Food

ప్రసాదంగా పులిహోర ఎందుకంటే! – TNI ఆధ్యాత్మిక వార్తలు

ప్రసాదంగా పులిహోర ఎందుకంటే! – TNI ఆధ్యాత్మిక వార్తలు

*పులిహోర అంటే చిన్న పిల్లల దగ్గర  నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. పులిహోరను పూజలు చేసినప్పుడు నైవేద్యంగా పెడుతూ ఉంటాం. పులిహోరను మన పూర్వీకుల కాలం నుండి పూజలకు నైవేద్యంగా పెడుతున్నారు. పూజల సమయంలో దేనికి లేని ప్రాముఖ్యత పులిహోరకు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. పాండవులు అజ్ఞాతవాసంలో రకరకాల వేషాలను వేసిన సంగతి తెలిసిందే. పాండవులలో బీముడు వంటవాడిగా వేషం వేసి ఎన్నో రకాల వంటకాలను సృష్టించారు. ఆ వంటకాలలో పులిహోర ఒకటి. ఈ విషయం మనకు పురాణ కథలు,చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఇంత ప్రాచుర్యం ఉన్నా పులిహోర ఆ తర్వాత క్రమంగా దక్షిణ భారతదేశం అంతా ప్రాచుర్యం పొందింది.
* కొత్త రుచులను ఆస్వాదించే తెలుగువారు ఈ వంటకానికి పులిహోర అని పేరు పెట్టి ఆస్వాదించటం ప్రారంభించారు. కుళుత్తుంగ చోళుల పరిపాలన ఉన్న సమయంలో తమిళనాడు,కర్ణాటక ప్రాంతాలలో దైవానికి ఆరగింపు చర్యగా ఉత్తమ జాతి పువ్వులను, పండ్లను, తినుబండారాలను పెట్టటం ఒక ఆచారంగా ఉండేదట. ముఖ్యంగా శ్రీ వైష్ణవులు,అయ్యంగార్లు ఈ పద్దతిని ప్రారంభించి ప్రాచుర్యం చేయటంతో ఇతర ప్రాంతాల వారు కూడా ఆరగింపు చర్యను చేయటం ప్రారంభించారు. ఆ తర్వాతి కాలంలో పులిహోరను దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత భక్తులకు పంచటం ప్రారంభం అయింది.
* పులిహోరలో శుభానికి,ఆరోగ్యానికి సూచికగా ఉండే పసుపును ఉపయోగిస్తారు. అందువల్ల ఒక వైపు ఆధ్యాత్మిక పరంగాను మరోవైపు ఆరోగ్యపరంగాను దోహదపడుతుంది. హిందూ ధర్మంలో పులిహోరను తప్పనిసరిగా తినవలసిన ఆహారంగా చెప్పటమే కాకుండా పండితులు దివ్య ఆహారంగా చెప్పటంతో కేరళ,కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లో పులియోగారే అని మన రాష్ట్రంలో పులిహోర అని పేరు పొందింది. పులిహోర అంటే కళ్ళకు అద్దుకొని తినే ఆహారంగా ప్రాచుర్యం పొందింది. చాలా దేవాలయాల్లో పులిహోరను ప్రసాదంగా పెట్టటం మనం చూస్తూనే ఉంటాం.తిరుమల తిరుపతి లో పులిహోరను రాశి గా పోసి చేసే సేవను తిరుప్పావడ సేవ అంటారు.
____________________
2.వివాదాస్పదంగా త్రిశూల అభిషేకం
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం జరిగిన అభిషేక క్రతువులో రాజకీయ నేతలు త్రిశూలాన్ని స్పృశించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మహాశివరాత్రి ఉత్సవాల్లో సూర్య పుష్కరిణి వద్ద త్రిశూలాన్ని అభిషేకించడం ఆనవాయితీ. అనువంశిక ప్రధానార్చకులు డాక్టర్‌ స్వామినాథన్‌ గురుకుల్‌ త్రిశూలం చేతబట్టగా, అర్చకులు అభిషేక జాలలను ఆయన శిరస్సుపై పోశారు. ఆ తర్వాత త్రిశూలాన్ని ఇతరులెవ్వరూ స్పృశించకూడదు. కానీ, ప్రధానార్చకుడిని అనుసరిస్తూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి దంపతులు, ఈవో పెద్దిరాజు దంపతులు, చైర్మన్‌ అంజూరు శ్రీనివాసులు త్రిశూలాన్ని చేతబట్టి అభిషేకించుకున్నారు. అంతేకాకుండా ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీనిపై పలువురు పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

3.‘శ్రీవారి సేవ’ను స్వామి సేవగానే భావించాలి: వైవీ
శ్రీవారి సేవకులు భక్తులకు అందించే సేవను స్వామికి చేసినట్టుగానే భావించాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ఆదివారం ఉదయం ఆయన సర్వదర్శనం క్యూలైన్‌ ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో శ్రీవారి సేవ చేస్తున్న నిజామాబాద్‌కు చెందిన లావణ్య అనే సేవకురాలితోపాటు ఆ బృంద సభ్యులు అందిస్తున్న సేవలను ప్రత్యక్షంగా చూసి.. అభినందించారు.

4. ఫిల్మ్ న‌గ‌ర్ వెంక‌టేశ్వ‌ర స్వామి టెంపుల్‌లో హ‌రీశ్ రావు పూజ‌లు
రాష్ట్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న సంద‌ర్భంగా ఫిల్మ్ న‌గ‌ర్ వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆల‌య అర్చ‌కులు మంత్రిని ఆశీర్వ‌దించి తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. హ‌రీశ్‌రావుతో పాటు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కూడా పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. అక్క‌డ్నుంచి నేరుగా హ‌రీశ్‌రావు అసెంబ్లీకి బ‌యల్దేర‌నున్నారు.కోకాపేట్‌లోని త‌న నివాసం వ‌ద్ద హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆశీస్సుల‌తో మూడోసారి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్నాన‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. ప్‌్జ‌ల ఆకాంక్ష‌లు ప్ర‌తిబింబించేలా బ‌డ్జెట్ ఉంటుంది. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేరేలా బ‌డ్జెట్ ఉంటుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

5. యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతం : గవర్నర్ తమిళిసై
యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సోమవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రాబోవు రోజుల్లో యాదాద్రి ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా మారుతుందన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని యాదాద్రీశుడిని వేడుకున్నట్లు వెల్లడించారు.