Business

అనకాపల్లి మార్కెట్లో నిలిచిన బెల్లం అమ్మకాలు

అనకాపల్లి మార్కెట్లో నిలిచిన బెల్లం అమ్మకాలు

 సీజన్‌లో రోజుకు సుమారు రూ.4 కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగే అనకాపల్లి బెల్లం మార్కెట్లో మరోసారి ప్రతిçష్టంభన ఏర్పడింది. బుధవారం బెల్లం క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. సీజన్, అన్‌సీజన్‌గా లావాదేవీలు జరిగే అనకాపల్లి మార్కెట్లో ఏటా రెండు, మూడుసార్లు సమస్యల కారణంగా లావాదేవీలు నిలిచిపోవడం, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుని లావాదేవీలను పునరుద్ధరించడం సాధారణమే. ఈసారి బెల్లం ఎగుమతిదారులకు, కార్మికులకు మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలతో మార్కెట్లో లావాదేవీలు నిలిచిపోయాయి. సంక్రాంతికి ముందురోజు 20 వేలకు పైగా బెల్లం దిమ్మెల వ్యాపారం జరగ్గా.. పండుగ తర్వాత సోమవారం 11,866 దిమ్మెలు, మంగళవారం 8,644 బెల్లం దిమ్మెలు మార్కెట్‌కు వచ్చాయి. పండుగ మూడ్‌ నుంచి బయటపడిన రైతులు బెల్లాన్ని మార్కెట్‌కు తరలించాలనుకుంటున్న సమయంలో లావాదేవీలు నిలిచిపోవడంతో ఆందోళనలో ఉన్నారు. 

ప్రతిష్టంభనకు కారణమిదీమార్కెట్‌కు బెల్లాన్ని రైతులు వాహనాల్లో తీసుకొచ్చి మార్కెట్‌ యార్డులలో దించుతారు. తర్వాత కొన్ని ప్రక్రియలు జరిపి ఎగుమతిదారుడి అధీనంలోకి వెళ్లిన తర్వాత సుమారు 170 మంది కార్మికులు బెల్లం దిమ్మెలను గోనె సంచిలో కుట్టే ముందు ఆయా వర్తకునికి సంబంధించిన గుర్తులు వేస్తారు. దీనికి గాను ఒక్కో కార్మికునికి దిమ్మెకు రూ.7 చొప్పున చెల్లిస్తారు. కాగా, గోనె సంచులను కుట్టే ప్రక్రియకు స్వస్తి పలికిన వర్తకులు నేరుగా కవర్లను చుట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీనివల్ల కార్మికలకు వచ్చే వేతనం తగ్గిపోతోంది. తమకు గిట్టుబాటు కాదని భావించిన కార్మికులు అనధికారికంగా నిర్వహించే వేలం ప్రక్రియలో పాల్గొనబోమని మొండికేశారు.
ఇది ఎగుమతి, దిగుమతి వర్తకుల మధ్య ప్రతిష్టంభనకు దారితీసి బుధవారం లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ ప్రభావం అటు వర్తకులు, ఇటు కొలగార్లు, కార్మికులతోపాటు బెల్లం రైతులు, బెల్లాన్ని తరలించే వాహనదారులపైనా పడింది. ఈ సమస్య వెంటనే పరిష్కారం కాకుంటే పక్వానికి వచ్చిన చెరకు తోటలు పాడైపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.