Movies

ఆ నటీమణి చరిత్ర నాశనం చేస్తున్న చైనా

ఆ నటీమణి చరిత్ర నాశనం చేస్తున్న చైనా

చైనా ఇటీవల వ్యక్తుల, సంస్థల కీర్తి ప్రతిష్ఠలను అంచనా వేసి మరీ అణగదొక్కుతోంది. కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థను మించిపోతారనుకుంటే నిర్దాక్షిణ్యంగా వారిని కనుమరుగు చేస్తోంది. ఇటీవల బిలియనీర్‌ జాక్‌ మా ఒక్కసారిగా అదృశ్యమైన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా ఒక బిలియనీర్‌ నటీమణిపై కత్తిగట్టింది. చైనా ఇంటర్నెట్‌ ప్రపంచంలో ఆమెను కనుమరుగు చేసే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టింది. సమాజం మొత్తం ఆమెను మరిచిపోయేట్లు చర్యలు చేపట్టింది. చైనాకు చెందిన నేషనల్‌ రేడియో అండ్‌ టెలివిజన్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ కొరడా తీసుకొని బయల్దేరింది. అన్ని వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లపై నుంచి ఆమె చిత్రాలు, వెబ్‌సిరీస్‌లను తొలగించే పని చేపట్టింది.

చైనాలో విక్కీ ఝావోగా పేరు తెచ్చుకున్న ఝావో వీ అనే నటిపై ప్రభుత్వం కత్తిగట్టింది. ఆమె 1990ల్లో విడుదలైన ‘మై ఫెయిర్‌ ప్రిన్సెస్‌’ అనే కామెడీ సిరీస్‌తో బాగా పాపులర్‌ అయింది. 18వ శతాబ్ధానికి చెందిన క్వింగ్‌ వంశంపై దీనిని చిత్రీకరించారు. ఒక అనాథ అనుకోని పరిస్థితుల్లో యువరాణి ఎలా అయిందనేదే ఈ సిరీస్‌. దీని తర్వాత ఆమె పాపులారిటీ పెరిగిపోవడంతో సినీరంగలోకి అడుగుపెట్టింది. ‘షావాలిన్‌ సాకర్‌’ అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత చైనాలో సూపర్‌స్టార్‌గా ఎదిగింది. 2020లో కూడా ఫ్యాషన్‌ బ్రాండ్‌లు, ఫెండీ, బర్బెర్రీలు ఆమెను ప్రచారకర్తగా నియమించుకొన్నాయి. ఆమె తన పాపులారిటీని సంపద మరింత విస్తరించేందుకు వాడుకొంది. ఆమె భర్త హువాంగ్‌ యూలాంగ్‌ 400 మిలియన్‌ డాలర్లను అలీబాబా పిక్చర్స్‌లో పెట్టుబడిగా పెట్టారు. అలీబాబా పిక్చర్స్‌లో రెండో అతిపెద్ద భాగస్వామి ఆమె కుటుంబమే. 2016లో అత్యంత పిన్నవయస్కులైన బిలియనీర్ల జాబితాలో ఆమె భర్త యూలాంగ్‌ స్థానం పొందాడు.

చైనాకు చెందిన నేషనల్‌ రేడియో అండ్‌ టెలివిజన్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌(ఎన్‌ఆర్‌టీఏ) ఇటీవల హఠాత్తుగా ఝావోకు చెందిన కార్యక్రమాలు, సినిమాలు, ఇతర అంశాలను వెబ్‌ సైట్ల నుంచి తొలగించాలని స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. దీనికి కచ్చితమైన కారణాలను మాత్రం వెల్లడించలేదు. కానీ పలు అంశాలను మాత్రం తెరపైకి వచ్చాయి.

* 2016లో ఝావో సంస్థ ఒక తైవాన్‌ నటికి ప్రధాన పాత్ర ఇచ్చి చిత్రాన్ని నిర్మించడం విమర్శల పాలైంది.
* ఆమె వ్యాపార సంస్థల విస్తరణతో రెగ్యులేటరీల దృష్టిలో పడ్డారు.
* ఆమెకు చెందిన పబ్లిక్‌ రిలేషన్స్‌ కంపెనీ క్లైయింట్‌ అయిన నటుడు ఝాంగ్‌ జెహాన్‌ ఒక వివాదంలో చిక్కుకున్నారు. జపాన్‌లోని ‘యుసుకుని యుద్ధ స్మారకం’ వద్ద అతను ఫొటో దిగాడు. అది చైనాపై యుద్ధం చేసిన జపాన్‌ దళాల స్మారకం కావడంతో వివాదాస్పదమైంది.
* అలీబాబా సంస్థల్లో ఆమెకు పెట్టుబడులు ఉండటం ఓ ప్రధాన కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల షీ జిన్‌పింగ్‌ సూచనలతో అలీబాబా సామ్రాజ్యంపై చైనా అధికారులు విరుచుకుపడిన విషయం తెలిసిందే. గతంలో అలీబాబాపై అధికారులు చర్యలు తీసుకొన్నప్పుడు కూడా కచ్చితమైన కారణం తెలియలేదు. కేవలం అతను బ్యాంకులను విమర్శించాడనే చేసినట్లు చాలా మంది భావించారు.

తాజా చర్యలతో ఝావో ఫ్రాన్స్‌ పారిపోయినట్లు పుకార్లు వచ్చాయి. కానీ, తాను బీజింగ్‌లోనే ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. గతంలో ఓ మహిళా సూపర్‌ స్టార్‌ అదృశ్యం..! నటీనటులపై విరుచుకుపడటం చైనాకు ఇదే కొత్తకాదు. 2018లో అత్యధిక రెమ్యూనిరేషన్‌ తీసుకొంటున్న నటి ఫాన్‌ బింగ్‌బింగ్‌ను కూడా అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. 2018లో జులై ఆమె ఉన్నట్లుండి అదృశ్యమయ్యారు. ఆమె సోషల్‌ మీడియా పేజీల్లో ఎటువంటి సమాచారం లేదు. చివరికి కుటుంబ సభ్యులు, మిత్రులకు కూడా ఆమె ఎక్కడ ఉందో ఆచూకీ తెలియలేదు. అక్టోబర్‌లో ఆమె బాహ్యప్రపంచానికి కనిపించారు. ఫాన్‌ పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు భావించిన అధికారులు ఆమెను అరెస్టు చేశారు. దీంతో 127 మిలియన్‌ డాలర్ల ఫైన్‌ ఆమెకు విధించారు.