Politics

విశాఖ పేదల ఇళ్లు ఎలా లాక్కుంటారు?

Chandrababu Questions YSRCP's Act Of Pooling Vizag Lands

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని.. కానీ అసెన్డ్‌ భూములను లాక్కునే అధికారం ఎవరిచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. విశాఖలో 6వేల ఎకరాల అసైన్డ్‌ భూములను లాక్కున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి ఆందోళనకరంగా ఉందని.. రూ.లక్షా 13వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వ చర్యలతో సోలార్‌ ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయన్నారు. సిట్‌ విచారణను కావాలనే వేశారని.. నిర్దిష్టమైన ఆరోపణలపై విచారణ చేస్తేనే ఫలితాలుంటాయని చెప్పారు. ప్రభుత్వ వ్యవహారశైలి ఇలా ఉంటే పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వస్తారా? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 59 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో తమ పార్టీకి చెందిన మాజీ మంత్రులపై బురద చల్లుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. తమకోసం ప్రభుత్వంపై పోరాటం చేయడం లేదని.. రాష్ట్ర భవిష్యత్‌ కోసమేనని చెప్పారు. వీళ్లు మమ్మల్ని ఏమీ చేయలేరని.. రాష్ట్రం మాత్రం అంధకారమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తాము చేపట్టిన ప్రజాచైతన్య యాత్రలకు ప్రజల్లో మంచి స్పందన వస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రజలు ఆలోచించాల్సిన అవసరముందని చంద్రబాబు సూచించారు.