Business

గుంటూరులో పెట్రోల్ భగభగ-వాణిజ్యం

గుంటూరులో పెట్రోల్ భగభగ-వాణిజ్యం

* దేశంలో పెట్రో ధరలు మండిపోతున్నాయి. వరుసగా 15వ రోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోల్‌, డీజిల్‌పై 19 పైసల నుంచి 30 పైసలు వరకు పెంచారు. దీంతో మొత్తం 15 రోజుల వ్యవధిలో లీటరు పెట్రోల్‌పై రూ.3.54, డీజిల్‌పై రూ.4.16 చొప్పున పెరిగింది. తాజా పెంపుతో గుంటూరులో లీటరు పెట్రోల్‌ ధర రూ.100లు దాటేసింది. ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ రూ.100.12లు.. డీజిల్‌ ధర రూ.94.44లుగా ఉంది. గుంటూరులో ప్రీమియం పెట్రోల్‌ ధర రూ.103.58లుగా ఉంది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర 99.92, డీజిల్‌ ధర రూ.94.24లుగా ఉండగా.. విజయవాడలో లీటరు ప్రీమియం పెట్రోల్‌ ధర రూ.103.38గా ఉంది. 15వ రోజూ పెంచిన ధరలతో దేశంలోని కొన్ని చోట్ల లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100లు దాటేసింది. దిల్లీలో లీటరు పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెరగడంతో.. పెట్రోల్‌ ధర రూ.93.94లు, డీజిల్‌ ధర రూ.84.89లుగా ఉంది. ముంబయిలో లీటరు పెట్రోల్‌ ధర రూ.100.19లుగా ఉండగా.. డీజిల్ ధర రూ.92.17గా ఉంది.

* భారత్‌లో అతిపెద్ద బ్రోకరేజీ సంస్థ జీరోదా వ్యవస్థాపకులు నితిన్‌, నిఖిల్‌ కామత్‌ సోదరులు ఒక్కొక్కరు దాదాపు రూ.100 కోట్ల వార్షిక వేతనాన్ని(టేక్‌ హోం) పొందనున్నారు. నితిన్‌ భార్య సీమా పాటిల్‌ సైతం అంతే మొత్తం వేతనం అందుకోనున్నారు. ఈ మేరకు కంపెనీ బోర్డు శుక్రవారం ఆమోద ముద్ర వేసింది.

* దేశీయ విమాన ప్రయాణం మరింత ప్రియం కానుంది. విమానయాన ఛార్జీల దిగువ పరిమితిని జూన్‌ 1 నుంచి 13 – 16 శాతం పెంచుతూ పౌరవిమానయాన శాఖ శుక్రవారం నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. ఎగువ పరిమితిలో మాత్రం మార్పు చేయలేదు కేంద్రం ఉత్తర్వుల మేరకు.. 40 నిమిషాల విమాన ప్రయాణానికి ఛార్జీల దిగువ పరిమితి రూ. 2,300 నుంచి రూ. 2,600లకు పెరుగుతుంది. 40-60 నిమిషాల ప్రయాణానికి దిగువ పరిమితి ఛార్జీ ప్రస్తుతం రూ. 2,900 ఉండగా అది రూ. 3,300కి పెరుగుతుంది. 60-90 నిమిషాల ప్రయాణానికి రూ.4000, 90-120 ని.కు రూ.4700, 120-150 ని.కు రూ.6100, 180-210 ని.కు 8700 దిగువ పరిమితిగా ఉండనుంది.

* కొవిడ్‌-19 తొలి దశ.. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ తర్వాత ఏడాదిగా ఎంతో మందిపై ఆర్థికంగా ప్రతికూల ప్రభావం పడింది. సాధారణ పౌరులు, ఉద్యోగులు, వ్యాపారులకూ ఆదాయాలు తగ్గడంతో, ఖర్చులు తట్టుకునేందుకు చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తోంది. కొవిడ్‌ బాధితుల చికిత్స కోసం రూ.లక్షలు ఖర్చవుతుండటంతో అత్యవసరంగా నగదు కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇలాంటి సందర్భాలన్నింటిలోనూ బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి అప్పులు చేస్తోండటం ఇప్పుడు అధికంగా కనిపిస్తోంది. భారతీయులు సహజంగానే పసిడి ప్రియులు. అందుకే, ప్రతి కుటుంబంలోనూ ఎంతోకొంత బంగారం తప్పనిసరిగా ఉంటుంది. అవసరం అయినప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టి, అప్పు తీసుకోవడం అనాదిగా వస్తున్నదే. గత ఏడాది కాలంలో ఇది మరింత పెరిగింది. వ్యక్తిగత రుణాలు.. ఇతర హామీ అవసరం లేని అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్న నేపథ్యంలో బంగారమే ఎంతోమందిని ఆదుకుంటోంది.