NRI-NRT

నవంబరు 3న తప్పకుండా వస్తుంది

నవంబరు 3న తప్పకుండా వస్తుంది

అత్యంత వేగంగా సంక్రమించే లక్షణం కారణంగా కరోనా వైరస్ మహమ్మారిని పూర్తిగా ఈ భూగ్రహం నుంచి పారదోలడం అసాధ్యమైనా, సమర్ధవంతమైన వ్యాక్సిన్‌తో దీనిని కట్టడిచేయగలమని అన్నారు డొనాల్డ్ ట్రంప్

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను అంతం చేసే వ్యాక్సిన్‌ను ఎవరు ముందుగా అందుబాటులోకి తీసుకొస్తారా? అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ గురించి డొనాల్డ్ ట్రంప్ శుభవార్త చెప్పారు. మహమ్మారి అంతానికి రోజులు దగ్గర పడ్డాయని, నవంబరు 3 నాటికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. గెర్లాడో రైవేరా రేడియో కార్యక్రమం ద్వారా మాట్లాడిన ట్రంప్.. వ్యాక్సిన్ నవంబరు 3 నాటికి అందుబాటులోకి వస్తుందని ఉద్ఘాటించారు. అప్పటికి ముందే రావచ్చని, కాకపోతే నవంబరు 3కి ఖచ్చితంగా వ్యాక్సిన్ అమెరికా వద్ద ఉంటుందని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ తప్పకుండా వస్తుందని తెలిపారు.

తర్వాత వైట్‌హౌస్ వద్ద ట్రంప్ మాట్లాడుతూ.. నవంబరు 3 నాటికి దాదాపు వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఇది మీకు ఎన్నికల్లో ఉపయోగపడుతుందా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘నేను చేస్తున్నది ఎన్నికల కోసం కాదు.. చాలా మంది ప్రాణాలను కాపాడాలనుకుంటున్నాను.. విజయం సాధించకపోయినా తనకు బాధ ఉండదు’ అని సమాధానం ఇచ్చారు.

అయితే, వ్యాక్సిన్ గురించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని చైనా దొంగిలించిందా? అన్న విషయాన్ని తాను చెప్పలేను కానీ, అది డ్రాగన్2కు సాధ్యమయ్యేపనేనని బలంగా నమ్ముతున్నానని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ తయారీలో అమెరికా సంస్థలు ముందంజలో ఉన్నాయని ఆయన అన్నారు. ఈసారి అధ్యక్ష ఎన్నికలు సైతం నవంబరు 3నే జరగనుండగా.. అదే రోజుకు వ్యాక్సిన్ అమెరికా వద్ద ఉంటుందని ట్రంప్ చెప్పడం విశేషం. ట్రంప్ వ్యాఖ్యలపై అప్పుడే రాజకీయ విమర్శలు ఊపందుకున్నాయి. ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతోనే ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ప్రత్యర్థి జో బిడెన్ వర్గం విమర్శలు గుప్పించింది.

మరోవైపు, అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 50 లక్షలు దాటేయగా, ఇప్పటివరకూ 1.67 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, వచ్చే ఏడాది ప్రారంభానికి ఔషధ తయారీ సంస్థల వద్ద మిలియన్ల కొద్దీ కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉండే అవకాశం ఉందని అమెరికా అంటువ్యాధుల విభాగం చీఫ్ ఆంటోని ఫౌచీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.