Politics

తెలంగాణాలో చంద్రబాబుకు ఉన్న ఒక్కడు పాయే!-తాజావార్తలు

తెలంగాణాలో చంద్రబాబుకు ఉన్న ఒక్కడు పాయే!-తాజావార్తలు

* టీడీపీ ఏకైక ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వ‌ర‌రావు టీడీపీకి రాజీనామా.. టీఆర్ ఎస్‌లో చేరిక‌. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో భేటి…? టీడీపీ శాస‌న‌స‌భాప‌క్షాన్ని టీఆర్ ఎస్‌లో విలీనం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌. ఈమేర‌కు స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డికి లేఖ‌. లేఖ‌ను స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌తో క‌ల్సి స్పీక‌ర్‌కు అందించిన మెచ్చ నాగేశ్వ‌ర‌రావు. శాస‌న స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డితో కూడ భేటీ అయిన టీడీపీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వ‌ర‌రావు. మ‌రికాసేప‌ట్లో టీడీఎల్పీ విలీనంపై అధికారిక బులిటెన్ జారీ చేయ‌నున్న శాస‌న‌స‌భ కార్య‌ద‌ర్శి న‌ర్సింహాచారి.

* తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. రోజు వారీ కేసులు 2వేలకు చేరువలో ఉన్నాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 74,274 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,914 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఐదుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,734కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 285 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,299కి చేరింది. ప్రస్తుతం 11,617 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 6,634 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 393 కేసులు నమోదయ్యాయి..

* నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి, సాగర్ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరని, ప్రజాస్వామ్యానికి.. నియంతృత్వానికి మధ్య జరుగుతున్న సమరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభివర్ణించారు. సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా నిడుమనూర్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్ కుమార్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్‌, మెదక్ లోక్ సభ ఇంచార్జీ గాలి అనిల్ కుమార్‌తో కలిసి భట్టి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భట్టి మాటల తూటాలు పేల్చారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో వనరులు, ఆత్మగౌరవం, కొలువులు ప్రజలకు అందడం లేదని భట్టి విక్రమార్క తెలిపారు. కేసీఆర్ నియంతృత్వ పోకడతో, అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పుడు మార్గాలతో ప్రజలను అణగదొక్కుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో పారే ప్రతినీటి బొట్టు, పండే ప్రతి కంకిలోనూ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు, ప్రశ్నించే గొంతును అసెంబ్లీకి పంపేందుకు సాగర ప్రజలు సిద్ధమయ్యారని జోస్యం చెప్పారు. నియంతృత్వ పోకడలతో రాష్ట్రాన్ని నలిపేస్తున్న కేసీఆర్ కుటుంబానికి ఈ ఉప ఎన్నికతో ప్రజలు బుద్ది చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికను జానారెడ్డికి, కాంగ్రెస్ ఎన్నికగా చూడడం లేదని.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ఎన్నికగా చూస్తున్నట్లు వివరించారు. ఉద్యోగాల సాధన కోసం ఆత్మార్పణలు చేసుకుంటున్న యువతకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఒక అందివచ్చిన అవకాశమని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఎన్నికల్లో జనారెడ్డిని గెలిపించాల్సిన ఆవశ్యకత అందరిపైన ఉందని గుర్తుచేశారు. జానారెడ్డిని గెలిపించి కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకురావాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రతి ఊరికి నీళ్లు, ఇళ్లు, ఆరోగ్యశ్రీ కార్డు, ప్రతి కుటుంబంలోని విద్యార్థులు చదువుకునేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను, ఉపాధి హామీ జాబ్ కార్డును, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించినది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. జానారెడ్డికి ప్రజలంతా పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. డబ్బు, మద్యం, అధికారంతో ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటున్న కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ది చెబుతారని పేర్కొన్నారు. సాగర్ ప్రజలను కొనగలను అని విర్రవీగుతున్న కేసీఆర్‌కు ఇక్కడ ప్రజలు ఓటు ద్వారా సమాధానం చెబుతారని భట్టి విశ్వాసం వ్యక్తం చేశారు.

* గడచిన వర్షాకాలంలో భారీ వరదలు లేకపోవడంతో, ఇప్పటివరకూ 2019, 2020 ఆరంభంలో వచ్చిన వరదల నీటితోనే నెట్టుకుని వచ్చిన శ్రీశైలం జలాశయం ఇప్పుడు ఖాళీ అయింది. శ్రీశైలం రిజర్వాయర్ లో కనీస నీటి మట్టం 834 అడుగులు కాగా, ప్రస్తుతం 812 అడుగులు మాత్రమే నీరుంది. దీంతో జలాశయం వెలవెలబోతోంది. విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికే నిలిచిపోగా, జలాశయం నుంచి నీరు వెళ్లే ఎత్తిపోతల పథకాలకు నీటిని లిఫ్ట్ చేయలేని పరిస్థితి నెలకొంది.

* టాలీవుడ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్ కరోనా బారినపడ్డారు. ఆయనకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. దాంతో ఐసోలేషన్ లోకి వెళ్లారు. తనను కలిసినవాళ్లందరూ కరోనా టెస్టులు చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజయేంద్రప్రసాద్ తెలిపారు. తన సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అటు బాలీవుడ్ లోనూ కరోనా వేగంగా వ్యాపిస్తోంది. సెకండ్ వేవ్ లో పలువురు తారలు కరోనా బాధితుల జాబితాలో చేరారు. అమీర్ ఖాన్, గోవిందా, అక్షయ్ కుమార్, బప్పీ లహరి, అలియా భట్, మాధవన్ వంటి సెలబ్రిటీలకు కరోనా పాజిటివ్ అని తేలింది.

* ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు నారాయణుడితో పోల్చడం దురదృష్టకరమని ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు.

* ఏపీలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేసిన డివిజన్ బెంచ్. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు. ఎన్నికల నిర్వహణకు తొలగిన అడ్డంకి. కౌంటింగ్ మాత్రం నిలిపివేయాలని తీర్పు.

* ఏపీలో కరోనా తీవ్రత రోజు రోజుకీ మరింత అధికమవుతోంది. ఇటీవల కాలంతో పోలిస్తే ఒక్కరోజులో నమోదైన కేసుల సంఖ్య భారీగా పెరిగింది. 24 గంటల వ్యవధిలో 31,812 నమూనాలను పరీక్షించగా 2,331 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 368, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,13,274కి చేరింది.

* ప్రత్యేక రసాయనాల తయారీ సంస్థ ‘క్లీన్‌ సైన్స్ అండ్‌ టెక్నాలజీ‌’ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీకి ప్రాథమిక వివరాలు సమర్పించింది. మొత్తం రూ.1,400 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. కంపెనీకి చెందిన ప్రమోటర్లు, వాటాదారులే వారి షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయించనున్నారు. ఇష్యూలో కొత్త షేర్లేమీ విక్రయానికి ఉండవని సెబీకి సమర్పించిన వివరాల్లో క్లీన్‌ సైన్స్‌ పేర్కొంది.

* కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 12 నుంచి శ్రీవారి టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం తితిదే ఓ ప్రకటన విడుదల చేసింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం వద్ద భక్తులకు సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. అయితే.. ఈ కౌంటర్ల క్యూలైన్ల వద్దకు భక్తులు గుంపులుగా చేరుతుండటంతో కరోనా వ్యాపించే ప్రమాదం పొంచి ఉందని తితిదే భావించింది.