Movies

వివక్షకు గురవుతున్నానంటున్న ప్రియాంకా చోప్రా

వివక్షకు గురవుతున్నానంటున్న  ప్రియాంకా చోప్రా

అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభాపాటవాల్ని నిరూపించుకున్నా మహిళగా తాను నేటికి వివక్షకు గురవుతూనే ఉన్నానని ఆవేదన వ్యక్తంచేసింది ప్రియాంకచోప్రా. బాలీవుడ్‌ సినిమాలతో తన ప్రయాణాన్ని ఆరంభించిన ఈ సొగసరి ప్రస్తుతం హాలీవుడ్‌లో సత్తా చాటుతున్నది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఆంగ్ల చిత్రం ‘మ్యాట్రిక్స్‌ రిసరెక్షన్స్‌’ ఈ నెల 22న విడుదలకాబోతున్నది. వివిధ దేశాల్లో జరుగుతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రియాంకచోప్రా బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్‌ను గురించి రాసిన కథనాల్లో పలు మీడియా సంస్థలు ప్రియాంకచోప్రాను ‘వైఫ్‌ ఆఫ్‌ నిక్‌జోనస్‌’ అంటూ అభివర్ణించాయి. ఆ స్క్రీన్‌షాట్స్‌ను షేర్‌ చేసిన ఆమె ‘గొప్ప ఫ్రాంచైజ్‌గా ప్రపంచం కీర్తిస్తున్న సినిమాలో నేను భాగమయ్యా. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి ఎంతో కృషిచేస్తున్నా. అయినా నన్ను ఒకరి భార్యగానే గుర్తించడం బాధను కలిగించింది. మహిళలు తమ స్వీయ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇంతకంటే ఏం చేయాలో చెప్పండి. నటిగా నేను సాధించిన విజయాలు, పేరుప్రఖ్యాతులు వారికి కనబడకపోవడం బాధాకరం. ఆడవాళ్ల విషయంలో ఈ వివక్ష ఎందుకు ఎదురవుతుందో అర్థంకావడం లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రియాంకచోప్రా పెట్టిన పోస్ట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆమెకు పలువురు బాలీవుడ్‌, హాలీవుడ్‌ నాయికలు బాసటగా నిలిచారు.