్‌లో ఆయన సమీక్షించారు. కారిడార్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని.. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించారు. ఈ కారిడార్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, నగర ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్నందున కార్యక్రమం సజావుగా సాగేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని మెట్రో అధికారులను కేటీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు పీపీపీ పద్ధతిలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోరైల్ ప్రాజెక్టు అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అందుకున్న మైలురాళ్లు, అవార్డులు, ఇతర విశేషాలు ప్రజలకు తెలియజేయాలని మంత్రి సూచించారు. మెట్రోరైల్ ప్రాజెక్టు సమగ్ర వివరాలు, ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, గణాంకాలతో కూడిన వివరాలతో అధికారులు సిద్ధంగా ఉండాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.