Movies

తెలుగు చిత్రసీమలో మెరుపుకిరణం…ఉదయ్

తెలుగు చిత్రసీమలో మెరుపుకిరణం…ఉదయ్

వచ్చీ రావడంతోనే వెండితెరకి ఓ కొత్త మెరుపునిచ్చిన యువకిరణం… ఉదయ్‌కిరణ్‌. ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ నిర్మించిన ‘చిత్రం’తో ఆయన ప్రయాణం మొదలైంది. తొలి సినిమానే ఘన విజయం సాధించడంతో ఉదయ్‌కిరణ్‌ పేరు మార్మోగిపోయింది. అవకాశాలు వరుసకట్టాయి. విజయాలు వెంటపడ్డాయి. ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ చిత్రాలతో హ్యాట్రిక్‌ హీరో అనిపించుకొన్నారు. మూడు విజయాలతో దిష్టి తగిలిందో ఏమో ఆ తరువాత పరాజయాలు పలకరించాయి. ఆయన కెరీర్‌లో ‘నీ స్నేహం’ చివరి విజయమైంది. 1980 జూన్‌ 26న హైదరాబాద్‌లో జన్మించిన ఆయన సికింద్రాబాద్‌ వెస్లీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. కాలేజీ నుంచే మోడలింగ్‌ మొదలుపెట్టిన ఆయన తేజ దృష్టిలో పడి ‘చిత్రం’లో నటించే అవకాశాన్ని అందుకొన్నాడు. ‘నువ్వు నేను’ చిత్రంలో నటనకిగానూ ఆయన ఉత్తమ నటుడుగా ఫిల్మ్‌ ఫేర్‌ పురస్కారం లభించింది. ‘నీ స్నేహం’, ‘శ్రీరామ్‌’ చిత్రాల్లో ఉదయ్‌కిరణ్‌ నటనకి ప్రశంసలు లభించాయి. తెలుగుతోపాటు తమిళంలోనూ నటించారు ఉదయ్‌కిరణ్‌. కె.బాలచందర్‌ దర్శకత్వంలో ‘పొయ్‌’తో ‘వాంబు శాండై’, ‘పెన్‌ సింగమ్‌’ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. 2012లో విషితతో ఆయన వివాహం జరిగింది. వరుస పరాజయాలు… ఆర్థిక ఇబ్బందులతో మానసిక ఆందోళనకి గురైన ఉదయ్‌కిరణ్‌ 2014లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమలోనూ, అభిమానుల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఎంతో ఎత్తుకు ఎదుగుతాడనుకొన్న ఉదయ్‌కిరణ్‌ 33 (జనవరి 5, 2014) సంవత్సరాల వయసులోనే తనువు చాలించి అందరినీ శోకసంద్రంలో ముంచెత్తారు. ఆయన జయంతి ఈ రోజు.