Business

ఎస్ బ్యాంకు కుంభకోణంలో బెయిల్ నిరాకరణ-వాణిజ్యం

ఎస్ బ్యాంకు కుంభకోణంలో బెయిల్ నిరాకరణ-వాణిజ్యం

* దేశంలోని అతిపెద్ద ఐటీ దిగ్గ‌జాల్లో నూత‌న నియామ‌కాలు ఊపందుకోనున్నాయి. నిపుణుల‌ను ప్ర‌త్యేకించి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల కోసం టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్‌, విప్రో అత్యంత ఆక‌ర్ష‌ణీయ ఆఫ‌ర్లతో కూడిన ప్యాకేజీని ప్ర‌క‌టించాయి. అత్యంత నిపుణులైన ఐటీ ఇంజినీర్ల‌కు అవ‌స‌ర‌మైతే 70-120 శాతం వేత‌నం పెంచేందుకు సిద్ధం అని సంకేతాలిచ్చాయి. గ‌తంలో ఐటీ ఉద్యోగులు 10 నుంచి 30 శాతం శాల‌రీ హైక్ కోరుకునే వారు.

* మీరు విమానంలో హైద‌రాబాద్ నుంచి కోల్‌క‌తా.. ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లాల‌నుకుంటున్నారా.. అయితే, దేశీయంగా వివిధ ప్రాంతాల మ‌ధ్య విమాన ప్ర‌యాణానికి 15 రోజుల ముందు టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత‌కుముందు 30 రోజుల ముందు బుకింగ్ చేసుకోవాల్సి ఉన్న‌ది. ప్ర‌స్తుతం దేశంలో విమానాలు.. 85 శాతం కెపాసిటీతో న‌డుస్తున్నాయి. ఇంత‌కుముందు అది 72.5 శాతంగా ఉంది. ఈ మేర‌కు ఎయిర్‌లైన్స్ సంస్థ‌లు టిక్కెట్లను విక్ర‌యించ‌డానికి కేంద్ర విమాన‌యాన‌శాఖ శ‌నివారం అనుమ‌తి ఇచ్చింది.

* యెస్ బ్యాంకు వ్య‌వ‌స్థాప‌కుడు రాణా క‌పూర్ భార్య‌, ఇద్ద‌రు కూతుళ్ల‌కు బెయిల్ ఇవ్వ‌డానికి ముంబైలోని సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్థానం నిరాక‌రించింది. ప్రైవేట్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ డీహెచ్ఎఫ్ఎల్‌తో క్విడ్‌ప్రో క్యూ కేసులో రాణా క‌పూర్ భార్య బిందు, కూతుళ్లు రాధాఖ‌న్నా, రోషిణి దాఖ‌లు చేసిన బెయిల్ పిటిష‌న్‌ను తిర‌స్క‌రించింది. వారికి 14 రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ విధిస్తూ సీబీఐ ప్ర‌త్యేక కోర్టు జ‌డ్జి ఎస్ యూ వాగ్‌గావోంక‌ర్ ఆదేశాలు జారీ చేశారు. వీరిపై సీబీఐ చార్జిషీట్లు న‌మోదు చేసింది. అంటే ఈ నెల 23 వ‌ర‌కు వారు జైలులోనే ఉండాల్సి ఉంటుంది.

* వైస్రాయ్‌ హోటల్‌ రుణ పరిషార ప్రణాళిక విషయంలో సీఎఫ్‌ఎం అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ కొట్టేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ట్రిబ్యునల్‌ తీర్పు అమలును నిలిపివేస్తూ తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎమ్మెస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ టీ వినోద్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. దివాలా పరిషార ప్రక్రియలో భాగంగా వైస్రాయ్‌ హోటల్‌ను వశం చేసుకోడానికి రూ.185 కోట్లకు ప్రణాళిక ఆమోదం పొందాక పెట్టుబడిదారుడిగా ఉన్న సింగపూర్‌ కంపెనీని కో-అప్లికెంట్‌గా అనుమతించాలని కోరుతూ సీఎఫ్‌ఎం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ ట్రిబ్యునల్‌ తీర్పు చెప్పింది. దీనిని సవాల్‌ చేస్తూ సీఎఫ్‌ఎం సవాల్‌ చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను హైకోర్టు ఇటీవల విచారించింది. తదుపరి విచారణను నవంబర్‌ 23కి వాయిదా వేసింది.

* ప్రతిష్ఠాత్మక దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి వస్తే.. నెలకు దాదాపు రూ.1,000-1,500 కోట్ల ఆదాయం వస్తుందని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) రానున్న రోజుల్లో కాసుల వర్షం కురిపించనుందన్నారు. టోల్‌ రూపంలో ఎన్‌హెచ్‌ఏఐకి ఏటా వస్తున్న రూ.40 వేల కోట్ల ఆదాయం వచ్చే ఐదేళ్లలో రూ.1.40 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు.

* వ్యాపారులు జీఎస్‌టీ వివరాలు సమర్పించే జీఎస్‌టీఆర్‌-3బీ రిటర్న్‌ దాఖలు చేయడాన్ని ఒక్క నెల ఆపేసినా.. ఆ తదుపరి నెలకు జీఎస్‌టీఆర్‌-1 విక్రయాల రిటర్న్‌ను దాఖలు చేసే వీలుండదు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి దీనిని అమలు చేయనున్నారు. ప్రస్తుతం జీఎస్‌టీఆర్‌-3బీని రెండు నెలల పాటు దాఖలు చేయకుంటే జీఎస్‌టీఆర్‌-1ను సమర్పించడానికి వీల్లేదు. వచ్చే ఏడాది నుంచి దీనిని ఒక నెలకు తగ్గించనుంది. ఇందుకు గాను కేంద్ర జీఎస్‌టీ నిబంధనల్లోని 59(6)వ నిబంధనలో సవరణ చేయనుంది. ఒక నెలలో చేసిన విక్రయాల వివరాలతో జీఎస్‌టీఆర్‌-1ను మరుసటి నెల 11వ తేదీ కల్లా వ్యాపారులు దాఖలు చేస్తుంటారు. జీఎస్‌టీ వివరాలతో (సమరీ) జీఎస్‌టీఆర్‌-3బీని మరుసటి నెల 20-24 రోజుల మధ్య సమర్పించి.. జీఎస్‌టీని చెల్లిస్తుంటారు. ఆధార్‌ ధ్రువీకరణ ద్వారా జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

* దేశీయంగా విమాన టికెట్ల ధరలపై పరిమితులు అమలవుతున్న సంగతి విదితమే. ఇకపై కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు ఎప్పుడైనా 15 రోజుల వ్యవధి వరకే అమలవుతాయని, 16వ రోజు తరవాత ప్రయాణానికి ఎటువంటి పరిమితులు లేకుండా విమానయాన సంస్థలు టికెట్లు విక్రయించుకోవచ్చని పౌరవిమానయాన శాఖ శనివారం ప్రకటించింది. ఆగస్టు 12 నుంచి ఇప్పటివరకు ఈ పరిమితి 30 రోజులుగా ఉంటూ వచ్చింది. 31వ రోజు నుంచి పరిమితులు ఏమీ లేకుండా సంస్థలు టికెట్లు విక్రయించుకోవచ్చు. ‘కనిష్ఠ, గరిష్ఠ పరిమితుల మేరకు, సెప్టెంబరు 20న టికెట్‌ కొనుగోలు చేసుకుంటే అక్టోబరు 4 వరకే అమలవుతాయి. అక్టోబరు 5- ఆ తరవాత ప్రయాణానికి సెప్టెంబరు 20న టికెట్‌ కొనుగోలు చేసుకున్నా, ఈ పరిమితులు వర్తించవు’ అని పౌరవిమానయాన శాఖ తెలిపింది. సెప్టెంబరు 21న టికెట్‌ కొనుగోలు చేసుకుంటే, అక్టోబరు 5 వరకు ఈ పరిమితులు వర్తిస్తాయి. అక్టోబరు 6-ఆ తరవాత ప్రయాణానికి పరిమితులు వర్తించవు. ఈ విధంగా ధరల శ్రేణి 15 రోజులకు వర్తిస్తుంది’ అని పేర్కొంది.