Politics

హైదరాబాద్‌లో మరో సరికొత్త కారిడార్

హైదరాబాద్‌లో మరో సరికొత్త కారిడార్

నగరంలోని మరో భారీ ప్రాజెక్టుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది.

ఎస్ఆర్‌డీపీ కింద  రూ.523 కోట్ల‌తో న‌ల్గొండ క్రాస్ రోడ్ నుండి ఓవైసీ జంక్ష‌న్ వ‌ర‌కు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని , మహమ్మద్ అలీ , మేయర్ బొంతు రామ్మోహన్ , ఎంపీ అసద్ పాల్గొన్నారు.

న‌ల్గొండ క్రాస్ రోడ్ నుండి వ‌యా సైదాబాద్‌, ఐ.ఎస్‌.స‌ద‌న్ ద్వారా ఓవైసీ జంక్ష‌న్ వ‌ర‌కు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. 

ఈ కారిడార్ పొడ‌వు 3.382 కిలోమీట‌ర్లు కాగా… అందులో ఫ్లైఓవ‌ర్ పొడ‌వు 2.580 కిలోమీట‌ర్లు. మిగిలిన‌ది రెండు వైపులా ర్యాంప్‌‌లు నిర్మించనున్నారు.

అలాగే రెండు వైపులా రాక‌పోక‌లు సాగించే విధంగా నాలుగు లేన్ల‌తో ఈ కారిడార్‌‌ నిర్మాణం జరుగనుంది. 24 నెల‌ల్లో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేలా జీహెచ్ఎంసీ సంకల్పించింది.

ఈ కారిడార్ నిర్మాణంతో న‌ల్గొండ క్రాస్ రోడ్ నుండి ఓవైసి హాస్పిట‌ల్ జంక్ష‌న్ వ‌ర‌కు ట్రాఫిక్ స‌మ‌స్య ప‌రిష్కార‌ంకానుంది.

అలాగే చంపాపేట‌, చంద్రాయ‌ణ‌గుట్ట వైపు వెళ్లే వాహ‌న‌దారుల స‌మ‌యం కూడా ఆదా అవనుంది. దీంతో ఐ.ఎస్‌.స‌ద‌న్ జంక్ష‌న్‌పై ఒత్తిడి త‌గ్గే అవకాశం ఉంది. 

చంచ‌ల్‌గూడ జంక్ష‌న్, సైదాబాద్ జంక్ష‌న్‌, దోబిఘాట్ జంక్ష‌న్, ఐ.ఎస్‌.స‌ద‌న్ జంక్ష‌న్‌ల‌లో నెల‌కొన్న ట్రాఫిక్ స‌మ‌స్య తొలగిపోనుంది.