Editorials

ఫూల్స్ డే అని ఎందుకు అంటారు?

ఫూల్స్ డే అని ఎందుకు అంటారు?

ఏప్రిల్ ఒకటో తేదీ వస్తుంటే చాలు.. చాలామంది తమ ఆప్తులను, స్నేహితులను ఎలా ఫూల్స్ చేయాలనే ప్లాన్లతో బిజీగా గడిపేస్తారు. వారు అప్రమత్తంగా లేని సమయంలో నీ వెనుకలా ఏదో ఉందనో లేదా ఏదైనా అబద్దం చెప్పి నమ్మించడమో చేసి ఫూల్స్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి సరదాలు కాసేపు హాస్యంగా నవ్వుకొనేందుకు దోహదం చేస్తాయి. కరోనాతో కలవరాన్ని దూరం చేయడానికి నవ్వు కూడా ఒక మందు. మరి, ఏప్రిల్ 1వ తేదీనే ఇది ఎందుకు నిర్వహిస్తారు? ఈ రోజు ప్రత్యేకత ఏమిటీ తదితర వివరాలను తెలుసుకోవాలంటే.. తప్పకుండా ‘ఫుల్స్ డే’ చరిత్ర తెలుసుకోవాల్సిందే.
****ఏప్రిల్ ఒకటి ఫూల్స్ డే అనేది ప్రత్యేకంగా ఒకరు మొదలుపెట్టారని చెప్పడానికి ఆధారాలేవీ లేవు. అయితే, ప్రాచీన కాలం నుంచి ఈ రోజును సరదా దినంగా పాటించే సాంప్రదాయం ఉన్నట్లు తెలిసింది. అంటే.. ఇతరులను ఆట పట్టించి ఫూల్స్ చేయడం ద్వారా హాస్యాన్ని ఆస్వాదించడం కోసం అలా చేసేవారట. ఈ సాంప్రదాయం జూలియన్ క్యాలెండర్ నుంచి మొదలైనట్లు చెబుతుంటారు.
**ఫ్రాన్సులో 11వ పోప్ చార్లెస్ పాత క్యాలెండర్ స్థానంలో రోమన్ క్యాలెండర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అప్పట్లో ఏప్రిల్ 1వ తేదీని నూతన సంవత్సరంగా జరుపుకోనేవారు. అయితే, 1582 నుంచి జనవరి నెలలో కొత్త సంవత్సరాన్ని నిర్వహించడం మొదలు పెట్టారని, ఎవరైనా ఏప్రిల్ 1న న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పినట్లయితే.. వారిని వెర్రివాళ్లుగా భావించేవారని సమాచారం. వారినే ఏప్రిల్ ఫూల్స్ అని పిలిచేవారట. అది క్రమేనా ఏప్రిల్ ఒకటి ఫూల్స్ డేగా మారినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఈ రోజు వల్ల అంతా హాయిగా నవ్వుకోవడమే కాకుండా.. అంతా మరింత దగ్గరవుతారని భావిస్తారు. అందుకే ఏడాదిలో ఇలాంటి రోజు ఒకటి ఉండాలనే ఉద్దేశంతో 1వ తేదీని ఫూల్స్ డేగా నిర్వహిస్తున్నారు.
**కొన్ని దేశాల్లో జనవరి నుంచి ఏప్రిల్ వరకు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 1వ తేదీ రోజున ఇతరులను ఫూల్స్ చేస్తూ ఆనందంగా గడిపేవారని చెబుతుంటారు. కెనడా, ఇటలీ, స్విట్జర్లాండ్, బెల్జియం వంటి దేశాల్లో తమ స్నేహితులు లేదా బంధువుల తెలియకుండా ‘I AM FOOL’ అని రాసిన కాగితాన్ని అంటించి ఆటపట్టించేవారట. ఈ సాంప్రదాయాన్ని ఇండియాలో కూడా పాటిస్తుంటారు. డెన్మార్క్‌లో మే 1న ‘ఫూల్స్ డే’ నిర్వహిస్తారు. స్పెయిన్‌లో ఏప్రిల్ ఒకటో తేదీన ‘హోలీ ఇన్నోసెంట్స్’ అనే పండుగ నిర్వహిస్తారు. ఇరాన్‌లో నూతన సంవత్సర వేడుకల 13వ రోజు ‘సిజదా బెదర్’ పేరుతో ఫూల్స్ డేను జరుపుకుంటారు. చూశారుగా.. ఏప్రిల్ ఒకటో తేదీ ‘ఫూల్స్ డే’ ప్రత్యేకత.
**నవ్వించాలి.. నవ్వులపాలు చేయకూడదు
ఏప్రిల్ 1వ తేదీని సరదాగా నవ్వుకోవడం కోసమే నిర్వహిస్తున్నారు. అయితే, బంధుమిత్రులను నవ్వులపాలు చేసేలా ఉండకూడదు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఏ దేశమూ ఈ ఏప్రిల్ ఫూల్స్‌ను చేసుకొనే స్థితిలో లేవు. ప్రస్తుతం ఇళ్లల్లో క్వారంటైన్‌లో ఉన్నవారు తమ కుటుంబికులతో ఫూల్స్ డేను జరుపుకోవచ్చు. అయితే, కరోనా వైరస్ గురించి తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా భయాందోళనకు గురిచేయొద్దు. అలా చేస్తే.. లేనిపోని చిక్కుల్లో పడతారు. ముఖ్యంగా ఫేక్ మెసేజుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.