Fashion

ఈ మహిళా మావటి మదగజాలకు అధిపతి

Kerala Lady's Love for Animals Makes Her Different-Suleiman

ఏనుగును నియంత్రించే మావటి వాళ్లు సాధారణంగా పురుషులై ఉంటారు. సర్కస్‌లోగానీ, దేవాలయాల దగ్గర గానీ, ఇంకెక్కడైనా సరే… గజాన్ని అదిలించే మనిషి స్త్రీ అవడం అత్యంత అరుదుగా కనిపిస్తుంది. గజరాజుల కోలాహలం అధికంగా ఉండే కేరళ రాష్ట్రంలో అక్కడక్కడా కొందరు స్త్రీలు ఈ పనిలో తారసపడతారు. అయితే షబానా సులైమాన్‌ మాత్రం చాలా ప్రత్యేకం. కేరళలో మావటిగా మారిన మొట్టమొదటి ముస్లిం మహిళ ఈమె. సాంప్రదాయ ఆలోచనలను ఛేదించి, ఉన్నత స్థానాలకు ఎదిగిన మహిళలు అన్ని రంగాల్లోనూ ఉంటారు సరే. మరి మావటిగా మారాలనే కాంక్షతో.. ఒక స్త్రీ దుబారులో వైద్య వృత్తిని వదిలి, రావడం మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది. కోజికోడ్‌ జిల్లాలోని కడలుండి ప్రాంతానికి చెందిన ఇరవై ఏడేళ్ల షబానా సులైమాన్‌కి జంతువులంటే ఎంతో ఇష్టం. దీనికి కారణం లేకపోలేదు. షబానా తాతయ్య ఒకప్పుడు కేరళలో మొట్టమొదటి సర్కస్‌ కంపెనీ అయిన కేరళా గ్రేట్‌ మలబార్‌ సర్కస్‌ను నిర్వహించిన వ్యక్తి. అందుకే జంతువులపై షబానాకు చాలా ఆసక్తి ఉండేది. అయితే షబానా తండ్రి, సోదరుడు ఇద్దరూ తమ శిక్షణా కాలంలో పులి బారిన పడి చనిపోయారు కూడా. అందుకే ఆ సర్కస్‌ కంపెనీని షబానా తాతయ్య అమ్మేశాడు. తర్వాత షబానా చదువుకొని, దుబారులో వైద్య వృత్తిని చేపట్టింది. కానీ కొన్నేళ్లకి ఆమె ఆ వృత్తి నుంచి మావటిగా మారాలని నిశ్చయించుకుంది. ఈ నిర్ణయానికి కుటుంబ సభ్యులు ఎలాంటి అడ్డంకీి చెప్పలేదు సరికదా! సంతోషించారు కూడా. కానీ ఆమె సామాజికవర్గం మాత్రం కొంత వ్యతిరేకించింది. అయినప్పటికీ షబానా వెనకడుగు వేయకుండా పేరొందిన శిక్షణా సంస్థ వరిక్కాశ్శేరి మనాలోని మనిషెరి రాజేంద్రన్‌ అనే ఏనుగుతో మొదటిదశ శిక్షణ ప్రారంభించింది. అయితే ఆమె అతి తక్కువ కాలంలోనే ఆ ఏనుగును మచ్చిక చేసుకుంది. సాధారణంగా ఏనుగును నియంత్రించాలంటే శిక్షణ తీసుకున్నవారికే చాలా సమయం పడుతుంది. అలాంటిది మొదటిదశలోనే రాజేంద్రన్‌ షబానా చెప్పినట్లు చేయడం అందర్నీ ఆశ్చర్యపరచింది. పాలక్కడ్‌ జిల్లాలోని ఒట్టుప్పాళం కప్పూర్‌ ఏనుగుల సంపదకు చెందిన గజం మనిషెరి రాజేంద్రన్‌. అయితే ఏ జంతువైనా తన శిక్షకుడికే అలవాటు పడుతుంది కీనీ కొత్తవారి మాట అర్థం చేసుకోలేదు. అలాంటిది రాజేంద్రన్‌ రెండు వారాలకే షబానాకు మచ్చికయ్యింది. ఆమె చేతి నుంచి చెరకు, పుచ్చకాయలను రుచి మరిగిన రాజేంద్రన్‌ షబానాకు స్నేహితుడయ్యాడు. ఇప్పుడు షబానా మాటలతో కుర్చోవడం, నిలబడటం, గుండ్రంగా తిరగడం, తొండం పైకెత్తి అరవడం వంటి పనులన్నీ చేసేస్తున్నాడు. ఐదడుగుల ఎత్తుండే షబానాకు ముదిరిన దంతాలతో, మహాకాయంతో ఉండే రాజేంద్రన్‌ను నియంత్రించడం మొదట్లో కొంత కష్టంగానే అనిపించేదామెకు. అయితే రోజూ రాజేంద్రన్‌తో మాట్లాడటం, బుజ్జగించడం వంటి పనులతో త్వరాగానే మచ్చికయ్యింది. ఇక్కడ విశేషం ఏమంటే… రాజేంద్రన్‌ను షబానా గొలుసులతో, కళ్లేలతో కట్టడం వంటి పనులు ఎప్పుడూ చేయలేదు. మొదటి నుంచీ రాజేంద్రన్‌తో ఒక బంధాన్ని ఏర్పరుచుకోవడానికే ప్రయత్నించింది. ‘బెత్తం పట్టుకొని, కొట్టి రాజేంద్రన్‌ను మచ్చిక చేసుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. ప్రేమతోనే రాజేంద్రన్‌ మనసు గెలుచుకున్నాను’ అంటుంది షబానా. ఇక శిక్షణ పూర్తయిన తర్వాత త్వరలో పాలక్కడ్‌ జిల్లాలో నిర్వహించే దేవాలయ పండగకు మనిషెరి రాజేంద్రన్‌కు షబానా మావటిగా మారనుంది. దీనితో ఆమె కేరళలోనే ‘మొట్టమొదటి ముస్లిం మహిళా మావటి’గా చరిత్రలో నిలిచిపోతుంది. నిజానికి ఒక మహిళ ఏనుగును నియంత్రించడం ఎంతో కష్టమైన పని. కానీ షబానా ఎంతో ఆసక్తితో, నైపుణ్యాన్ని ప్రదర్శించి, ప్రాథమిక దశలోనే మంచి ప్రతిభను కనబరిచింది. అయితే ఉన్నత విద్యను అభ్యసించిన షబానా మావటిగానే మిగిలిపోవాలని అనుకోవడం లేదు. ఈ శిక్షణకు రాకముందే ఆమె ఏనుగులకు సంబంధించిన చాలా పుస్తకాలు చదివింది. ఇక మావటిగా మారిన షబానా భవిష్యత్తులో ఏనుగులపై ఒక పుస్తకాన్ని రాయాలని అనుకుంటుంది.

Image result for shabna sulaiman mahout