Business

శాంసంగ్ సరికొత్త ఫోను-వాణిజ్యం

శాంసంగ్ సరికొత్త ఫోను-వాణిజ్యం

* ప్రముఖ దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం శామ్‌సంగ్ తన సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5ఘ్ని ప్రస్తుతం యుఎస్‌లో విడుదల చేశారు.ఫిబ్రవరి నెలలో విడుదల అయిన శామ్‌సంగ్ గెలాక్సీ Zఫ్లిప్ యొక్క 5G మోడల్ నెట్‌వర్క్ సపోర్ట్‌ను జోడిస్తు అతి వేగంగా అప్‌గ్రేడ్ ప్రాసెసర్‌తో వస్తుంది.ఈ కొత్త ఫోన్ లాంచ్ ఆగస్టు 5 న శామ్‌సంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌కు కొద్ది రోజుల ముందు వస్తుంది.శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5ఘ్ లాంచ్ శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5ఘ్ కొత్త ఫోన్ 5ఘ్ నాన్-స్టాండ్ అలోన్ (NSA), 5ఘ్ స్టాండలోన్ (SA) నెట్‌వర్క్ మరియు సబ్6 బ్యాండ్‌ల మద్దతుతో లభిస్తుంది.

* పసిడి ధర ఆకాశాన్నంటుతోంది.. రూ. 50,000 స్థాయినీ అధిగమించి దూసుకెళ్తోంది. బుధవారం మరో కొత్త గరిష్ఠ స్థాయిని చేరింది. దేశ రాజధానిలో 10 గ్రాముల ధర రూ. 430 పెరిగి రూ. 50,920ను చేరింది. మంగళవారం ముగింపు ధర రూ. 50,490. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయంగాను బంగారం ధర పరుగుతీస్తోందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. ముంబయిలో 10 గ్రాముల ధర రూ. 50,181కు చేరింది. శ్రావణ మాసం ప్రారంభం కావడం, పెళ్లిళ్ల సందడి ప్రారంభం కానుండటం బంగారం ధర పెరగడానికి కారణమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

* దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నిన్న అమ్మకాల ఒత్తిడితో నష్టపోయిన మార్కెట్లు ఇవాళ తిరిగి లాభాలను ఆర్జించాయి. ఎనర్జీ, ఫార్మా, ఆటో షేర్ల అండతో సూచీలు లాభాల్లోకి వెళ్లాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ముగిసే సరికి 268.95 పాయింట్ల లాభంతో 38,140.47 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 82.85 పాయింట్లు లాభపడి 11,215 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.76గా ఉంది.

* ఖాతాల్లో జరిగే మోసాలు వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు లేదంటే సీబీఐకి ఫిర్యాదు చేయడానికి వీలుగా బ్యాంకులకు సర్క్యులర్‌ జారీ చేసిందని ఆర్‌బీఐ బుధవారం హైకోర్టుకు నివేదించింది. బ్యాంకుల్లో జరిగే మోసాలను అరికట్టడంతోపాటు మోసం చేసిన వారి గురించి ఇతర బ్యాంకులకు తెలియజేయడం ద్వారా వాటిని అప్రమత్తం చేయడం ఈ సర్క్యులర్‌ లక్ష్యమని పేర్కొంది. తమ ఖాతాలను మోసపూరిత ఖాతాలుగా ఎస్‌బీఐ ప్రకటించడాన్ని సవాలు చేస్తూ బీఎస్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ అగర్వాల్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆర్‌బీఐ సర్క్యులర్‌ ఆధారంగా మోసపూరిత ఖాతాలుగా ప్రకటించడంపై ధర్మాసనం వివరణ కోరింది. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఖాతాదారుకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా మోసపూరిత ఖాతాగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించింది. దీనిపై ఆర్‌బీఐ తరఫు న్యాయవాది నళిన్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ బ్యాంకుల్లో ఖాతాల్లో మోసం జరిగిందని బ్యాంకు గుర్తించినపుడు దానిపై పోలీసులు లేదంటే సీబీఐకి ఫిర్యాదు చేయాలన్న ఉద్దేశంతోనే సర్క్యులర్‌ జారీ చేశామన్నారు. దీనివల్ల ఇతర బ్యాంకులు మోసపోకుండా అప్రమత్తం చేయడమేనని, దీనిపై మోసం చేసినవారికి నోటీసులు జారీ చేస్తే దేశం విడిచి వెళ్లవచ్చని, ఆస్తులను విక్రయించుకోవచ్చని, సాక్ష్యాలను తారుమారు చేయవచ్చన్నారు. ఎస్‌బీఐ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌కు చెందిన కంపెనీకి ఎస్‌బీఐ కన్సార్టియం రూ.1500 కోట్లు రుణం ఇచ్చిందన్నారు. కంపెనీ ఖాతాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో వెల్లడైందని తెలిపారు. కంపెనీ పెద్దమొత్తంలో నిధులను మళ్లించిందన్నారు. ఖాతాల్లోని లోపాలకు సరైన వివరణ ఇవ్వనపుడు మోసపూరిత ఖాతాలుగా ప్రకటించడానికి ఆర్‌బీఐ బ్యాంకులకు అవకాశం కల్పించిందని, ఇందులో ఖాతాదారుకు తిరిగి అవకాశం ఇవ్వాల్సిన అవసరంలేదన్నారు. ఇందులో భాగంగా గత ఏడాది ఫిబ్రవరి 15న కంపెనీ ఖాతాలను మోసపూరితమైన ఖాతాలుగా ప్రకటించిందన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను సమర్పించడానికిగాను విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

* ప్రభుత్వ రంగ బ్యాంకులు మూలధనాన్ని సమీకరించడం ఎంత ముఖ్యమో.. మూలధనాన్ని పరిరక్షించుకోవడమూ అంతే ముఖ్యమని ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది. ఈఐఎం చెల్లింపులకు వాయిదా అవకాశాన్ని కల్పిస్తూ ఇచ్చిన మారటోరియం సమయం ఆగస్టు 31వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో మూలధన పరిరక్షణ ఎంతో అవసరమని తెలిపింది. ఎందుకంటే ఆ తర్వాత నుంచి నిరర్థక ఆస్తులను గుర్తించి వాటికి బ్యాంకులు కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. అప్పుడు వాటికి నిధుల అవసరం పడుతుంది. ‘సమస్య ఏమిటంటే.. ఐబీసీ నిబంధనలను ఏడాది కాలం పాటు రద్దు చేశారు. దీంతో ఈ సమయంలో దివాలా పరిష్కార ప్రక్రియ జరగదు. అందువల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మూలధన పునర్‌వ్యవస్థీకరణ జరగాలి. అయితే మూలధన పునర్‌వ్యవస్థీకరణ నిమిత్తం ప్రభుత్వం ఏ మేరకు నిధుల సాయం అందిస్తుందనే విషయం ఇప్పుడే తెలియనందున ప్రత్యామ్నాయంగా మూలధనాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంద’ని ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది. కాగా.. కరోనా వైరస్‌ పరిణామాల నేపథ్యంలో మున్ముందు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాలంటే ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు మూలధనాన్ని సమీకరించాల్సిన అవసరం ఉందని ఈ నెల ప్రారంభంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నరు శక్తికాంతదాస్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో పరిపాలన వ్యవహారాలను బ్యాంకులు మెరుగపర్చుకోవడం ఎంతో కీలకం. నష్ట నివారణ చర్యలను బలోపేతం చేసుకోవాలి. సమస్య వచ్చే వరకు ఎదురుచూడకుండా.. ముందుగానే తగినంత మూలధనాన్ని బ్యాంకులు సమీకరించాల’ని ఆ సందర్భంగా దాస్‌ అన్నారు. మూలధన పరిరక్షణలో భాగంగా బాసెల్‌, కౌంటర్‌ సైక్లికల్‌ బఫర్‌ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలి. రెగ్యులేటరీ రిటైల్‌ పోర్ట్‌ఫోలియోకి అర్హత సాధించేందుకు నిర్దేశించిన రూ.5 కోట్ల పరిమితిని రూ.8.5 కోట్లకు పెంచాలి. ఈ మూడింటి చర్యల వల్ల బ్యాంకులకు దాదాపు రూ.3,00,000 కోట్లు మిగులుతాయని నివేదిక పేర్కొంది. మారటోరియం కాలపరిమితిని మరింత పెంచడం వల్ల బ్యాంకింగ్‌ వ్యవస్థలో నెలకొన్న సమస్యకు పరిష్కారం లభించదని అభిప్రాయపడింది. అయితే కొవిడ్‌-10 పరిణామాలకు ముందు, ఆ తర్వాత రుణగ్రహీతల ఆర్థిక స్థితిగతులను విశ్లేషించాకే రుణ పునర్‌వ్యవస్థీకరను వీలు కల్పించాలని వెల్లడించింది.

* బీఎన్‌పీ పరిబాస్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థ షేర్‌ఖాన్‌ ఆర్థిక విద్య ప్లాట్‌ఫామ్‌ ‘మనీఫ్లిక్స్‌’ను ప్రారంభించింది. ప్రపంచంలో ఇదే మొట్టమొదటి ఎడ్యుటైన్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ అని, ఆర్థిక విద్యలో డిజిటల్‌ మార్పులను ఇది తీసుకొస్తుందని సంస్థ తెలిపింది. డిజిటల్‌పై మక్కువ చూపే యువత, పెద్ద అవగాహన లేని యువతకు ఆర్థిక మెళకువలను షేర్‌ఖాన్‌ ఎడ్యుకేషన్‌ అందిస్తుందని మనీఫ్లిక్స్‌ హెడ్‌ రాహుల్‌ ఘోష్‌ అన్నారు. ఎడ్యుటైన్‌మెంట్‌తో సొమ్ముల గురించి పాఠాలు నేర్పించడం చాలా ప్రభావమైనదని తెలిపారు. కొత్తగా స్టాక్‌మార్కెట్‌లో అడుగుపెట్టినవారికి, నిపుణులైన మదుపర్లు, ట్రేడర్లకు స్టాక్‌ మార్కెట్‌లో అవకాశాలపై మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి మనీఫ్లిక్స్‌ దోహదపడుతుంది. ఇందులో దాదాపు 100 వరకు వీడియోలు ఉన్నాయి. వీటి నిడివి 5 నుంచి 30 నిమిషాల వరకు ఉంది.త్వరలోనే వీడియోల సంఖ్యను మరింత పెంచుతామని రాహుల్‌ వెల్లడించారు.

* స్వదేశీ ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రక్రియ హైదరాబాద్‌ నిమ్స్‌లో కొనసాగుతోంది. తొలిదశ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా ఇవాళ మరో వాలంటీరుకు ఫేజ్‌-1 డోస్‌ ఇచ్చేందుకు నిమ్స్‌ ఆసుపత్రి వర్గాలు ఏర్పాట్లు చేశాయి. తొలిదశ మానవ ప్రయోగాల్లో భాగంగా సోమవారం ఇద్దరు వాలంటీర్లకు టీకా డోసు ఇచ్చిన సంగతి తెలిసిందే. వారిని ఐసీయూలో ఉంచి 24 గంటలపాటు వైద్య బృందం పర్యవేక్షించింది. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో మంగళవారం డిశ్ఛార్జి చేశారు. వీరికి ఎలాంటి అలర్జీలు లేకుండా పూర్తి ఆరోగ్యంగా ఉండటంతో వాలంటీర్లను డిశ్చార్జి చేసి వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.