NRI-NRT

విదేశాల్లో జైలు జీవితం గడుపుతున్న భారతీయుల సంఖ్యపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

విదేశాల్లో జైలు జీవితం గడుపుతున్న భారతీయుల సంఖ్యపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

విదేశాల్లో జైలు జీవితం గడుపుతున్న భారతీయుల సంఖ్యపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సుమారు 8,278 మంది భారతీయులు విదేశాల్లో జైలు జీవితం అనుభవిస్తున్నారని వెల్లడించింది. పార్లమెంట్ సమావేశా సందర్భంగా ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు విదేశాంగశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ప్రకారం అండర్ ట్రయల్స్‌ లో ఉన్న వారితో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లో 8,278 మంది ఖైదీలుగా ఉన్నారని చెప్పారు. ఇందులో సుమారు 156 మంది యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్నట్టు తెలిపారు.స్థానికంగా ఉన్న కఠిన చట్టాల వల్ల చాలా దేశాలు తమ దేశంలోని విదేశీ ఖైదీల వివరాలను వెల్లడించడం లేదని చెప్పారు. అయితే.. జైలు శిక్ష అనుభవిస్తున్న భారతీయులకు ప్రభుత్వం తరఫున న్యాయపరమైన సహాయం అందజేస్తున్నట్టు తెలిపారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంరక్షణకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా కొవిడ్ నేపథ్యంలో విదేశాలకు వలస వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు తెలిపారు. 2018లో 3,21,721 మంది భారతీయులు యూఏఈ, సౌదీ అరేబియా, కువైత్, ఖతర్, ఒమన్, బహ్రెయిన్ తదితర దేశాలకు వలస వెళ్లినట్టు చెప్పారు. 2019లో ఈ సంఖ్య 3,53,126గా ఉందని.. అదే 2020లో 78,558కి పడిపోయిందని వివరించారు.