Politics

పెట్టుబడుల కోసం జగన్ దావోస్ వెళ్లినట్లు లేదు – TNI రాజకీయ వార్తలు

పెట్టుబడుల కోసం జగన్ దావోస్ వెళ్లినట్లు లేదు – TNI రాజకీయ వార్తలు

* సీఎం జగన్ దావోస్ పర్యటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ పలు వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… పెట్టుబడుల కోసం జగన్ దావోస్ వెళ్లినట్లు లేదని.. అక్కడ వైసీపీ నేతల మీటింగ్ జరుగుతున్నట్లే ఉందని విమర్శించారు. పారిశ్రామిక వేత్తలు ఎవరూ జగన్‌ను కలవడానికి రావడం లేదన్నారు. గత 24 గంటల్లో జగన్‌ను కలిసిన ఏకైక పారిశ్రామిక వేత్త ఆదానీ అని చెప్పుకొచ్చారు. ఏపీ రాజధాని ఏదంటే.. జగన్ ఏం సమాధానం చెబుతారని లోకేష్ ప్రశ్నించారు.

*కేసీఆర్ ముక్త్ తెలంగాణే బీజేపీ లక్ష్యం:Tarun chug
కేసీఆర్ము క్త్ తెలంగాణే బీజేపీ లక్ష్యం తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్‌చుగ్ పేర్కొన్నారు.రైతులను కేసీఆర్‌ మోసం చేశారని తరుణ్‌చుగ్‌ ఆరోపించారు.తెలంగాణలో టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో వున్నారని చెప్పారు.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.బీజేపీ సర్కార్ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. వ్యక్తి, కుటుంబం కోసం కాదు.. దేశం కోసమే బీజేపీ పనిచేస్తుందని తరుణ్‌చుగ్‌ పేర్కొన్నారు.

*బస్సు యాత్ర పోస్టర్లు విడుదల చేసిన MLA
నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర కొనసాగుతుందన్నారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్‌లలో సీఎం జగన్మోహన్ రెడ్డి 50% సముచిత స్థానం కల్పించారని గుర్తు చేశారు. బస్సు యాత్రను ప్రజలు జయప్రదం చేయాలని కోరారు.

*జగన్‌ నా వెంట్రుక కూడా పీకలేడు: Lokesh
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… ‘‘జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేడు’’ అని అన్నారు. ఎన్నో కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డానని తనపై అసత్య ఆరోపణలు చేసి ఏమీ పీకలేక కోవిడ్ నిబంధనల ఉల్లంఘనల కేసులో కోర్టుకు తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇప్పటి వరకు తనపై 14 కేసులు పెట్టి ఏం పీకారని ప్రశ్నించారు. కావాలంటే మరో 10కేసులు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఏ తప్పు చేయలేదు కాబట్టే కోర్టుకు వచ్చానని, జగన్ లా వాయిదాలు తీసుకోవట్లేదని టీడీపీ నేత తెలిపారు.ప్రజలు రాళ్లతో కొట్టించుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుంటున్నారన్నారు. 2016 నుంచి తపపై చేసిన అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమని… తన అవినీతి కేసులపై చర్చకు జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. తెలుగుదేశం నేతలతో పాటు దళిత ప్రజలపై వైసీపీ దాడులకు తెగపడుతోందన్నారు. తాజాగా సొంత కార్యకర్తల పైనే దాడులకు తెగపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఆనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. సొంత పార్టీ కార్యకర్తను కొట్టి చంపేసినా ఆ కుటుంబాన్ని కాపాడలేని పరిస్థితిల్లో జగన్ ఉన్నారన్నారు. 72 గంటల్లో ఎమ్మెల్సీ అనంతబాబు… సజ్జల సహా వైసీపీ ముఖ్య నేతలను కలిశారని ఆయన తెలిపారు.

*Sajjalaపై నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డ్రైవర్‌ను హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్.. సజ్జలను కలిశారన్నారు. డ్రైవర్‌ను చంపేసి వైసీపీ ఎమ్మెల్సీ పెళ్లిళ్లకు తిరుగుతున్నారని… కానీ పోలీసులు మాత్రం అరెస్ట్ చేయడం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఉదయ్‌ భాస్కర్‌ను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని… లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఇన్నాళ్లు ప్రజలను, టీడీపీ నేతలను వేధించిన జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలనూ వేధిస్తోందని ఆగ్రహించారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ఉదయ్‌ భాస్కర్‌పై కేసు పెట్టడానికి తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. గంజాయి సరఫరాలో ఉదయ్‌భాస్కర్ ప్రధాన భూమిక పోషిస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతుంటే సజ్జల ఏం చేస్తున్నారని లోకేష్ ప్రశ్నించారు.

*ఆ ముగ్గురికీ అనంతబాబు బినామీ.. ఏ స్థాయిలో సపోర్ట్‌ లేకపోతే చంపేస్తారు?: హర్షకుమార్‌
వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌బాబు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి వ్యవహారంపై హైకోర్టు కలగజేసుకుని సీబీఐ విచారణ ఆదేశించాలని మాజీ ఎంపీ హర్షకుమార్‌ కోరారు. అమలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్‌, మంత్రి వేణుగోపాలకృష్ణ, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి ఎమ్మెల్సీ అనంతబాబు బినామీ అని హర్షకుమార్ ఆరోపించారు. అందుకే కళ్లముందే తిరుగుతున్నా అతడిని పట్టుకునేందుకు పోలీసుల సాహసించడం లేదని చెప్పారు.ఏజెన్సీలో గంజాయి నుంచి గనుల వరకు అక్రమాలన్నీ అనంతబాబు కనుసన్నల్లోనే జరుగుతుంటాయని.. గెస్ట్‌హౌస్‌లు, ఇతర రహస్య ప్రదేశాలు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యానికి తెలుసని చెప్పారు. దీనికి సంబంధించిన విషయాలు అక్కడక్కడా మాట్లాడుతున్నాడనే సుబ్రహ్మణ్యాన్ని చంపేశారని హర్షకుమార్‌ ఆరోపించారు. ఒక ఎమ్మెల్సీ తీసుకెళ్లి చంపేసి తీసుకొచ్చాడని.. అతడికి ఏ స్థాయిలో మద్దతు లేకపోతే ఇలా చేస్తాడని ప్రశ్నించారు.

*అందుకే ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన
9 ఏళ్ల పాటు విస్మరించి..కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ (KCR) సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్‌లకు సాగునీరు అందించే ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. జహీరాబాద్ మండలం అల్గోల్‌లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయనతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రుణ‌మాఫీ చేయకపోవడం వల్ల రైతులకు వడ్డీ భారం పెరిగిందన్నారు. ప్రగతి భవన్ నిర్మాణానికి రూ. 1000 కోట్లు, సచివాలయం నిర్మాణానికి రూ.3000 కోట్లు ఖర్చు చేయడం అవసరమా? అని ప్రశ్నించారు. ఈ డబ్బుతో మూతపడ్డ చక్కెర పరిశ్రమలు తెరిపించొచ్చని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కోమటిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

*తెలంగాణ ప్రభుత్వం కూడా తగ్గించాలి
ప్రజలపై భారం తగ్గించేందుకు కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిందని, దేశంలోనే అత్యధికంగా సెస్సు వసూలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులను వదిలేసి.. కేసీఆర్ పంజాబ్ రైతులను ఆదుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంపై కేసీఆర్‌కు కనీస అవగాహన కూడా లేదన్నారు. కేసీఆర్ ప్రకటించిన కేజీ టు పీజీ ఉచిత విద్యపై ఆయనే స్పందించాలన్నారు. కేసీఆర్ అమెరికా అధ్యక్షుడిని కలిసినా, పాకిస్థాన్ అధ్యక్షుడిని కలిసినా తాము భయపడమన్నారు. కేసీఆర్ సంచలనాలు ప్రగతి భవన్, ఫాంహౌస్‌కే పరిమితమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్ కుటుంబానికి చీదరింపు తప్పదన్నారు

*వైసీపీ బస్సు యాత్రా.. జాగ్రత్త: జేసీ ప్రభాకర్‌రెడ్డి
గడపగడపకూ ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు వెళ్లినపుడే వైసీపీ నాయకుల పనైపోయిందనీ, ఈసారి బస్సుయాత్ర పేరుతో ప్రజల్లోకొస్తే.. రాళ్లు రువ్వే పరిస్థితులు ఉంటాయి.. జాగ్రత్త అని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. అనంతపురంలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అట్టర్‌ఫ్లాప్‌ అయిందన్నారు. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడేమో బస్సుయాత్ర అంటున్నారని తనదైన శైలిలో వ్యంగాస్ర్తాలు సంఽధించారు. పోలీసు వాహనాలకు సెక్యూరిటీగా ఇసుప కడ్డీలతో డ్రిల్లింగ్‌ చేయించుకున్నట్లుగా… మంత్రుల యాత్ర బస్సుకు పోలీసు వాహనాల తరహాలో డ్రిల్లింగ్‌ చేయించుకుంటే మంచిదని తనకు అనిపిస్తోందన్నారు. తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు జిల్లా పర్యటనకొస్తే… ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. అది చూసైనా వైసీపీ నాయకులు వారి పద్ధతులు మార్చుకుంటే బాగుంటుందన్నారు. పోలీసు అనే మహావృక్షం కింద వైసీపీ నాయకులు బతికిపోతున్నారని ఎద్దేవా చేశారు. అదే పోలీసులు లేకపోతే ప్రజల్లో వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహకు కూడా అందడం లేదన్నారు.

*సవాంగ్‌ ముద్ర నుంచి బయటపడాలి: వర్ల
అధికార పార్టీ నేతలు ఏ నేరాలు చేసినా దానిని దాచిపెట్టడంలో గత డీజీపీ గౌతం సవాంగ్‌ ప్రావీణ్యం సంపాదించారని, ఆ తరహా ముద్ర నుంచి పోలీస్‌ శాఖ బయటకు రావాల్సిన అవసరం ఉందని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్‌ను హత్య చేస్తే దానిని దాచిపెట్టడానికి పోలీస్‌ శాఖ ఎందుకు తాపత్రయపడిందని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు ఏం చేసినా ఏ చర్య తీసుకోవద్దని వైసీపీ ప్రభుత్వం పోలీసు శాఖ కాళ్లూ చేతులు కట్టేసిందని, అందుకే వైసీపీ నేతలు ధైర్యంగా హత్యలు చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యారావు ఆరోపించారు.

*ధరలు తగ్గించేశామని ప్రకటించడం హాస్యాస్పదం: మంత్రి బొత్స
కేంద్రం పెట్రోలు, డీజిల్ ధరలను 40 శాతం పెంచి.. కేవలం 2 శాతం మాత్రమే తగ్గించిందని, ఈ మాత్రానికే ధరలు తగ్గించేశామని ప్రకటించడం హాస్యాస్పదమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 2019లో పెట్రోలు ధరలను, ఇప్పటి ధరలతో పోల్చి చూడాలన్నారు. కొన్ని దుష్టశక్తులు అడ్డు పడుతుండడం వల్ల శ్రీకాకుళం మున్సిపల్ కార్పోరేషన్‌కి దశాబ్దాలుగా ఎన్నికలు జరగలేదని చెప్పారు. సుబ్రహ్మణ్యం మృతి కేసులో ఎమ్మెల్సీ అనంత బాబుపై కేసు నమోదైందని, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. మే 26 నుంచి 29 వరకు సామాజిక న్యాయబేరి బస్సుయాత్ర చేపడుతున్నామని చెప్పారు. సంక్షేమ పథకాల అమలు గురించి బస్సుయాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు.

*రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు సీఎం కావాలి: అశోక్‌బాబు
ప్రస్తుత ప్రభుత్వం మారాలని రాష్ట్ర ఉద్యోగులందరూ మనసా, వాచా కోరుకుంటున్నారని, వారి కోరిక నెరవేరాలని తాను శ్రీవారిని ప్రార్థించినట్టు ఎమ్మెల్సీ అశోక్‌బాబు తెలిపారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 13 లక్షల ఉద్యోగులున్నారని, ప్రభుత్వ తీరుతో వారెవ్వరూ సంతోషంగా లేరన్నారు. శాశ్వత ఉద్యోగులు పదవీ విరమణ చేస్తే డబ్బులు వచ్చే పరిస్థితి లేదన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడం లేదని, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నెలనెలా జీతాలు అందడం లేదన్నారు. ఈ క్రమంలోనే తాను శ్రీవారిని దర్శించుకుని రాష్ట్రంలో ప్రజల కష్టాలు, ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు తొలగిపోయి చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని ప్రార్థించానన్నారు. తాను స్వార్థంతో ఈ కోరిక కోరలేదని, ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు. చంద్రబాబును సీఎంగా ఎన్నుకునేలా ప్రజల మనుసు మార్చాలని ప్రార్థించానన్నారు.

*ధాన్యం కొనుగోళ్లపై సీబీఐ విచారణ జరపాలి: అయ్యన్న
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణం జరిగిందని అధికార పార్టీకి చెందిన ఎంపీ (రాజ్యసభ) పిల్లి సుభాశ్‌ చంద్రబోస్‌ బహిరంగంగా ప్రకటించారని.. వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సిగ్గుం టే ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు డిమాండ్‌ చేశారు. అనకాపల్లిలో ఆదివారం నిర్వహించిన మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఏపీలో బీసీ నేతలు లేనట్టు, జగన్‌రెడ్డి తెలంగాణకు చెందిన బీసీ నేతకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తున్నాని ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మొత్తం జీతం చెల్లిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్‌.. గెలిచిన తర్వాత ‘ఆప్కోస్‌’ అనే సొంత సంస్థ పెట్టుకొని ప్రతి ఉద్యోగి జీతం నుంచి నెలకు రూ.8 వేల చొప్పున దోచేస్తున్నాడని ఆరోపించారు. కరెంటు, ఆర్టీసీ బస్సు చార్జీలు, ఇళ్ల పన్నులు విపరీతంగా పెంచేశారని, అమ్మఒడితో పాటు ఇతర సంక్షేమ పథకాలకు సవాలక్ష నిబంధనలు విధించి, లబ్ధిదారులను భారీగా కుదిస్తున్నారని అయ్యన్నపాత్రుడు విమర్శించారు.