Sports

78 పరుగులకు ఇండియా ఆలౌట్-తాజావార్తలు

78 పరుగులకు ఇండియా ఆలౌట్-తాజావార్తలు

* లీడ్స్‌ వేదికగా టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌.. మొదటి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకు ఆలౌటైంది.తొలి సెషన్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసిన టీమ్‌ఇండియా..రెండో సెషన్‌లో 22 పరుగులు చేసి కూప్పకూలింది. కేఎల్ రాహుల్‌(0), చతేశ్వర్(1), విరాట్‌ కోహ్లీ(7), పంత్(2), జడేజా(4) పరుగులు చేసి తీవ్రంగా నిరాశపర్చారు.రోహిత్‌ శర్మ(19) టాప్‌ స్కోరర్. రహానె(18) పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో అండర్సన్ 3, ఓవర్టన్‌ 3, రాబిన్సన్‌ 2, సామ్‌ కరన్‌ 2 వికెట్లు పడగొట్టారు.

* విజయనగరం జిల్లా బొబ్బిలిలో కరోనా కలకలం రేగింది. బొబ్బిలి పరిధిలోని మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పది మంది 4వ తరగతి విద్యార్థులు కొవిడ్‌ బారినపడినట్లు ఎంఈవో లక్ష్మణరావు తెలిపారు. పాఠశాలలో 160 మంది విద్యార్థులు ఉండగా.. ఏడుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. పది మంది విద్యార్థులు వైరస్‌ బారినపడడంతో పిల్లల తల్లిదండ్రులు, పాఠశాల మధ్యాహ్న భోజన సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించాలని నిర్ణయించినట్లు ఎంఈవో వెల్లడించారు. వారం రోజుల పాటు పాఠశాలకు సెలవులు ప్రకటించాలని మున్సిపల్‌ కమిషనర్‌ను కోరినట్లు చెప్పారు. కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విద్యార్థులందరి ఆరోగ్యాలు నిలకడగా ఉన్నాయని.. వారందరికీ వైద్య సేవలు అందిస్తున్నట్లు ఎంఈవో వివరించారు.

* కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌లు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. అయితే, వైరస్‌ నుంచి ఇవి ఎంతకాలం రక్షణ కల్పిస్తాయనే విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా వ్యాక్సిన్‌ నుంచి కలిగే రక్షణ కొన్ని నెలల తర్వాత క్షీణిస్తోందని బ్రిటన్‌ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఐదు నుంచి ఆరు నెలల్లోనే ఫైజర్‌, ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ల నుంచి పొందే రక్షణ తగ్గుముఖం పడుతున్నట్లు తేలింది. వచ్చే నెల నుంచి బూస్టర్‌ డోసు ఇచ్చేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోన్న సమయంలో తాజా అధ్యయనం అందుకు మరింత బలం చేకూరుస్తోంది.

* కొవిడ్‌ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం జగన్‌ సూచించారు. రికవరీరేటు 98.63 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.07 శాతంగా ఉందని, గణాంకాలు, అంకెలతో సంబంధం లేకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కొవిడ్‌-19పై అధికారులతో సమీక్షించిన సీఎం కీలక సూచనలు చేశారు. కొవిడ్‌ మార్గదర్శకాలు పాటించకపోతే కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

* తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. టాప్‌-10లో ఇంజినీరింగ్‌ విభాగంలో ఆరుగురు, అగ్రికల్చర్‌లో నలుగురు ఏపీ విద్యార్థులు ఉండటం గమనార్హం. టాప్‌-5 ర్యాంకులను పరిశీలిస్తే.. ఇంజినీరింగ్‌లో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సత్తి కార్తికేయ తొలి ర్యాంకు, కడప జిల్లా రాజంపేటకు చెందిన పణీశ్‌కు రెండో ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ మూడో ర్యాంకు, నల్గొండ విద్యార్థి రామస్వామికి నాలుగో ర్యాంకు, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన వెంకట ఆదిత్య ఐదో ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్‌ విభాగంలో మొదటి ర్యాంకు హైదరాబాద్‌ బాలానగర్‌కు చెందిన మండవ కార్తికేయ, రెండో ర్యాంకు పెద్దఅంబర్‌పేటకు చెందిన శ్రీనిజకు దక్కింది. మూడో ర్యాంకును కూకట్‌పల్లికి తేరుపల్లి సాయి కౌశల్‌రెడ్డి, నాలుగో ర్యాంకును అనంతపురానికి చెందిన రంగు శ్రీనివాస కార్తికేయ, ఐదో ర్యాంకును రాజమహేంద్రవరానికి చెందిన చందం విష్ణు వివేక్‌ సాధించారు.

* పేద విద్యార్థినికి ఆర్థిక సాయం అందించి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌. వరంగల్ జిల్లా హసన్‌పర్తికి చెందిన విద్యార్థిని మేకల అంజలి రెండేళ్ల క్రితం ఐఐటీలో సీటు సాధించారు. పేదరికం, ఆర్థిక సమస్యల కారణంగా చదువును కొనసాగించేందుకు ఇబ్బంది పడుతున్నానని, ఆర్థిక సాయం చేయాలని మంత్రి కేటీఆర్‌ని గతంలో అభ్యర్థించారు. అంజలి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న కేటీఆర్ వ్యక్తిగతంగా గత రెండేళ్లుగా ఆమె ఫీజులకు అవసరమైన డబ్బులు అందజేశారు. ఈ ఏడాదికి, రానున్న సంవత్సరానికి సంబంధించిన ఫీజు మొత్తాన్ని ఇవాళ ప్రగతిభవన్‌లో అంజలి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా అంజలి చదువు, భవిష్యత్ ప్రణాళికల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆమె తన చదువు దిగ్విజయంగా పూర్తి చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు. తమ కుమార్తె చదువుకు ఆర్థిక సాయాన్ని అందించడం పట్ల అంజలి కుటుంబం కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

* మల్లారెడ్డి విద్యా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు లేవని పార్లమెంట్‌లో కేంద్రమే ప్రకటించిందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. మల్లారెడ్డి విద్యా సంస్థలకు ఎలాంటి అనుమతులు లేవని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఏ గుడిలో అయినా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తనకు విద్యా సంస్థలున్నాయని వెల్లడించారు. తనకు 600 ఎకరాల భూమి ఉందని.. అందులో అసైన్డ్‌, చెరువులకు సంబంధించినది, కబ్జా భూమి లేదని స్పష్టం చేశారు. అంతా న్యాయబద్ధంగా కొనుగోలు చేసి, అభివృద్ధి చేసిన భూమి అని వివరించారు. అలాగే విద్యాసంస్థల్లోని భవనాలన్నింటికీ సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు.