Business

వజ్రాల వ్యాపారానికి కొరోనా కాటు

Diamonds And Jewellery Business Experiencing CoronaVirus Shock

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ‘కరోనా’ మహమ్మారి.. భారత వాణిజ్యంపైనా పెను ప్రభావం చూపిస్తోంది. ఈ వైరస్ కారణంగా రానున్న రెండు నెలల్లో సూరత్ వజ్రాల పరిశ్రమకు దాదాపు రూ. 8వేల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హాంకాంగ్లో అత్యవసర పరిస్థితి ప్రకటించడమే ఇందుకు కారణమని అంటున్నారు.
చైనాలో విజృంభించిన కరోనావైరస్ హాంకాంగ్కు వ్యాపించింది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా అక్కడ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో 18 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ అత్యయిక స్థితి విధించారు. మార్చి మొదటివారం వరకు స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు. మరోవైపు వైరస్ ప్రభావంతో హాంకాంగ్లో వ్యాపారాలు కూడా నెమ్మదించాయి. ఈ ప్రభావం సూరత్ వజ్రాల పరిశ్రమపై తీవ్రంగా పడింది. ఎందుకంటే సూరత్కు హాంకాంగ్ ప్రధాన వ్యాపార కేంద్రం. ఏటా ఇక్కడి నుంచి దాదాపు రూ. 50వేల కోట్ల విలువైన పాలిష్డ్ వజ్రాలు హాంకాంగ్కు ఎగుమతి అవుతుంటాయి. సూరత్ నుంచి ఎగుమతయ్యే మొత్తం వజ్రాల విలువలో ఇది 37శాతానికి సమానం. అయితే కరోనా వైరస్ భయంతో హాంకాంగ్ నెల రోజుల ఎమర్జెనీ ప్రకటించింది. దీంతో అక్కడి గుజరాత్ వజ్ర వ్యాపారులు తిరుగుముఖం పట్టారు. ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇది సూరత్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని జెమ్స్ అండ్ జువెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ప్రాంతీయ ఛైర్మన్ దినేశ్ నవాడియా తెలిపారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో దాదాపు రూ. 8వేల కోట్ల మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు.
వచ్చే నెలలో హాంకాంగ్లో అంతర్జాతీయ జువెల్లరీ ఎగ్జిబిషన్ జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఆ ప్రదర్శనను రద్దు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇది కూడా సూరత్ వ్యాపారులపై ప్రభావం చూపిస్తుందని మరో నిపుణులు, వజ్రాల వ్యాపారి ప్రవీణ్ నానావతి తెలిపారు. ‘సూరత్లో చేసిన పాలిష్డ్ వజ్రాలు, జువెల్లరీ హాంకాంగ్ ద్వారానే ప్రపంచమంతటికీ వెళ్తాయి. అయితే ఎమర్జెన్సీ వల్ల హాంకాంగ్లో మా వ్యాపారాలను మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. జువెల్లరీ ఎగ్జిబిషన్ను రద్దు చేసే అవకాశాలున్నాయని మాకు సమాచారం వచ్చింది. ఆ ఈవెంట్లో మేం పెద్ద ఎత్తున వజ్రాలు విక్రయిస్తాం. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఆర్డర్లు కూడా వచ్చాయి. ఒకవేళ ప్రదర్శన రద్దయితే మేం చాలా నష్టపోవాల్సి వస్తుంది’ అని ప్రవీణ్ అన్నారు.