Kids

కప్పకు పులిని ఎరగా వేసిన నక్క

కప్పకు పులిని ఎరగా వేసిన నక్క

ఒక ఉదయం ఓ పెద్దపులి తన గుహకు దగ్గరలో ఉన్న చెరువుకు పోయింది. నీళ్లు తాగి, ఇసుక మీద సేదదీరింది. అలా కూర్చున్న పులికి మెత్తగా ఏదో తగిలింది. ‘ఏమై ఉంటుందా’ అని చూస్తే అక్కడొక పెద్ద ముసలి కప్ప ఉంది. ఆ కప్ప పక్కకి దూకి, కోపంతో.. ‘ఒరేయ్‌ కుర్రవాడా! కూర్చునే ముందు చూసుకోవాలని తెలియదా? కొంచెంలో నన్ను పచ్చడి చేసి ఉండేవాడివే!’ అని అరిచింది. ఆ మాటలు విన్న పులికి కోపం వచ్చింది. ‘అడవి రాజుతో ఇలాగేనా మాట్లాడేది? తప్పు చేసినందుకు నేను నిన్ను తినేస్తా’ అంటూ గాండ్రించింది. కప్ప గర్వంగా, తల పైకెత్తి ‘నువ్వు నన్ను తినలేవు. నేను కప్పల రాజును. నీకంటే తెలివైనవాడిని!’ అంటూ బెకబెకలాడింది. అంతేకాదు.. ‘దుంకడంలో, తినడంలో, కుస్తీలో నిన్ను సవాలు చేస్తున్నా’ అన్నది కప్ప. ‘సరే’ అన్నది పులి. దూకే పందెం మొదలయింది. పులి తన బలాన్నంతా ఉపయోగించి చెరువు అవతలికి దూకింది. కానీ ఆశ్చర్యం! కప్ప పులి కంటే ఒక మీటరు ఎక్కువ దూరమే దూకగలిగింది! అయితే అది తన తోకను పట్టుకొని దూకిన విషయం మాత్రం పులికి తెలియదు.

కప్ప విజయగర్వంతో ‘నేను ఈ రోజు ఉదయాన్నే రెండు పులులను తిన్నాను’ అంటూ ఒళ్లు విరుచుకుంది. ఆ మాటలు విన్న పులికి భయంతో నోట మాట రాలేదు. పులి భయాన్ని గమనించిన కప్ప తనతో కుస్తీకి రమ్మని పిలిచింది. పులి కొంచెం సేపు ఆలోచించి.. అక్కడి నుంచి అడవిలోకి పరుగుతీసింది. చాలాసేపు పరిగెత్తాక దానికి ఒక ముసలి నక్క ఎదురయింది. రొప్పుతూ, భయపడుతూ ఉన్న పులిని చూసి ‘సంగతేంటి పులిమామా?’ అని నక్క అడిగింది. జరిగినదంతా వివరించింది పులి. అలాంటిది ఏమీ ఉండదని, కావాలంటే తనవెంట కప్ప దగ్గరకు రమ్మని, ఆ కప్ప మాటలు నిజం కాదని నిరూపిస్తానని గట్టిగా చెప్పింది. నక్క తనను మధ్యలో వదిలేయకుండా ఉండేందుకుగాను, పులి తమ రెండు తోకల్ని కట్టేసింది. రెండూ కప్ప దగ్గరకు నడిచాయి. వాటి రాకను గమనించిన కప్ప ఠీవిగా వాటికి ఎదురుగా నిలబడి ‘ఓ తెలివైన నక్కా! నువ్వే నిజమైన స్నేహితుడివి. నేను ఈ పులిని తినేద్దామనుకున్నాను. కానీ అప్పుడు ఇది పారిపోయింది. అయితే నా కోసం నువ్విలా దీన్ని తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను’ అన్నది గట్టిగా. ఆ మాటలు విన్న పులి మరింత వణికిపోయింది. నక్క తనను మోసం చేసిందని ఊహించేసుకున్నది. తన తోకతో ముడేసుకున్న నక్కను ఈడ్చుకుంటూ అడవిలోకి పరుగెత్తడం మొదలెట్టింది. నక్క ఏది చెప్పడానికి ప్రయత్నించినా కొద్దీ పులి తన వేగాన్ని పెంచింది. చాలా దూరం పరుగెత్తాక గానీ అది ఆగలేదు. అప్పటికి నక్క ఒళ్లంతా హూనమయిపోయి, శరీరమంతా రక్తమోడుతూ ఉంది. అప్పుడుగానీ తోక ముడిని విప్పలేదు పులి! ఆయాసపడుతూ.. ‘ఇలాంటి తెలివితేటలు నా దగ్గర సాగవు’ అని నక్క చెంప చెళ్ళుమనిపించింది పులి!