DailyDose

కరోనా వ్యాక్సిన్‌పై ట్రంప్ ఆశలు-తాజావార్తలు

కరోనా వ్యాక్సిన్‌పై ట్రంప్ ఆశలు-తాజావార్తలు

* అక్టోబర్‌ సర్‌ప్రైజ్‌.. ఈ మధ్య కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నోట వినబడుతున్న మాట. అక్టోబర్‌లో అమెరికన్లకు కరోనాకు వ్యాక్సిన్‌ ఇస్తాడన్నది దీని అర్థం. ఈ ఒక్క వాక్సినే తనను రెండోసారి అధ్యక్ష పీఠంపై కూర్చోబెడుతుందన్నది ట్రంప్‌ ఆశ. మరి నిజంగా అమెరికాలో ఆ పరిస్థితి ఉందా? కరోనా అమెరికాను ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఎంత దెబ్బ తీసింది? ప్రజలు ట్రంప్‌ తీసుకున్న చర్యలను హర్షిస్తారా? లేక బుద్ధి చెబుతారా? కరోనా చుట్టు తిరుగుతున్న అమెరికా ఎన్నికలు చివరికి ఎలాంటి ముగింపు పలుకుతాయి? అక్టోబర్‌ సర్‌ప్రైజ్‌గా మిగులుతుందా? లేక ట్రాజెడీగా మారుతుందా? అమెరికా ఎన్నికలపై కరోనా బలంగా ప్రభావం చూపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అమెరికాలో ఉగ్రవాదం కంటే కరోనానే ఎక్కువ ప్రమాదమన్న భావన వచ్చింది. దాదాపు 70లక్షల కరోనా కేసులు, 2 లక్షల మరణాలతో అమెరికా అతలాకుతలమయింది. ముఖ్యంగా ఈస్ట్‌ కోస్ట్‌ను అయితే కరోనా భారీగా దెబ్బతీసింది. కరోనాను అరికట్టడంలో ట్రంప్‌ సర్కారుపై చాలా మంది అమెరికన్లకు పీకల్దాక కోపముంది. ముఖ్యంగా ఈస్ట్‌ కోస్ట్‌లో న్యూయార్క్‌తో పాటు చాలా రాష్ట్రాల్లో కరోనా కరాళ నృత్యం చేసింది. దాదాపు ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యేలా ప్రభావం చూపింది. ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా సగటు అమెరికన్‌ను వణికించింది కరోనానే. అందుకే ఉగ్రవాదం కంటే పెద్ద ప్రమాదకారిగా కరోనాను చిత్రీకరించారు అమెరికన్లు. యూరోపియన్‌ దేశాల్లో కరోనాను కట్టడి చేసినట్టుగా అమెరికాలో ట్రంప్‌ వైరస్‌ను నియంత్రించలేకపోయారన్న విమర్శలున్నాయి.నవంబర్‌ 3న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దానికి రెండు రోజుల ముందుగానే వాక్సిన్‌ ఇస్తామన్న ధీమాలో ట్రంప్‌ ఉన్నారు. ఇప్పటికే వాక్సిన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. దీని ద్వారా కరోనా భయం లేకుండా చేశానని ట్రంప్‌ చెప్పుకోవచ్చు. ప్రజల్లో నమ్మకం నింపే ఈ వాక్సిన్‌ ప్రయత్నంలో కొన్ని అవాంతరాలు ఉన్నాయి. ట్రంప్‌ క్యాంపెయిన్‌లో కీలక అస్త్రంగా భావిస్తున్న అక్టోబర్‌ సర్‌ప్రైజ్‌ వికటించవచ్చన్నది నిపుణుల అంచనా. హడావిడిగా అక్టోబర్‌లోనే అమెరికన్లకు కరోనా వాక్సిన్‌ ఇవ్వడం ఏమాత్రం శ్రేయస్కరం కాదంటున్నారు వైద్య నిపుణులు. ఆరోగ్యంతో ఆటలాడడం సరికాదని, అక్టోబర్‌ సర్‌ప్రైజ్‌ కాస్తా… అక్టోబర్‌ ట్రాజెడీగా మారే ప్రమాదముందంటున్నారు నిపుణులు. ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలు అసలుకే మోసం తేవచ్చని, పరిశోధనలు పూర్తి కాకుండా ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తే ప్రమాదముందంటున్నారు. ఈసారి కరోనా ప్రభావం పోలింగ్‌పైనా ఉండొచ్చంటున్నారు. కరోనా కారణంగా అబ్సెంటీ బ్యాలెట్‌లు సకాలంలో చేరుకోకపోవచ్చని అంచనా వేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రానికి వెళ్లలేకపోయిన వారు అబ్సెంటీ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కరోనా కారణంగా ఫ్లోరిడా రాష్ట్రంలో అబ్సెంటీ బ్యాలెట్‌ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఈ ఎన్నికల్లో ఫ్లోరిడా ఫలితాలు రావడానికి రాత్రి 10 గంటలు దాటొచ్చని భావిస్తున్నారు. 2000 సంవత్సరంలో ఇదే ఫ్లోరిడా కారణంగా అధ్యక్ష ఫలితాలు ఏకంగా నెల ఆలస్యమయ్యాయి. పోటాపోటీగా సాగిన రీకౌంటింగ్‌లో అప్పట్లో జార్జ్‌ బుష్‌ కేవలం 537 ఓట్లతో ఆల్‌గోరెను వెనక్కి నెట్టాడు. ఈ సారి కూడా అదే పరిస్థితి కరోనా కారణంగా అబ్సెంటీ బ్యాలెట్‌తో రావచ్చంటున్నారు.

* అత్యాచార కేసుల్లో దోషులను బహిరంగంగా ఉరితీయడమో లేదా పురుషత్వం కోల్పోయేలా(క్యాస్ట్రేషన్‌) చేయాలని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ అభిప్రాయపడ్డారు. వీటిద్వారానే అత్యాచారాలను అరికట్టవచ్చన్నారు. తాజాగా లాహోర్‌లో జరిగిన అత్యాచార ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

* తెలంగాణ సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించారు. సచివాలయం కూల్చివేతతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఆయన అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

* చందన సీమలో మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నట్లు బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ బావ మరిది, కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్‌ అల్వా కుమారుడు ఆదిత్య అల్వా ఇంట్లో పోలీసులు సోదారులు జరిపారు. చందన సీమలో డ్రగ్‌ వ్యవహారం కేసులోని 12 మంది నిందితుల్లో ఆదిత్య అల్వా ఒకరు. సెర్చ్‌ వారెంట్‌తో వెళ్లి సోదాలు నిర్వహించామని జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు (క్రైమ్‌) మీడియాకు తెలిపారు.

* కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ సమయంలో కార్మికుల మరణాలకు సంబంధించిన గణాంకాలు తమ వద్ద లేవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించటంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ‘‘లాక్‌డౌన్‌ సమయంలో ఎందరు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారో, ఎందరు ఉపాధి కోల్పోయారో మోదీ ప్రభుత్వానికి తెలియదు. కార్మికుల మరణాలను ప్రపంచం చూసింది, కానీ మోదీ ప్రభుత్వానికి ఆ సంగతే తెలియదు. వారిపై ఈ మరణాల ప్రభావం ఏమాత్రం పడలేదు. వారు లెక్కించనంత మాత్రాన మరణాలు సంభవించనట్లేనా?’’ అని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించారు.

* భారత్‌ – చైనా సరిహద్దుల్లో నెలకొంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో లద్దాఖ్‌ వద్ద పరిస్థితులపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లోక్‌సభలో ప్రకటన చేశారు. లద్దాఖ్‌లో 1962లో చైనా వేల కి.మీల భూభాగం ఆక్రమించిందన్నారు. చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. 90వేల చదరపు కి.మీల భారత భూభాగాన్ని డ్రాగన్‌ ఆక్రమించిందని సభకు వెల్లడించారు. ‘‘ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. సరిహద్దుల్లో మౌలిక వసతులు కల్పించాం. దేశం మొత్తం సైన్యం వెంటే ఉంది’’ అని రాజ్‌నాథ్‌ అన్నారు.

* పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్‌ నాటికి పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు వరప్రదాయని అని చెప్పారు. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు కావడంతో మొత్తం ఖర్చును కేంద్రమే భరించాల్సి ఉందన్నారు. అయినప్పటికీ కేంద్ర నిధుల కోసం వేచి చూడకుండా ఇప్పటికే ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం రూ.3,805 కోట్లు ఖర్చుచేసిందని విజయసాయి వివరించారు.

* కరోనా మహమ్మారిపై ఇంకా ఎంతో కాలం పోరాడాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోందని ఆయన స్పష్టం చేశారు. ఉత్తమ వైద్య సేవలు అందించడం వల్లనే దేశంలో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. కేసులతో పోలిస్తే దేశంలో మరణాల సంఖ్య ప్రపంచంలోనే అతి తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు.

* ఇతర గ్రహాలపై జీవం కోసం మానవుడు సాగిస్తున్న అన్వేషణలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. శుక్రగ్రహంపై జీవం ఉండే అవకాశం ఉందని ఇటీవల కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ గ్రహం వాతావరణంలో స్వల్ప స్థాయిలో ఫాస్పీన్‌ వాయువు ఉన్న ఆనవాళ్లను గుర్తించారు. వరుసలో మనకంటే ముందు ఉండే శుక్రుడిపై పగటి ఉష్ణోగ్రతలు సీసాన్ని కరిగించే స్థాయిలో ఉంటాయి. అలాగే వాతావరణంలో భారీ స్థాయిలో కార్బన్‌డయాక్సైడ్‌ ఉంటుంది.

* తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు కుదించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సమావేశాలను కుదించాలన్న ప్రతిపాదన వచ్చింది. సోమవారం నాంపల్లి ఎమ్మెల్యే సహా అధికారులు, సిబ్బంది కలిపి సుమారు 52 మంది కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో శాసనసభాపక్ష నేతలతో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమావేశమయ్యారు. సమావేశాల కుదింపు విషయంపై చర్చించారు.