DailyDose

అప్పులు చేయడం, పంచడమే ఎజెండాగా బడ్జెట్ – TNI రాజకీయ వార్తలు

అప్పులు చేయడం, పంచడమే ఎజెండాగా బడ్జెట్ – TNI రాజకీయ వార్తలు

*అప్పులు చేయడం, పంచడమే ఎజెండాగా రాష్ట్ర బడ్జెట్ రూపొందించారని.. మాజీ సీఎస్‌, భాజపా ముఖ్యనేత ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. గవర్నర్ ప్రసంగం రుజువు చేసే విధంగానే పన్నుల ఆదాయాలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ అప్పులపై వివరాలు ఇవ్వాలని కాగ్ 2021 మార్చిలో రాసిన లేఖకు.. ఇంతవరకూ ప్రభుత్వం నుంచి సమాధానం లేదని ఆయన తెలిపారు.అప్పులు చేయడం, పంచడమే ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూపొందించారని.. మాజీ సీఎస్‌, భాజపా ముఖ్యనేత ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ముందస్తు ఎన్నికల్లో అదృష్టం కలిసొచ్చి గెలిస్తే.. పథకాలు నిలిపివేయవచ్చనే అజెండాతో ఉందని విమర్శించారు.కరోనా వల్ల ఆదాయం తగ్గి అప్పులు చేయాల్సి వచ్చిందని ఓ సందర్భంలో ఆర్థిక మంత్రి ప్రస్తావించారన్నారు. గవర్నర్ ప్రసంగంలో కరోనా ప్రభావం రాష్ట్ర ఆదాయంపై లేదని అన్నారు. గవర్నర్ ప్రసంగం రుజువు చేసే విధంగానే పన్నుల ఆదాయాలు ఉన్నాయని తెలిపారు. పరిమితి లేని అప్పులతో.. దివాళా దిశలో రాష్ట్రం ఉందని ఐవైఆర్ విమర్శలు సంధించారు.ఈ మధ్య విడుదలైన కాగ్ లెక్క ప్రకారం 2021-2022 తొమ్మిది నెలలకు రెవిన్యూ లోటు రూ.45,900 కోట్లు అని అన్నారు. ఈ బడ్జెట్లో మొత్తం 2021-2022 సంవత్సరానికి రెవెన్యూ లోటును రూ.19,545 కోట్లగా చూపించారని, మిగిలిన మూడు నెలలతో కలిపి ఈ రెవిన్యూ లోటు రూ.45,900 కోట్ల కన్నా ఎక్కువ ఉండాలి కానీ తక్కువ కాదన్నారు. ప్రభుత్వ అప్పులపై వివరాలు ఇవ్వాలని కాగ్ 2021 మార్చిలో రాసిన లేఖకు.. ఇంతవరకూ ప్రభుత్వం నుంచి సమాధానం లేదని తెలిపారు.

*70 కోట్లతో దుర్గగుడి అభివృద్ధి: మంత్రి వెల్లంపల్లి
విజయవాడ నగరంలోని దుర్గగుడిని రూ.70 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడారు. ఏపీలో దేవాలయాల అభివృద్ధికి సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. ప్రసాద్ స్కీమ్‌లో జిల్లాలోని ద్వారకా తిరుమల ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి ప్రణాళికలు రూపొందించారని ఆయన పేర్కొన్నారు.

*అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డిలకు శిక్షపడుతుంది: డీఎల్
మాజీమంత్రి, వైసీపీ నేత డీఎల్ రవీంద్రారెడ్డి స్వంత పార్టీకే కొరకరాని కొయ్యగా మారారు. ప్రభుత్వం విధానాలను తప్పుబడున్న ఆయన.. ఇప్పుడు ఏకంగా వైఎస్ కుటుంబసభ్యులపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీమంత్రి వివేకా హత్యకేసులో సూత్రధారులెవరో, పాత్రధారులెవరో అందరికీ తెలుసన్నారు. సీబీఐ నిష్పక్షపాతంగా విచారణ చేసిందని తెలిపారు. ఈ కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డిలకు తప్పకుండా శిక్షపడుతుందని డీఎల్ రవీంద్రారెడ్డి జోస్యం చెప్పారు.

*కేబినెట్ ఆ తీర్మానం చేయడం దుర్మార్గం: సోమిరెడ్డి
ఏపీ జెన్‌కో థర్మల్ పవర్ ప్లాంట్‌ ప్రయివేటీకరణని నిరశిస్తూ టీడీపీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. టీడీపీ నేతలు సోమిరెడ్డి, బీద రవిచంద్ర, సీపీఎం నేతలు రమేశ్, మాదాల వెంకటేశ్వర్లు, సీపీఐ నేత ప్రభాకర్, ఏఐటీయూసీ నేత రామరాజు పాల్గొన్నారు. ఏపీ జెన్కో ధర్మల్ ప్లాంట్‌ని ప్రయివేటు వ్యక్తులకి అప్పింగించేలా కేబినెట్ తీర్మానం చేయడం దుర్మార్గమని సోమిరెడ్డి పేర్కొన్నారు. ప్లాంట్‌ని రక్షించుకునేందుకు అన్నిపార్టీలతో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

*ఏ బాధ్యతలు అప్పగించినా నెరవేరుస్తా : ఏపీ డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తనకు ఏ బాధ్యతలు అప్పగించినా శిరసా వహించి ఆ బాధ్యతలను నెరవేరుస్తానని ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు తెలిపారు. కేబినెట్‌ పునర్వవస్థీకరణ విషయంలో జగన్‌ సూచనను స్వాగత్తిసున్నానని వెల్లడించారు. ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎన్నికలు రావాలని ప్రతిపక్షాలు కోరుకోవడం సహజమే అయినప్పటికీ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావని అన్నారు.ప్రభుత్వానికి ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎన్నికలకు తాము భయపడడం లేదని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు జగన్‌నే కోరుకుంటున్నారని అన్నారు. ఎక్కువ సీట్లు తమకే వస్తాయని టీడీపీ చెప్పుకున్నా ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదని తెలిపారు.

*ఇది కూతల, కోతల, పిట్టల దొర బడ్జెట్: Tulasi reddy
వైసీపీ పాలనలో వార్షిక బడ్జెట్‌లకు విలువ, విశ్వసనీయత లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ… చెప్పే దానికి, చేసేదానికి పొంతన ఉండదన్నారు. ఇది కూతల, కోతల, పిట్టల దొర బడ్జెట్ అని వ్యాఖ్యలు చేశారు. ఇది త్రాగుబోతుల బడ్జెట్ అని… ఇది అప్పుల బడ్జెట్ అని తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు.

*కేబినెట్ ఆ తీర్మానం చేయడం దుర్మార్గం: సోమిరెడ్డి
ఏపీ జెన్‌కో థర్మల్ పవర్ ప్లాంట్‌ ప్రయివేటీకరణని నిరశిస్తూ టీడీపీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. టీడీపీ నేతలు సోమిరెడ్డి, బీద రవిచంద్ర, సీపీఎం నేతలు రమేశ్, మాదాల వెంకటేశ్వర్లు, సీపీఐ నేత ప్రభాకర్, ఏఐటీయూసీ నేత రామరాజు పాల్గొన్నారు. ఏపీ జెన్కో ధర్మల్ ప్లాంట్‌ని ప్రయివేటు వ్యక్తులకి అప్పింగించేలా కేబినెట్ తీర్మానం చేయడం దుర్మార్గమని సోమిరెడ్డి పేర్కొన్నారు. ప్లాంట్‌ని రక్షించుకునేందుకు అన్నిపార్టీలతో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

*జంగారెడ్డిగూడెం ఘటనకు సీఎం దనదాహమే కారణం: అనిత
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 17 కుటుంబాలు రోడ్డునపడటానికి సీఎం జగన్ ధనదాహామే కారణమని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… వాలంటీర్లు, వైసీపీ నేతలే నాటుసారా, గంజాయి విక్రయిస్తుంటే జగన్ ఎందుకు నియంత్రించటంలేదని ప్రశ్నించారు. మద్యం అమ్మకాలతో ఆదాయం పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధలో సగమైన ముఖ్యమంత్రి… మహిళల మానప్రాణాలపై చూపితే బాగుంటుందని హితవుపలికారు. నాటుసారా అమ్మకాలు విచ్చలవిడిగా జరుతున్నాయని స్వయంగా స్పీకరే చెప్పారని వంగలపూడి అనిత పేర్కొన్నారు.

*కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండటం మన దురదృష్టం: మంత్రి కేటీఆర్
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌కు వరద సహాయం చేయలేదని ఆరోపించారు. శనివారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన కేంద్రమంత్రికి కూడా మనసు రావడంలేదన్నారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండటం మన దురదృష్టమన్నారు. కేంద్రం అనుసరిస్తున్నతీరు సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ వరద నీటికి కేంద్రం నుంచి ఇంతవరకు అరపైసా సహాయం కూడా రాలేదని కేటీఆర్ మండిపడ్డారు.

*ఎమ్మెల్యే సీటుకు అఖిలేష్ రాజీనామా..?
సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి ఎస్.పి.సింగ్ బఘెల్‌పై 67,504 ఓట్ల ఆధిక్యం సాధించారు. అఖిలేష్‌కు 1,48,196 ఓట్లు రాగా, బాఘెల్‌కు 80,692 ఓట్లు వచ్చాయి. ఎస్‌పీకి కంచుకోటగా చెప్పుకునే కర్హాల్‌లో అఖిలేష్‌కు 60.12 శాతం ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీకి అఖిలేష్ పోటీ చేయడం కూడా ఇదే మొదటిసారు. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగానే ఉన్నారు

*చేతనైతే అభివృద్ధిలో పోటీపడాలి: కేటీఆర్‌
కుల, మతాలతో తాము రాజకీయం చేయబోమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం ఉప్పల్‌ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఆయన మల్లాపూర్‌ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, తమకు కులం, మతం పిచ్చి లేదని పరోక్షంగా బీజేపీనుద్దేశించి వ్యాఖ్యానించారు.శాంతియుత వాతావరణంలో అన్నదమ్ముల్లా ఉంటున్న తాము ఇదే ఒరవడి కొనసాగిస్తామని, ఎన్నికల సమయంలో తప్ప రాజకీయాలు మాట్లాడమని పేర్కొన్నారు. 2 పార్టీలకు చెందిన ఒకరిద్దరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాని, చేతనైతే అభివృద్ధిలో పోటీపడాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే యువతకు ఉచిత కోచింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కోరారు. ఉప్పల్‌ వైపు కూడా ఐటీ పరిశ్రమలు రావడానికి చేపట్టిన లుక్‌ ఈస్ట్‌పాలసీ సత్ఫలితాలిస్తోందన్నారు.

*నవ్యాంధ్రను నీరు గార్చేలా బడ్జెట్‌: జీవీఎల్‌
వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నవ్యాంధ్ర కలను నీరు గార్చే బడ్జెట్‌‌లా ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. ఏపీ బడ్జెట్‌పై నిరాసక్తత కనిపించిందన్నారు. కేంద్రం నిర్మించే పథకాలను రాష్ట్రం తమవి అని చెప్పుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, వచ్చే ఆదాయం వడ్డీ కట్టడానికి సరిపోయేలా లేదన్నారు. కులాల కార్పొరేషన్ల నిధులు, వాళ్లకు వెళ్ళటం లేదన్నారు. పేరుకి మాత్రమే కార్పొరేషన్లు అని, అక్కడ టీ తాగేందుకు కూడా డబ్బులు లేవన్నారు. కార్పొరేషన్లకు నిధులిచ్చే చిత్తశుద్ధి ఏపీ ప్రభుత్వానికి లేదన్నారు. బడ్జెట్‌లో తప్పులు చూపెట్టారన్నారు. రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావన బడ్జెట్‌లో ఎందుకు లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ వాటా ఎందుకు ఇవ్వలేదన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు నిధులేవన్నారు. బడ్జెట్‌ను పార్టీ మేనిఫెస్టో లాగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈనెల 19న కడపలో బీజేపీ బహిరంగ సభ ఉంటుందన్నారు. ప్రభుత్వ నిర్లక్షానికి నిరసనగా ఈ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు.

*ఇది మాయల మరాఠీ బడ్జెట్: ఏపీసీసీ చీఫ్‌ శైలజానాథ్
అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఏపీ బడ్జెట్‌ మాయల మరాఠీ బడ్జెట్ అని ఏపీసీసీ చీఫ్‌ శైలజానాథ్ అన్నారు. అప్పులు తెచ్చి అంకెల గారడీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ఆయన ఆరోపించారు. పన్నుల రూపేణా ఆదాయం పెంచుకుని సంక్షేమానికి ఖర్చుచేయడం లేదన్నారు. గత బడ్జెట్‌లో దోచిందెంత, దాచింది ఎంతో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్ కేటాయింపులకు, ఖర్చులకు ఎక్కడా పొంతన లేదని ఆయన అన్నారు.

*జంగారెడ్డిగూడెంలో సారా మరణాలపై ప్రభుత్వం స్పందించాలి: చంద్రబాబు
జంగారెడ్డిగూడెంలో సారా మరణాలపై ప్రభుత్వం స్పందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 15 మంది చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. మరణాలతో భయాందోళనలో స్థానిక ప్రజలున్నారని తెలిపారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నంద్యాలలో విద్యార్థుల అస్వస్థతకు కారకులపై చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యత లేని ఆహారంతో వల్లే విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చంద్రబాబు చెప్పారు.

* వచ్చే.10 బడ్జెట్‌లను కూడా మేమే ప్రవేశ పెడుతాం: విప్ శ్రీకాంత్‌రెడ్డి
రాష్ట్రంలో వచ్చే 10 బడ్జెట్‌లను కూడా వైసీపీ ప్రభుత్వమే ప్రవేశ పెడుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చిన వ్యక్తులకు ఇవాళ్టి బడ్జెట్‌పై మాట్లాడే హక్కు లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏ పథకానికి నిధులు తగ్గించలేదన్నారు. అమ్మఒడి, రైతు భరోసా ఇలా దేనికి కూడా నిధులు తగ్గలేదన్నారు.

*బీటీ ద్వారా రైతుల ఖాతాల్లో ఆర్థిక సాయం: మంత్రి కన్నబాబు
వైసీపీ ప్రభుత్వం రైతు సంక్షేమంపై దృష్టి పెట్టి వారి అభ్యున్నతి కోసమే పథకాలు అమలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు శుక్రవారం ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.43052.78 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లోకి ఆర్థిక సాయం వెళ్తోందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు మంచి రేట్లకు విక్రయించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 10 వేల డ్రోన్లతో వ్యవసాయనికి ఊతం ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామన్నారు. ఎరువుల కోసం ఎక్కడా రైతులు క్యూ లైన్లలో నిల్చొని ఉండాల్సిన పరిస్థితి లేదన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్రమే నిధులు ఇవ్వాలని కన్నబాబు పేర్కొన్నారు

*ఏప్రిల్ 14 నుంచి తెలంగాణలో పాదయాత్ర: ఆప్‌ ఎమ్మెల్యే సోమనాథ్
దేశవ్యాప్తంగా ఆప్‌ పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందని ఆప్‌ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఆప్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 14 నుంచి తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపడతామని ఆయన ప్రకటించారు. తెలంగాణలో ఆప్‌ను విస్తరింపజేస్తామన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. తెలంగాణలో అన్నివర్గాలకు కేసీఆర్‌ అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

*పంజాబ్‌ సీఎంగా 16న మాన్‌ ప్రమాణం
ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత భగవంత్‌ మాన్‌ ఈ నెల 16న పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్వాతంత్య్ర పోరాట యోధుడు భగత్‌సింగ్‌ పూర్వీకుల గ్రామమైన నవన్‌షార్‌ జిల్లాలోని ఖట్కార్‌ కలాన్‌ను ప్రమాణ స్వీకారానికి వేదికగా నిర్ణయించుకున్నారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రివాల్‌ను కలిశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. భేటీలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ఆప్‌ పంజాబ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి రాఘవ్‌ చద్ధా కూడా పాల్గొన్నారు. 13న కేజ్రీవాల్, భగవంత్‌ మాన్‌ కలిసి అమృత్‌సర్‌లో రోడ్‌షోలో పాల్గొంటారని ఆప్‌ వర్గాలు తెలిపాయి. మాన్‌ పంజాబ్‌ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారని, తనకు ఆహ్వానం అందజేశారని కేజ్రివాల్‌ ట్వీట్‌ చేశారు. ముఖ్యమంత్రిగా పంజాబ్‌ ప్రజల ఆకాంక్షలను ఆయన నెరవేరుస్తారన్న విశ్వాసముందని వెల్లడించారు. ఆయనతో భేటీకి సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. భగవంత్‌ మాన్‌ ధూరీ నుంచి తన సమీప ప్రత్యర్థిపై 58,206 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.