NRI-NRT

ట్రంప్ H1B నియంత్రణపై ప్రవాసుల కేసు

Trump Proclamation 10052 Challenged In Court

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయంపై ఎన్నారైలు అక్కడి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హెచ్‌1బీ వీసాలను నిలిపివేయడంతో తమను అమెరికాలోకి రానీయకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. మొత్తం 174 మంది ట్రంప్‌నకు వ్యతిరేకంగా కోర్టులో కేసును దాఖలు చేశారు. వీరిలో ఏడుగురు మైనర్లు కూడా ఉన్నారు. కొలంబియాలోని డిస్ట్రిక్ట్‌ జడ్జి కెథన్జీ బ్రౌన్‌ జాక్సన్‌ దీనిపై అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియోకు, సెక్రటరీ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ ఛాడ్ ఎఫ్‌ వోల్ఫ్‌, లేబర్‌ సెక్రటరీ యూగెనె స్కాలియాలకు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఈ లాసూట్‌ దాఖలైంది.

‘‘ హెచ్‌1బీ వీసాల రద్దు ప్రకటన అమెరికా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. కుటుంబాలను విడదీస్తుంది. దీంతోపాటు అమెరికా కాంగ్రెస్‌ నిర్ణయానికి ఇది పూర్తి వ్యతిరేకం. దీనిలోని రెండు పాయింట్లు అనాలోచితమైనవి.. రెండు పాయింట్లు చట్టవిరుద్ధమైనవి’’ అని ఈ పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాది వాస్‌డెన్‌ బనియస్‌ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న హెచ్‌1బీ, హెచ్4 వీసాలను న్యాయస్థానం జారీ చేయించాలని వారు అభ్యర్థించారు.

హెచ్‌-1బీ వీసాల జారీకి సంబంధించి అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తమ వలస విధానం ‘ప్రతిభ ఆధారంగా’ మాత్రమే ఉంటుందంటూ… ఆ దిశగా మార్పులకు శ్వేతసౌధం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా హెచ్‌-1బీ వీసాల జారీని ఈ సంవత్సరాంతం వరకు రద్దు చేసింది. ఈ మేరకు జూన్‌లో ప్రకటించారు. అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు, నైపుణ్యం గల వారికి మాత్రమే తమ దేశంలో చోటిచ్చేందుకు తాము ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ నిర్ణయం జూన్‌ 24 నుంచి అమల్లోకి వచ్చింది.