Business

స్మార్ట్ గ్యాస్ సిలిండర్లు-వాణిజ్యం

స్మార్ట్ గ్యాస్ సిలిండర్లు-వాణిజ్యం

* ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల బుకింగ్‌లు ప్రారంభమైన తొలి 24 గంటల్లో లక్ష మంది రిజర్వ్‌ చేసుకున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలో విపణిలోకి విడుదల చేయనున్న ఈ విద్యుత్తు స్కూటర్ల బుకింగ్‌లు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఓలాఎలక్ట్రిక్‌.కామ్‌లో రూ.499 రిఫండబుల్‌ డిపాజిట్‌ చెల్లించి ఈ స్కూటర్‌ను బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. వినియోగదారుల నుంచి అందిన స్పందన పట్ల ఓలా ఛైర్మన్, గ్రూపు సీఈఓ భావిశ్‌ అగర్వాల్‌ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్రత్యేకతలను కంపెనీ ఇప్పటివరకు వెల్లడించలేదు.

* గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త..! ఇకపై గ్యాస్‌ ఎప్పుడు ఖాళీ అవుతుందనే విషయాన్ని తెలుసుకోవడం మరింత సులువుకానుంది. అంతేకాకుండా గ్యాస్‌ సిలిండర్ల బరువు కూడా భారీగా తగ్గనుంది. తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) కొత్తగా స్మార్ట్‌ ఎల్‌పీజీ సిలిండర్లను విడుదల చేసింది. వీటిని ఇండానే కాంపోజిట్ సిలిండర్లుగా పిలువనున్నారు. ఈ కొత్త స్మార్ట్ సిలిండర్లతో కస్టమర్లు తమ తదుపరి రీఫిల్‌ను ఎప్పుడు బుక్‌ చేయాలనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చును.

* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి కేంద్రం తీపికబురును అందించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాన్ని 17 శాతం నుంచి 28 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. డీఎ పెంపు జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. సుమారు 54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. కాగా తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరొ బొనాంజాను ప్రకటించింది.

* వ్యాపార సంస్థల సమాచారం తెలిపే జస్ట్‌ డయల్‌లో మెజార్టీ వాటా (66.95 శాతం) కొనుగోలుకు ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) సిద్ధమైంది. సంస్థలో ప్రమోటర్ల నుంచి 40.95 శాతం వాటా కొనుగోలుకు శుక్రవారం ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం రూ.3,497 కోట్లు వెచ్చించనుంది. జస్ట్‌ డయల్‌ వ్యవస్థాపకుడు వీఎస్‌ఎస్‌ మణి మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ హోదాలో కంపెనీని ముందుకు నడిపించేలా ఈ ఒప్పందం జరిగింది. కచ్చితంగా అమలయ్యేలా కుదరిన ఒప్పందం ప్రకారం, ఆర్‌ఆర్‌వీఎల్‌ కొనుగోలు చేస్తున్న 40.95% వాటాలో 25.33 శాతాన్ని (2.12 కోట్ల ఈక్విటీ షేర్లు) కంపెనీ ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో జస్ట్‌ డయల్‌ కేటాయించనుంది. ఇందుకు ఒక్కో షేరుకు రూ.1,022.25 చొప్పున ఆర్‌ఆర్‌వీఎల్‌ చెల్లించనుంది. వ్యవస్థాపకులు వీఎస్‌ఎస్‌ మణి నుంచి 1.31 కోట్ల షేర్లను (15.62 శాతం వాటా) రూ.1,020 చొప్పున కొనుగోలు చేయనుంది. ఆర్‌ఆర్‌వీఎల్‌ చొప్పిస్తున్న ఈ మూలధనాన్ని సంస్థ వృద్ధికి, విస్తరణకు వినియోగించనున్నట్లు జస్ట్‌ డయల్‌ వెల్లడించింది. ‘లక్షల సంఖ్యలో ఉన్న మా భాగస్వామి వ్యాపారులు, సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థల కోసం డిజిటల్‌ పర్యావరణ వ్యవస్థను మరింత పెంచేందుకే జస్ట్‌ డయల్‌లో వాటా కొనుగోలు చేస్తున్నామ’ని ఆర్‌ఆర్‌వీఎల్‌ డైరెక్టర్‌ ఈశా అంబానీ వెల్లడించారు. జస్ట్‌ డయల్‌ను 25 ఏళ్ల కిందట మణి ప్రారంభించారు. ‘రిలయన్స్‌ రిటైల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా బి2బి ప్లాట్‌ఫామ్‌పై మా వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళతామ’ని మణి తెలిపారు.