Politics

రాహుల్‌ గాంధీకి ఎమ్మెల్సీ కవిత ప్రశ్నాస్త్రాలు.. – TNI రాజకీయ వార్తలు

రాహుల్‌ గాంధీకి ఎమ్మెల్సీ కవిత ప్రశ్నాస్త్రాలు.. – TNI రాజకీయ వార్తలు

* తెలంగాణలో పర్యటించనున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీకి ఎమ్మెల్సీ కవిత ప్రశ్నాస్త్రాలు సంధించారు. మీరు కానీ, మీ పార్టీ కానీ పార్లమెంటులో తెలంగాణ అంశాలు, హక్కులను ఎన్నిసార్లు ప్రస్తావించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర హక్కుల కోసం టీఆర్‌ఎస్‌ పోరాడుతుంటే రాహుల్‌ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.దేశవ్యాప్తంగా వరి కొనుగోలు విధానం ఒకేలా ఉండాలని తాము పోరాడుతున్నప్పుడు ఎక్కడికిపోయారని, తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా, రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, నిధుల గురించి టీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యాసంస్థలు ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తున్నప్పుడు ఎక్కడున్నారని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు.సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, ఆసరా వంటి పథకాలపై మీ పార్టీ నేతలను అడగాలని, అవి తెలంగాణ ముఖచిత్రాన్ని ఎలా మార్చాయో అడిగి తెలుసుకోవాలని రాహూల్‌ గాంధీకి సూచించారు.

*మడిపల్లి గ్రామానికి కాళేశ్వరం నీళ్లు తెస్తాం: మంత్రి ఎర్రబెల్లి
ఈ ఎండాకాలంలోనే మడిపల్లి గ్రామానికి కాళేశ్వరం నీళ్లు తీసుకు వస్తామని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాళేశ్వరం నీళ్లతో ఇక్కడి చెరువులు నింపి ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం పోలెపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్నిమంత్రి ఆవిష్కరించారు.అలాగే రూ.16 లక్షలతో గ్రామపంచాయతీ భవనం, రూ.40లక్షలతో సిసి రోడ్లు, రూ.20లక్షలతో డ్రైనేజీలకు ప్రారంభోత్స‌వం చేశారు. రూ.4కోట్ల 56 లక్షలతో చేపట్టిన పోలేపల్లి నుండి చంద్రు తండ వరకు బిటి రోడ్డు, రూ.60 లక్షలతో తాన్య తండా కు బిటి రోడ్డు, రూ.14లక్షల 94 వేలతో మన ఊరు మన బడి కార్యక్రమాల శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇక్కడి పేదలకు అందజేసినట్టు తెలిపారు.ప్రతి ఇంటికీ ఏదో ఒకటి, అంతకు మించి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్,ఆరోగ్య లక్ష్మి, 102 వాహనం, ప్రభుత్వ దవాఖానా లో ఉచిత సాధారణ ప్రసూతి, కేసిఆర్ కిట్లు, పెన్షన్లు, మిషన్ భగీరథ మంచినీరు, రైతు బంధు, రైతు బీమా, మన ఊరు మన బడి ఇలా చెప్పలేనన్ని పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు. అంతే కాదు వచ్చే నెల నుంచే 57 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందజేస్తామన్నారు.తొర్రూరు మండలం లోనే మడిపల్లి కి అత్యధికంగా 10 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ లు వంటి స్కీం లు ఇచ్చామన్నారు.మడిపల్లి లో 2 కోట్ల 60 లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇచ్చి నియోజక వర్గం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునేలా అవకాశం కల్పించారన్నారు.మడిపల్లి ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంల స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు

*ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మన ఊరు- మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ఎంపీపీ చాంబర్‌లో మన ఊరు- మనబడిపై సమీక్ష సమావేశాన్ని జడ్పీ చైర్‌ పర్సన్‌ తీగల అనితారెడ్డితో కలిసి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా మహేశ్వరంలోని పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు రూ.4 కోట్ల 70 లక్షలు మంజూరు అయ్యాయని ఆమె తెలిపారు. ఈ నిధులను పాఠశాలల మరమ్మతులు, వంట రూములు, టాయిలెట్స్‌, గ్రీనరీ, మంచినీరు ఏర్పాటు చేసేందుకు వినియోగిస్తామన్నారు.సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రభుత్వ పాఠశాలలో జూన్‌ నుంచి ఇంగ్లీస్‌ మీడియాన్ని ప్రవేశపెడుతున్నామని ఆమె అన్నారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలని ఆమె పార్టీ నాయకులకు సూచించారు. గ్రామాలలో ఉన్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా నాయకులు కృషి చేయాలని మంత్రి సూచించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరుస్తున్నామన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 వేల ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్‌ ఎంపీపీ సునిత‌, తసీల్దార్‌ ఆర్పీ జ్యోతి, సహకార బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకుడు కూన యాదయ్య, కో ఆప్షన్‌ సభ్యులు సయ్యద్‌ ఆదిల్‌అలీ తదితరులు పాల్గొన్నారు

*రాహుల్… తెలంగాణకు స్వాగతం: Kavitha
తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ‘‘గౌరవ రాహుల్ గాంధీ, మీరు కానీ మీ పార్టీ కానీ ఎన్నిసార్లు పార్లమెంట్‌లో తెలంగాణ అంశాలను, హక్కులను ప్రస్తావించారో చెప్పండి.? తెలంగాణ రాష్ట్ర హక్కులకోసం టిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు ?. దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు?. తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా, తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన పెండింగ్ జీఎస్టీ బకాయిలు , నిధుల గురించి టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు?. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యాసంస్థలు ఇవ్వకుండా మొండిచేయి చూపిస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు?. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, ఆసరా వంటి పథకాలపై ఆరాతీసి అవి తెలంగాణ ముఖచిత్రాన్ని ఎలా మార్చాయో మీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకోండి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను స్పూర్తిగా తీసుకుని 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. వాటి గురించి నేర్చుకుని అర్థం చేసుకోవడానికి మీకు కూడా తెలంగాణకు స్వాగతం!!’’ అంటూ కవిత ట్వీట్ చేశారు

*చంద్రబాబుకు అమరావతి మీదే ప్రేమ: Avanti srinivasra
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అమరావతి మీదే ప్రేమ ఉందని మాజీమంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… విశాఖకు పరిపాలన రాజధాని బాబు వద్దంటే.. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. విశాఖలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే ప్రజల తీర్పు ఏమిటో తెలుస్తుందన్నారు. జగన్ ది ఐరన్ లెగ్ అన్న చంద్రబాబు వ్యాఖ్యలు ఖండిస్తున్నామని అన్నారు. జగన్, విజయ సాయి రెడ్డి విశాఖలో ఏమి దోచుకున్నారో బాబు చెప్పాలని అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు

*పాలనా దక్షతలేని వ్యక్తి Jagan: నాదేండ్ల మనోహర్
జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, పాలనా దక్షతలేని వ్యక్తి జగన్ అని జనసేన పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ కుటుంబం కోసం, వైసీపీ కోసం రాష్ట్రాన్ని అంథకారంలోకి నెట్టేశారని ఆరోపించారు. ఈ నెల 8న సిరువెళ్లలో రచ్చబండ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కర్నూలు జిల్లాలో 400 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బలమైన రాజకీయ శక్తిగా జనసేన ఎదుగుతోందన్నారు. జనసేన చేస్తున్న కార్యక్రామలు ఏ రాజకీయ పార్టీ కూడా చేయడం లేదన్నారు. ఏపీ గురించి, రోడ్లు, కరెంటు గురించి పక్క రాష్ట్రాలు మాట్లాడుకునే దౌర్భాగ్య పరిస్థితి జగన్ తీసుకొచ్చారని నాదేండ్ల మనోహర్ మండిపడ్డారు

*జగన్‌ను సీఎం చేయడమే ప్రజలు చేసుకున్న పాపమా: Devathoti
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయడమే ప్రజలు చేసుకున్న పాపమా అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతి రోజూ ఏదో ఒక మూల హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నా ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోగా..ప్రతిపక్షాలు నానాయాగీ చేస్తున్నాయని అనడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ప్రజల బాగోగుల పట్ల బాధ్యత, ప్రజలు అంటే గౌరవంలేని ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్ రెడ్డి మాత్రమే ఉన్నారని విమర్శించారు. జగన్ దృష్టిలో ప్రజలంటే ఓటు బ్యాంకు మాత్రమే అని అన్నారు. ముఖ్యమంత్రి పదవి తన కష్టాలు తీర్చుకోవడానికి తప్ప.. ప్రజల కోసం ఏ ఒక్క రోజు కూడా పనిచేయడం లేదని దేవతోటి నాగరాజు విమర్శలు గుప్పించారు.

*నాగరాజుది మతపరమైన హత్యే: సంజయ్‌
సరూర్‌నగర్‌లో నాగరాజు అనే దళిత యువకుడిది మతపరమైన హత్యేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కారణంతోనే ఆయన ప్రాణాలు తీశారని విమర్శించారు. ఇంత కిరాతకమైన హత్యపై సెక్యులర్‌ పార్టీలు, సెక్యులర్‌ మేధావులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. నాగరాజును హత్య చేసిన వాళ్లను త్వరితగతిన గుర్తించి.. వారి వెనుక ఉన్న శక్తులను బయటపెట్టాలని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ అండతోనే ఎంఐఎం గుండాలు నాగరాజుని చంపేశారంటూ ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య చేసిన వాళ్లను వెంటనే గుర్తించి ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. హిందూ బిడ్డలపై జరిగే దాడులు, హత్యలపై హోంమంత్రి ఎందుకు మాట్లాడడం లేదని.. ఆయన పాతబస్తీకి మాత్రమే హోంమంత్రా అని నిలదీశారు. హిందువులంతా ఏకమైతే ఎంఐఎం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ హత్యపై దళిత సమాజం ఆలోచించాలని ఆయన కోరారు.

*రాజాసింగ్ జీ జ‌ర సునో.. న‌వ్వులు పూయించిన‌ మంత్రి హ‌రీశ్‌రావు..
కోఠి ఈఎన్టీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న రోగుల‌ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ప‌రామ‌ర్శించారు. ప‌లువురి రోగుల‌ను, వారి స‌హాయ‌కుల‌ను హ‌రీశ్‌రావు ఆప్యాయంగా ప‌లుక‌రించి.. వైద్య సేవ‌ల‌పై ఆరా తీశారు. ఈ క్ర‌మంలో ఓ రోగి త‌ల్లి చెప్పిన మాట‌లు విన్న హ‌రీశ్‌రావు.. త‌న ప‌క్క‌నే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అప్ర‌మ‌త్తం చేశాడు. వైద్య సేవ‌ల‌పై ఆమె మాట‌లు విన్న మీరు.. ఇప్ప‌టికైనా మా గురించి అసెంబ్లీలో మంచి మాట‌లు చెప్పాల‌ని రాజాసింగ్‌కు మంత్రి సూచించాడు. దీంతో అక్క‌డున్న వారంతా గ‌ట్టిగా న‌వ్వారు.మందులు ఇక్క‌డ ఇస్తున్నారా..? బ‌య‌ట నుంచి తెచ్చుకుంటున్నారా..? అని రోగి త‌ల్లిని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించాడు. ఇక్క‌డ్నే ఇస్తున్నార‌ని ఆమె చెప్పేస‌రికి.. ప‌క్కానా అని మ‌రోమారు మంత్రి అడిగారు. అవును అని ఆమె స‌మాధానం ఇచ్చే స‌రికి.. రాజాసింగ్ జీ జ‌ర సునో అంటూ హ‌రీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఆస్‌ిత్రుల్లోనే మందులు ఇస్తున్నారు.. వైద్య సేవ‌లు బాగా అందుతున్నాయ‌ని అసెంబ్లీలో చెప్పాల‌ని రాజాసింగ్‌కు మంత్రి సూచించారు.

*రాహుల్‌ చేతగానితనమే బీజేపీని గెలిపిస్తోంది: బాల్కసుమన్‌
రాష్ట్ర పునర్విభజన చట్టం అమలులో కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. మరోవైపు చట్టం అమలు జరిగేలా చూడడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమైందని ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌ విమర్శించారు. రాహుల్‌ గాంధీ చేతగానితనమే కేంద్రంలో బీజేపీని గెలిపిస్తోందన్నారు. జాతీయ పార్టీల నాయకులు ఇక్కడికి వచ్చేది ప్రజలకు మేలు చేయడం కోసం కాదని, దండయాత్ర చేయడానికని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎప్పుడిస్తారో.. ధరలను ఎప్పుడు దించుతారో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌, జగ్గారెడ్డి ఇష్టానుసారం వ్యవహరిేస్త తగిన విధంగా సమాధానం చెబుతామని బాల్క సుమన్‌ హెచ్చరించారు.

*అరాచక పాలనను అంతం చేద్దాం : బొల్లినేని
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనను అంతమొందించడానికి ప్రజలంతా సంసిద్ధులు కావాలని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు పేర్కొన్నారు. మండలంలోని సిద్దనకొండూరులో గురువారం రాత్రి చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామస్థులు బొల్లినేనికి అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లినేని మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించే విషయంలో వైసీపీ ప్రభుత్వం అభాసుపా లయిం దన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెంచలబా బు యాదవ్‌, రామానాయుడు, జయచంద్రారెడ్డి, బీవీ రామా రావు, జయరామిరెడ్డి, కాకు మహేష్‌, పువ్వాడి మోహన్‌ పాల్గొన్నారు.

*సీఎం జగన్‌కు చంద్రబాబు సవాలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. మన రాష్ట్రంలో ఐరన్ లెగ్ సీఎం జగన్ ఉన్నారంటూ విశాఖపట్నం జిల్లాలోని తాళ్లవలసలో జరిగిన సభలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి అన్యాయం మనం ఎన్నడూ చూడలేదని, నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని చంద్రబాబు మండిపడ్డారు. దేశంలో కల్లా పెట్రోధరలు ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. సీఎం జగన్‌కు చంద్రబాబు సవాలు విసిరారు. ఏపీ కంటే ఇతర రాష్ట్రాల్లో పెట్రో ధరలు అధికంగా ఉంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబు ప్రకటించారు. కోర్టు ఆదేశంతో గ్రామ సచివాలయాల రంగులు మార్చారని, రంగుల మార్పు కోసం ప్రజాధనాన్ని వృథా చేశారనిచంద్రబాబు మండిపడ్డారు. టెన్త్ పేపర్ లీక్ వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని, నాడు-నేడు అంటూ పాఠశాలలకు వైసీపీ రంగులు వేశారని, తన పోరాటం తన కోసం కాదని, మీ కోసం అని చంద్రబాబు అన్నారు.పెళ్లి అయితే కళ్యాణ కానుక, పండుగ అయితే పండుగ కానుక ఇచ్చామని చంద్రబాబు చెప్పారు.

*పీఏసీఎస్‌ల బలోపేతానికి సమగ్ర విధానం: కాకాణి
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి సమగ్ర విధానాన్ని తీసుకురానున్నట్లు వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. గురువారం విజయవాడలోని ఆప్కాబ్‌ కార్యాలయంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతుభరోసా కేంద్రాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో అనుసంధానించి, రైతులకు ఉత్తమ సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, పీఏసీఎస్‌ ఉద్యోగుల దీర్ఘకాల సమస్యలపై సహకారశాఖ అధికారులు సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. హెచ్‌ఆర్‌ పాలసీ పూర్తి స్థాయిలో అమలు చేస్తామని, జీతభత్యాల విషయంలో రాష్ట్రస్థాయి సాధికార కమిటీ ద్వారా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘ నేతలు పీవీ సత్యనారాయణరాజు, టి.వెంట్రామయ్య, పి.సత్యనారాయణ, పి.అంజిబాబు తెలిపారు. ఇక, రైతుభరోసా- పీఎం కిసాన్‌ పథకం కింద 2022-23లో మొదటి విడత లబ్ధి పొందే రైతుల జాబితాలను సామాజిక తనిఖీల కోసం ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు రైతుభరోసా కేంద్రాల్లో ప్రదర్శించనున్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది.

*రాష్ట్రంలో శాంతిభద్రతలు మృగ్యం: వర్ల
‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు మృగ్యమైపోయాయి. ఆ కారణంగానే రేపల్లె రైల్వేస్టేషన్‌లో సామూహిక అత్యాచారం జరిగింది. కనీస అవగాహన లేని సీఎం ఉండటం వల్లే రాష్ట్రంలో మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు నిరంతరం జరుగుతున్నాయి’’ అని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. గురువారం ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేపల్లె అత్యాచార బాధితురాలిని ఆయన పరామర్శించారు. జరిగిన ఘటనను తలుచుకుని బాధితురాలు ఇప్పటికీ వణికిపోతోందన్నారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పలురకాల దాడుల్లోని నిందితులతో వైసీపీ ప్రభుత్వం స్నేహంగా మెలుగుతోందని ఆరోపించారు. తానేటి వనతి హోం మంత్రి పదవికి రాజీనామా చేసి, మరో శాఖ మంత్రిగా పదవి తీసుకోవాలని సూచించారు. ‘‘బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి పోయి, మాజీ అయ్యారు. అయినా పొగరు తగ్గలేదు. ఇప్పుడు ఆయన ఆఫా్ట్రల్‌ ఎమ్మెల్యే అన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి’’ అని వర్ల రామయ్య అన్నారు.

*తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌‌ను తీసుకొస్తాం: జేపీ నడ్డా
తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ‘జనం గోస-బీజేపీ భరోసా’ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు చూడాలనుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌‌ను తీసుకొస్తామన్నారు. దుబ్బాక, హుజురాబాద్‌లో బీజేపీ ప్రభంజనం సృష్టించిందని తెలిపారు. కేసీఆర్‌ సర్కార్‌ అవినీతిలో కూరుకుపోయిందని జేపీ నడ్డా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సీఎం కేసీఆర్‌ ఏటీఎంగా మారిందని విమర్శించారు. మిషన్‌ భగీరథలో కూడా అవినీతికి పాల్పడ్డారని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.

*LICని కారుచౌకగా అమ్మేస్తున్నారు : రాహుల్ గాంధీ
జీవిత బీమా సంస్థ (LIC) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ఓపెన్ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అతి పెద్ద బీమా సంస్థ విలువను అతి తక్కువగా లెక్కగట్టారని, కారుచౌకగా అమ్మేస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై మండిపడ్డారు. రాహుల్ గాంధీ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, ఎల్ఐసీ 13.94 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని, 30 కోట్ల మంది పాలసీ హోల్డర్లు ఉన్నారని, రూ.39 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని, షేర్ హోల్డర్లకు పెట్టుబడులపై రాబడిని ఇవ్వడంలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉందని, అయినప్పటికీ మోదీ ప్రభుత్వం ఈ సంస్థ విలువను అతి తక్కువగా అంచనా వేసిందని ఆరోపించారు. భారత దేశపు అత్యంత విలువైన సంపదల్లో ఒకటైన ఎల్ఐసీని అంత కారుచౌకగా ఎందుకు అమ్మేస్తున్నారని ప్రశ్నించారు. LIC IPO మే 4న ఓపెన్ అయింది. ఇది మన దేశంలో అతి పెద్ద ఆఫర్. రిటెయిల్, సంస్థాగత మదుపరులు దీనిలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ ఆఫర్ మే 9న ముగుస్తుంది. ఒక్కొక్క ఈక్విటీ షేర్‌కు రూ.902-949 ప్రైస్ బ్యాండ్‌ను నిర్ణయించింది. అర్హులైన ఉద్యోగులు, పాలసీ హోల్డర్లకు రిజర్వేషన్ కల్పించింది. రిటెయిల్ ఇన్వెస్టర్లు, ఎలిజిబుల్ ఎంప్లాయీస్ ఒక్కొక్క ఈక్విటీ షేర్‌కు రూ.45 చొప్పున, పాలసీ హోల్డర్స్ రూ.60 చొప్పున డిస్కౌంట్ పొందవచ్చునని తెలిపింది. ఎల్ఐసీలో తనకుగల 3.5 శాతం వాటాను అమ్మేసి రూ.21,000 ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ షేర్లకు నిర్ణయించిన ధరలపై కాంగ్రెస్ గత మంగళవారం ప్రశ్నలను లేవనెత్తింది. 30 కోట్ల మంది పాలసీ హోల్డర్లను పణంగా పెట్టి కారుచౌకగా ఈ ధరలను నిర్ణయించారని ఆరోపించింది

*వైసీపీ అరాచకాలు, దుర్మార్గాలకు టీడీపీ నేతలు లొంగలేదు: శ్రీనివాసరావు
వైసీపీకి దక్కిన దుగ్గిరాల ఎంపీపీ పదవి టీడీపీ పెట్టిన భిక్ష అని టీడీపీ సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వైసీపీ తరఫున గెలిచిన ఎంపీటీసీలను కూడా నమ్మలేకపోయాడని మండిపడ్డారు. తన సొంత పార్టీ ఎంపీటీసీ సభ్యులపై నమ్మకం లేకే ఎమ్మెల్యే ఆర్కే వైసీపీ ఎంపీటీసీ సభ్యులను ఎంపీపీ ఎన్నికకు దూరంగా ఉంచారని విమర్శించారు. అనైతిక చర్యలతో దుగ్గిరాల ఎంపీపీ పదవిని వైసీపీ కైవసం చేసుకుందని, ఎంపీటీసీ ఎన్నికల నాటి నుంచి టీడీపీ నేతలపై ఎన్నో కక్ష పూర్తి చర్యలకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్పడ్డారని శ్రీనివాసరావు ఆరోపించారు. ఎన్నో అరాచకాలు.. ఎన్నో దుర్మార్గాలకు వైసీపీ నేతలు పాల్పడ్డా, టీడీపీ నేతలు లొంగలేదన్నారు. బీసీ మైనార్టీకి చెందిన ముస్లిం మహిళకు ఎంపీపీ పదవి దక్కకుండా, ఎమ్మెల్యే ఆర్కే దుర్మార్గంగా వ్యవహరించారని ఆయన ధ్వజమెత్తారు. సొంత పార్టీ ఎంపీటీసీ సభ్యులను కూడా కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అని శ్రీనివాసరావు మండిపడ్డారు.

*అది విద్యా దీవెన కాదు… వంచన..: MP Raghurama
అది జగనన్న విద్యా దీవెన కాదని, వంచన అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వసతి దీవెన కూడా సగం మాత్రమే వస్తోందని, చాలా మందికి బెనిఫిట్ రావడం లేదని అన్నారు. తల్లి అకౌంట్‌లో డబ్బులు వేసి దాన్ని కాలేజీలకు ఇవ్వడం ఏంటని నిలదీశారు. ఓట్ల కొనుగోలులో భాగమా ఇది? అని అన్నారు. విద్యా దీవెన అర్ధం లేని ఆలోచనని అన్నారు.సీఎం జగన్ సమావేశాలకు జనం రావడం లేదని, శ్రీకాకుళంలో చంద్రబాబు పర్యటన చేస్తుంటే జనాలు మీద పడుతున్నారని రాఘురామ అన్నారు. టీడీపీ సమావేశాలకు ప్రజలు పెద్ద ఎత్తున్న వస్తున్నారు… జగన్ సభకు జనాలు రావాలి, చప్పట్లు కొట్టాలని వైసీపీ నేతలు అడుగుతున్నారన్నారు. ఇకనైనా విద్యా దీవెనలు తల్లులకు ఇవ్వడం మానేసి కాలేజీలకు ఇవ్వాలని సూచించారు. వైసీపీ ఓట్ల కుట్ర ప్రజలకు తెలిసిపోయిందని రఘురామ వ్యాఖ్యానించారు.

*క్లబ్బుల్లో తిరిగే రాహుల్ గాంధీకి రైతుల గురించి మాట్లాడే హక్కులేదు
క్లబ్బుల్లో తిరిగే రాహుల్ గాంధీకి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. యుపిఏ పాలనలో దేశంలో 1,58,117 మంది రైతులు చనిపోయారని, తెలంగాణ రాక ముందు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పాలనలో 18వేల మంది రైతులు చనిపోయారని ఆయన గుర్తుచేశారు. అప్పటి ప్రభుత్వ విధానాల వల్ల రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలుచేసుకున్నారని అన్నారు. ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ఐటీ, చేనేత, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె టి రామారావు సందర్శించనున్న హనుమకొండ నయీం నగర్ లోని సాప్ట్ పాత్ ఐటీ ఆఫీస్ ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు తదితరులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన సాప్ట్ పాత్ ఐటీ కార్యాలయాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పేరుకే 7 గంటల కరెంటు కాని, వచ్చింది 3 గంటలే. అందులోనూ కోతలే అధికం.కరెంటుతీగలపై బట్టలు ఆరేసుకునే పరిస్థితి.పొలాల్లో పని చేసుకుంటూ పాముకాటుకు, కరెంటు షాకుకు గురై చనిపోయే వాళ్ళని గుర్తు చేశారు.నిజామాబాద్ లో ఎర్రజొన్న రైతులకు కాల్చి చంపించింది కాంగ్రెస్ వాళ్ళు కాదా?ఆంధ్ర, తెలంగాణ లను కలపడం కాంగ్రెస్ తప్పిదం.కాంగ్రెస్ తెలంగాణ వ్యతిరేక వైఖరి వల్ల 1969 తెలంగాణ ఉద్యమంలో 369 మంది అమరులైనారు.మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులైనారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వనందుకే ఈ బలిదానాలు జరిగాయి.

*నైతిక విజయం టీడీపీదే: లోకేశ్‌
దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక విషయంలో నైతిక విజయం టీడీపీదేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. అధికార బలం, పోలీసుల అండతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంపీపీ కుర్చీని కబ్జా చేశారని విమర్శించారు. ఆళ్ల అక్రమాలపై విసుగుచెందిన ముగ్గురు సొంతపార్టీ ఎంపీటీసీ సభ్యులు తిరుగుబాటు చేస్తే వారిని కిడ్నాప్‌ చేసి, నిర్భందించి అయిదుగురు సభ్యులతో ఎంపీపీని ఎన్నుకోవడం ఓటమి కాక మరేమిటన్నారు. ఎమ్మెల్యే అక్రమాలు, కుతంత్రాలను ఎదుర్కొంటూ పోరాడిన టీడీపీ ఎంపీటీసీలు, నేతలు, కార్యకర్తలందరినీ లోకేశ్‌ అభినందించారు.

*ఆర్టీసీని నిర్వీర్యం చేసిన ప్రభుత్వం: రామకృష్ణ
రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎ్‌సఆర్టీసీని నిర్వీర్యం చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ విషయంలో కూడా సీఎం జగన్‌ మాట తప్పి, మడమ తిప్పారన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణదిశగా జగన్‌ సర్కార్‌ పావులు కదుపుతోందని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని చెబుతున్న జగన్‌ లక్షల కోట్ల ఆస్తులు కలిగిన ఆర్టీసీకి సొంత బస్సులను ఎందుకు సమకూర్చడం లేదన్నారు. యూనియన్‌ అగ్రిమెంట్‌ ప్రకారం 25 శాతం మాత్రమే అద్దె బస్సులు ఉండాల్సి ఉండగా, 35 శాతానికి ఎలా అనుమతించారని నిలదీశారు. ఇప్పటికే ఏపీలోని పోర్టులను ప్రైవేటు శక్తులకు కట్టబెట్టారని, ఇప్పుడు దశల వారీగా ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు పావులు కదుపుతున్నారని రామకృష్ణ విమర్శించారు.