NRI-NRT

‘టీసీఎస్‌’ కు పాస్ పోర్టు సేవా బాధ్యతలు

‘టీసీఎస్‌’ కు పాస్ పోర్టు సేవా బాధ్యతలు

రెండో దశ పాస్‌పోర్టు కార్యక్రమానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తమ కంపెనీని ఎంపిక చేసినట్లు ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్‌ వెల్లడించింది. తదుపరి దశలో భాగంగా ఈ-పాస్‌పోర్టుల జారీకి ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మరింత ఆధునికీకరిస్తామని పేర్కొంది. అలాగే మరింత వినూత్నమైన పరిష్కారాలను అభివృద్ధి చేస్తామని తెలిపింది. ఇందులో భాగంగా అడ్వాన్స్‌డ్‌ డేటా అనలిటిక్స్‌, చాట్‌బోట్స్‌, కృత్రిమ మేధ, ఆటో రెస్పాన్స్‌, నేచురల్‌ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌ వంటి అత్యాధునిక సాంకేతికతలను వినియోగిస్తామని పేర్కొంది. 2008లో ప్రారంభమైన పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రాంలో టీసీఎస్‌ ఇప్పటికే అనేక మార్పులను తీసుకొచ్చింది. సకాలంలో పాస్‌పోర్టులను అందించేందుకు విశేషంగా కృషి చేసింది. ఈ సందర్భంగా టీసీఎస్‌ బిజినెస్‌ యూనిట్‌ హెడ్‌ తేజ్‌ భట్లా మాట్లాడుతూ.. మన దేశాన్ని డిజిటల్‌ ఇండియాగా మార్చడంలో టీసీఎస్‌ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. పౌరులకు సేవలందించేందుకు గత ఏడాది కాలంగా విదేశాంగ శాఖతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రెండో దశకు కూడా టీసీఎస్‌నే ఎంపిక చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.