Devotional

కృష్ణుడు అంటే అఖండమైన చైతన్యం

The real meaning of krishna chaitanya

శ్రీకృష్ణుడు జగద్గురువు. జగత్తుకు మార్గనిర్దేశనం చేసిన మార్గదర్శి. ‘ఉత్తిష్ఠ కౌంతేయ!’ అని అర్జునుణ్ని జాగృతపరచినా, ఆ పిలుపుతో సమస్త ప్రపంచం మేల్కొంది. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని వేదం చెప్పిన పరమాత్మ తత్త్వాన్ని శ్రీకృష్ణ స్వరూపం సాకారం చేసింది. అఖిల విశ్వం అనే మహాపదాన్ని జ్ఞాన గరిమతో వికసింపజేయడానికి కృష్ణుడనే భానుడు ఆవిష్కారమయ్యాడు. ‘కృష్ణ’ అంటేనే అపరిమితమైన, అతులితమైన, అఖండమైన ఆనందం అని అర్థం.

శ్రీమహావిష్ణువు ఎన్ని అవతారాలను ధరించినా, ఏ ఒక్క అవతారంలోనూ బోధ గురువుగా తన మూర్తిమత్వాన్ని ప్రకటించలేదు. కృష్ణావతారంలోనే అది సుసాధ్యమైంది. వేదసహితమైన ధర్మాల్ని, ఉపనిషత్‌ రహస్యాల్ని తన చర్యల ద్వారా కృష్ణరూపంలో భగవానుడు ప్రకటించాడు. వేదాల నుంచి విస్తరిల్లిన కర్మ, జ్ఞాన, ఉపాసన, యోగ, తత్త్వ మార్గాల్ని కృష్ణుడు సమన్వయం చేసి, తన వ్యక్తిత్వంలో ప్రస్ఫుటం చేశాడు. సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి, ఆదర్శప్రాయమైన విలువల నిర్మాణానికి శ్రీకృష్ణ బోధలు ఉపయుక్తమవుతున్నాయి. జాతి మొత్తానికీ గీతామృతాన్ని పంచి విశ్వ మానవాళి అభ్యుదయాన్ని ఆయన ఆకాంక్షించాడు. సర్వశాస్త్రసారంగా ‘గీత’ను అందించి లోకానికి జ్ఞానసిరుల్ని అనుగ్రహించాడు.

శరీరాన్నే ధర్మక్షేత్రంగా శ్రీకృష్ణుడు అభివర్ణించాడు. ప్రతి మనిషి హృదయంలో ద్వైదీ భావాలుంటాయి. దైవసంపత్తికి పాండవులు సంకేతమైతే, అసుర ప్రవృత్తికి కౌరవులు సూచిక. ఎవరికి వారు తమ కార్యక్షేత్రాల్లో ధర్మాన్ని ఆచరించడం, ఆ ధర్మమార్గాన్ని సుసంపన్నం చేయడమే సర్వోత్కృష్టమైన కర్తవ్యంగా కృష్ణుడు పేర్కొన్నాడు. ధర్మాధర్మాలకు సంఘర్షణగా మనిషి హృదయం ప్రతిఫలిస్తుంది. ఇందుకు ప్రతిబింబమే కురుక్షేత్రం. మంచి చెడుల మధ్య జరిగే పోరులో అంతిమంగా మంచే గెలుస్తుంది. ‘విజయం దక్కాలంటే యుద్ధం చేయి. శాంతి సౌఖ్యాలు సాధించాలంటే యుద్ధం అనివార్యం. జీవితమంటే నిరంతర యుద్ధం. యుద్ధంలో, జీవితంలో పోరు సాగించాలి. పారిపోవడం, నిష్క్రమించడం, అచేతనులై ప్రవర్తించడం ధీరుల లక్షణం కాదు అనేది శ్రీకృష్ణుడి సందేశం.

కౌరవ సేనల్ని చూసిన కౌంతేయుడు, పెను సందేహాలకు లోనై ‘నాకు యుద్ధం వద్దు… విజయం వద్దు’ అన్నాడు. తార్కికదృష్టి లోపించి, ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని పరిస్థితి వల్ల కర్తవ్యం నుంచి వైదొలగే సందర్భాలు తారసపడతాయి. ఈ సందేహస్థితే కశ్మలం. మనసును అల్లకల్లోలం చేసి అయోమయానికి కశ్మలం గురిచేస్తుంది. కశ్మలాన్ని వీడి కర్తవ్యం వైపు పురోగమించాలన్నది వాసుదేవుడి వాక్కు. వ్యక్తుల్ని, వనరుల్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కృష్ణుడు కూలంకషంగా విజయుడికి వివరించాడు. ఆత్మ నియంత్రణ ద్వారా ఆత్మ నిర్వహణ సులభమవుతుందన్నాడు. ప్రతి వ్యక్తిలోనూ అనంతమైన శక్తి ఉంటుంది. దాన్ని గుర్తించాలి. ఆ శక్తిని బహిర్గతం చేయాలి. ఆ శక్తి చైతన్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు బుద్ధి, మనసు, చిత్తం కొత్త విలువలతో కాంతులీనుతాయి. జీవనకళ తొణికిసలాడుతుంది. ఆ దిశగా పురోగమించడం ద్వారా గీతామకరందాన్ని మన జీవితాలకు అనుసంధానింపజేసుకోవచ్చు. భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకుని, జీవితంలో ఆచరించినా, మోక్షం సిద్ధిస్తుందని భజగోవింద స్తోత్రంలో జగద్గురువు ఆదిశంకరులు ప్రకటించారు. నిస్సత్తువ, నిస్తేజం, నిరాశ జీవితాల్లో ఆవరించినప్పుడు గీతాకృష్ణుడు అందించిన సందేశ స్ఫూర్తి కాంతి కిరణాలై దారిచూపుతుంది. కర్తవ్యం వైపు ముందుకు నడిపిస్తుంది. శ్రీకృష్ణుడు అందించిన ఈ దివ్య చైతన్యం- నవజీవన వేదం… నవ్యానంద ప్రదాయకం.