NRI-NRT

భారత్‌కు అమెరికా ₹770కోట్లు సాయం-తాజావార్తలు

భారత్‌కు అమెరికా ₹770కోట్లు సాయం-తాజావార్తలు

* కరోనాపై పోరులో భారత్‌కు మద్దతు కొనసాగిస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. భారత్‌కు ₹770కోట్లు (వంద మిలియన్‌ డాలర్ల) విలువైన వైద్య సామగ్రిని సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శ్వేతసౌధం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా వైద్య సామగ్రి సరఫరా చేసేందుకు కొనసాగుతున్న ప్రయత్నాల్ని అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్‌ బుధవారం ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.

* కరోనా సెకండ్‌ వేవ్ ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. దీని వల్ల లక్షలాది మంది ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి సాయం చేద్దాం అని కోరారు యువ నటులు రానా, నాగ చైతన్య. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా పిలుపునిచ్చారు. ‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో ఎంతోమంది బాధపడుతున్నారు. వాళ్ల మనుగడకి మనవంతు కృషి చేద్దాం. అందరూ కలిసి సాయం చేయాలని కోరుతున్నాను. అత్యవసరాలైన ఆక్సిజన్‌, ఆహారం, మందులు అందించేందుకు ముందుకొస్తారని భావిస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు రానా. ‘ఈ క్లిష్ట సమయంలో చిన్న సాయం అయినా ఎంతో ఉపయోగపడుతుంది. దయచేసి మీకు తోచిన సాయం చేయండి. మాస్క్‌ ధరించండి.. జాగ్రత్తగా ఉండండి’ అని పేర్కొన్నారు నాగ చైతన్య.

* కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణ సరికాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని పరీక్షలు వాయిదా వేయాలని ఆయన కోరారు. ఈ మేరకు విశాఖలోని ఆయన కన్వెన్షన్‌ భవనంలో నిరసన దీక్ష చేపట్టారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకునే వరకు దీక్ష కొనసాగిస్తానని పాల్‌ స్పష్టం చేశారు.

* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ అన్నారు. ఆయన బెయిల్‌ షరతులను ఉల్లంఘించారని ఆరోపించారు. తిరుపతిలో చింతామోహన్‌ మీడియాతో మాట్లాడుతూ.. సహ నిందితులైన అధికారులకు పోస్టింగ్‌ ఇచ్చారని, సాక్షులను జగన్‌ ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. రూ.లక్ష లంచం కేసులో బంగారు లక్ష్మణ్‌ను జైలుకు పంపినవిషయాన్ని గుర్తు చేశారు. జగన్‌పై రూ.వందల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు.

* రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తంచేసింది. కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. మినీ పుర పోరు నిర్వహణపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఎస్‌ఈసీకి లేదా అని ప్రశ్నించింది. కరోనా నియంత్రణపై ప్రభుత్వ తీరునూ తప్పుబట్టింది. రేపటితో రాత్రిపూట కర్ఫ్యూ ముగుస్తుంది.. తర్వాత చర్యలేంటని న్యాయస్థానం ప్రశ్నించగా.. పరిస్థితిని సమీక్షించి రేపు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం సమాధానమిచ్చింది. దీనిపై న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. ‘‘చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు? నియంత్రణ చర్యలపై దాగుడు మూతలెందుకు? కనీసం ఒకరోజు ముందు చెబితే నష్టమేంటి? కట్టడి చర్యలపై మేం ఎలాంటి సూచనలూ ఇవ్వడం లేదు. క్షేత్ర స్థాయి పరిస్థితులు చూసి నిర్ణయం తీసుకోండి’’ అని సూచించింది. దీనిపై స్పందించిన ఏజీ ప్రసాద్‌.. ప్రభుత్వాన్ని సంప్రదించి మధ్యాహ్నంలోగా చెబుతామన్నారు.

* విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిర్వహించనున్న ఇంటర్‌ పరీక్షలు, వాటి నిర్వహణ తదితర అంశాలను మంత్రి వివరించారు. ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షల నిమిత్తం 1,452 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతంతో పోల్చితే అదనంగా 41 సెంటర్లనే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

* కరోనా వ్యాక్సిన్‌ను పూర్తి మోతాదులో తీసుకున్నట్లయితే(రెండు డోసుల్లో) ఇక ఆసుపత్రి ముప్పు తప్పినట్లేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా 65ఏళ్ల వయసు పైబడినవారు వ్యాక్సిన్‌ తీసుకుంటే కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరే ముప్పు 94శాతం తప్పినట్లేనని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా కరోనా వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొని మరణంబారిన పడే ప్రమాదం నుంచి గట్టెక్కినట్లేనని పేర్కొంది.

* కరోనా సమయంలో ఆక్సిజన్‌ లేక రోగులు చనిపోవడం దేశానికే అవమానకరమని తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. అవసరమైన ఆక్సిజన్‌ను కేంద్రం యుద్ధప్రాతిపదికన సరఫరా చేయాలని ఆయన కోరారు. వ్యాక్సిన్‌ డోసుల ఉత్పత్తి యుద్ధ ప్రాతిపదికన పెరగాలన్నారు. వ్యాక్సిన్‌ లేకపోతే గందరగోళమవుతుందని అధికారులు చెబుతున్నారని తెలిపారు.

* డ్రగ్స్‌ కేసు వివరాలను ఈడీకి ఎందుకు ఇవ్వడంలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. డ్రగ్స్‌ కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలంటూ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి దాఖలుచేసిన పిల్‌పై విచారణ జరిపింది. 2016 నాటి కేసులు సీబీఐ, ఈడీకి ఇవ్వడంలేదంటూ న్యాయవాది రచనా రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎక్సైజ్‌ అధికారులు డ్రగ్స్‌ కేసు వివరాలను తమకు ఇవ్వడం లేదని ఈడీ తెలిపింది.ఎఫ్‌ఐఆర్‌లు, ఛార్జిషీట్లు ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును కోరింది.

* కొవిడ్‌-19 మహమ్మారిని ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కేంద్రాన్ని కోరినట్లు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగా కేంద్రానికి రాసిన లేఖలో కొవిడ్‌-19 సంక్షోభాన్ని ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలని ఠాక్రే కోరినట్లు వెల్లడించారు. సుప్రీం, హైకోర్టులు కరోనా తీవ్రతను చూసి ఆందోళ చెందుతున్నాయని ఇలాంటి సందర్భంతో జాతీయ విపత్తు ప్రకటించడం దేశానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని ఆయన తెలిపారు.