DailyDose

కోటి రూపాయిలు లంచం తీసుకుంటూ దొరికిన రైల్వే అధికారి-నేరవార్తలు

కోటి రూపాయిలు లంచం తీసుకుంటూ దొరికిన రైల్వే అధికారి-నేరవార్తలు

* భారతీయ రైల్వే ఇంజినీరింగ్‌ సర్వీస్‌లో ఓ ఉన్నతాధికారి రూ.కోటి లంచం తీసుకొని సీబీఐ అధికారులకు దొరికిపోయాడు. దీంతో నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు అతడిని అరెస్టు చేశారు. ఆదివారం దేశవ్యాప్తంగా 20 చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 1985 బ్యాచ్‌‌కు చెందిన సీనియర్‌ అధికారి మహేందర్‌ సింగ్‌ చౌహన్‌ లంచం తీసుకున్నట్లు గుర్తించారు. నార్తన్‌ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వేలో విధులు నిర్వర్తిస్తున్న మహేందర్‌.. పలు ప్రాజెక్టులకు కాంట్రాక్టులు ఇవ్వడం కోసం రూ.కోటి లంచంగా తీసుకున్నాడని అధికారులు తెలిపారు.

* ఆన్‌లైన్‌ పాఠాలు వినడానికి సెల్‌ఫోన్‌ కావాలని అడగగా, తల్లిదండ్రులు కొనివ్వలేదనే మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఎస్పై గండ్రాతి సతీష్‌ కథనం ప్రకారం……..శీల వెంకన్న, మంజుల దంపతుల కుమార్తె సింధూజ 9వ తరగతి చదువుతోంది.స్మార్ట్‌ఫోన్‌ లేకపోవడంతో పాఠాలకు దూరమైంది.ఈ క్రమంలో సెల్‌ఫోన్‌ కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతూ వస్తోంది.అయితే వారు ఫోన్‌ కొనివ్వకపోవడంతో మనస్తాపం చెంది ఆదివారం ఇంటి పరిసరాల్లో గల చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

* మంచిర్యాల పట్టణంలో ఏ సి సి హోమ్ శిల్డ్ ఎదురుగా లారీ బైక్ ఆక్సిడెంట్, ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న డీసిపి ఉదయ్ కుమార్, టౌన్ సిఐ ముత్త లింగయ్య,ట్రాఫిక్ ఎస్.ఐ వినోద్, ఎ.ఎస్.ఐ శ్రీనివాస్, లు మృతదేహాలని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు దర్యాప్తు నిమిత్తం పూర్తి సమాచారం వెల్లడిస్తామని వివరించారు.

* విశాఖ సిటీ ఆర్టీసీ కాంప్లెక్స్ అండర్ పాసేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.జైల్ రోడ్డు వైపు నుండి మద్దిలపాలెం వైపు వస్తున్న ద్విచక్ర వాహనదారుడ్ని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న రమేష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా వాహనం నడుపుతున్న రిటైర్డ్ ఏఎస్ఐ రామారావు కు తీవ్ర గాయాలయ్యాయి.