NRI-NRT

పిల్లికి ఎలుక సాక్ష్యం.. అదానీకి థాంటన్‌

పిల్లికి ఎలుక సాక్ష్యం.. అదానీకి థాంటన్‌

‘హిండెన్‌బర్గ్‌’ రిసెర్చ్‌ ఆరోపణలను ఎదుర్కోవడంలో భాగంగా గ్రూప్‌లోని కంపెనీలపై స్వతంత్ర ఆడిటింగ్‌ నిర్వహించేందుకు అకౌంటెన్సీ సంస్థ ‘గ్రాంట్‌ థాంటన్‌’ను అదానీ గ్రూప్‌ నియమించింది.

  • ‘గ్రాంట్‌ థాంటన్‌’తో అదానీ గ్రూప్‌ ఆడిటింగా
  • బ్రిటన్‌ సంస్థ గ్రాంట్‌ థాంటన్‌కు అదానీ గ్రూప్‌ ఆడిటింగ్‌
  • చట్టాలను పాటించామని నిరూపించుకోడానికేనట
  • గతంలో పలు కేసుల్లో థాంటన్‌ తప్పుడు ఆడిటింగ్‌
  • కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ఆస్తులపై అడ్డగోలు అంచనాలు
  • 4 వేల కోట్లు పెంచుతూ ఆడిట్‌ రిపోర్ట్‌ ఇచ్చిన కంపెనీ ఇది
  • కంపెనీ చరిత్రలో కోర్టు చీవాట్లు, పెనాల్టీలు ఎన్నో..

హిండెన్‌బర్గ్‌ ఆరోపణల నేపథ్యంలో స్వతంత్ర ఆడిటింగ్‌కు సిద్ధమైన అదానీ గ్రూప్‌.. ఆ బాధ్యతను తానా అంటే తందానా అనే గ్రాంట్‌ థాంటన్‌ సంస్థకు అప్పగించడం విమర్శల పాలవుతున్నది. ఏ మాత్రం విశ్వసనీయత లేని ఈ బ్రిటన్‌ అకౌంటెన్సీ సంస్థ.. తప్పులతడక నివేదికలకు పెట్టింది పేరు. కోర్టుల చీవాట్లు, పెనాల్టీలు ఆ సంస్థకు కొత్తకాదు.

నేరారోపణ ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి రాజావారి దగ్గరికి వచ్చాడు. తాను ఏ తప్పూ చేయలేదని వాదించాడు. అసలు నిజం తెలియాలంటే.. నిజానిజాల కోసం ఫలానా వ్యక్తిని పిలువాలని సూచించాడు. ఇందులో ట్విస్ట్‌ ఏంటంటే.. నిందితుడు సిఫారసు చేసిన వ్యక్తి ఏకంగా శిక్షలు అనుభవించిన నేరగాడు. అదానీ గ్రూప్‌ వ్యవహారంలో ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతున్నది.

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ, స్పెషల్‌ టాస్క్‌ బ్యూరో): ‘హిండెన్‌బర్గ్‌’ రిసెర్చ్‌ ఆరోపణలను ఎదుర్కోవడంలో భాగంగా గ్రూప్‌లోని కంపెనీలపై స్వతంత్ర ఆడిటింగ్‌ నిర్వహించేందుకు అకౌంటెన్సీ సంస్థ ‘గ్రాంట్‌ థాంటన్‌’ను అదానీ గ్రూప్‌ నియమించింది. తమ గ్రూప్‌ అన్ని చట్టాలను పాటిస్తున్నదని, ఏ విషయాలను దాచిపెట్టలేదని, సెబీ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వంటి నియంత్రణ సంస్థలకు నిరూపించడమే ఈ ఆడిట్‌ ఉద్దేశంగా ప్రకటించింది. అయితే ‘గ్రాంట్‌ థాంటన్‌’ విశ్వసనీయత ఏమిటన్నదానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతున్నది. ‘గ్రాంట్‌ థాంటన్‌’ సంస్థ ఎనిమిదికిపైగా కేసుల్లో ఇప్పటివరకూ ఇచ్చిన ఆడిటింగ్‌ నివేదికలు తప్పుల తడకగా, లోపభూయిష్టంగా ఉండటమే దీనికి కారణం.

రూ.4 వేల కోట్లు ఎక్కువ చూపెట్టారు పరారీ ఆర్థిక నేరగాడు విజయ్‌ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ఆస్తుల విలువను ఉద్దేశపూర్వకంగా ఎక్కువగా చూపించిన కేసులో ‘గ్రాంట్‌ థాంటన్‌’ పేరు 2018లో మీడియాలో మార్మోగింది. దివాలా అంచుకు చేరుకొన్న కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మొత్తం ఆస్తుల విలువ రూ.4,100 కోట్ల వరకు ఉన్నట్టు ‘గ్రాంట్‌ థాంటన్‌’ ఇచ్చిన ఆడిట్‌ నివేదిక అప్పట్లోనే కాదు.. ఎప్పటికీ ఓ సంచలనమే మరి. అయితే రుణదాతలకు ఈ నివేదికపై అనుమానాలు వ్యక్తమవడంతో కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా మరో ఆడిటింగ్‌ జరిగింది. దీంట్లో ఎయిర్‌లైన్స్‌ ఆస్తుల విలువ రూ.160 కోట్లకు మించి లేదని తేలింది. దీంతో ‘గ్రాంట్‌ థాంటన్‌’పై సీబీఐ కేసు నమోదు చేయడం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ కేసులో ప్రధాన రుణదాత అయిన ఎస్బీఐకి ప్రత్యేక సలహాదారుగా వ్యవహరించిన ‘గ్రాంట్‌ థాంటన్‌’.. ఆ కేసునూ ప్రభావితం చేయాలని ప్రయత్నించింది. దీంతో గ్రాంట్‌ థాంటన్‌ భారత్‌ ఎల్‌ఎల్‌పీ భాగస్వామి ఆశిష్‌ చావ్‌చరియాకు ఎయిబబర్‌లైన్స్‌ మాజీ ఉద్యోగులు కోర్టు ద్వారా లీగల్‌ నోటీసులిచ్చారు. నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్సీఎల్‌ఏటీ) ఆదేశాలను పాటించకపోవడమే ఈ నోటీసులకు కారణం.

పేరు గొప్ప.. ఊరు దిబ్బ:
‘గ్రాంట్‌ థాంటన్‌’ 1980లో ప్రారంభమైనప్పటికీ, దీని వ్యవస్థాపకుడు అలెగ్జాండర్‌ గ్రాంట్‌ 1924 నుంచే వివిధ రూపాల్లో అకౌంటెన్సీ కార్యకలాపాలు నిర్వహించారు. అంటే ఒకవిధంగా సుమారు వందేండ్ల క్రితమే ఈ సంస్థ ప్రారంభించినట్టు లెక్క. బ్రిటన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ 150 దేశాల్లో బ్రాంచీలను కలిగి ఉన్నది. రెవెన్యూపరంగా ప్రపంచంలో ఏడో అతిపెద్ద అకౌంటెన్సీ సంస్థగా, ఉద్యోగుల పరంగా (68,000 ఉద్యోగులు) ఆరో అతిపెద్ద అకౌంటెన్సీ కంపెనీగా గుర్తింపు పొందింది. అయితే విశ్వసనీయతలో మాత్రం పలు విమర్శలను ఎదుర్కొంటున్నది. బీజేపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన క్లీన్‌ గంగా పథకంతోపాటు, ప్రజాధనాన్ని సరైన రీతిలో ప్రభుత్వం ఖర్చు చేయడం కోసం నీతీ ఆయోగ్‌కు సాంకేతిక సలహాలు ఇవ్వడానికీ కేంద్రం ఈ ‘గ్రాంట్‌ థాంటన్‌’ సేవలనే వినియోగించుకోవడం గమనార్హం. అయితే అనూహ్యంగా ఈ రెండూ అట్టర్‌ఫ్లాప్‌ కావడం విశేషం.

జరిమానాలే.. జరిమానాలు:
కంపెనీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆడిటింగ్‌ నిర్వహించడం, వాళ్లు సూచించిన విధంగా లెక్కలను తారుమారు చేయడం ‘గ్రాంట్‌ థాంటన్‌’కు కొత్తేమీకాదు. బ్రిటన్‌లో ప్రఖ్యాత స్పోర్ట్స్‌ రిటైల్‌ కంపెనీ ‘స్పోర్ట్స్‌ డైరెక్ట్‌’లో జరిగిన అవకతవకలపై ‘గ్రాంట్‌ థాంటన్‌’ తప్పుడు ఆడిటింగ్‌ రిపోర్ట్‌ ఇచ్చింది. సంస్థ వ్యవస్థాపకుడు మైక్‌ ఆశ్లే సోదరుడు స్పోర్ట్స్‌ డైరెక్ట్‌ కోసం మరో డెలివరీ సంస్థను నడిపి నిబంధనలు ఉల్లంఘించిన విషయాన్ని రిపోర్ట్‌లో ఉద్దేశపూర్వకంగా ఎక్కడా ప్రస్తావించలేదు. దీనిపై బ్రిటీష్‌ ప్రభుత్వం సీరియస్‌ అయింది. ‘గ్రాంట్‌ థాంటన్‌’కు 15 లక్షల డాలర్ల జరిమానా విధించింది. అలాగే దివాలా తీసిన బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత కెఫే చైన్‌ పాటిస్సెరీ వలేరియాలో అవకతవకలను గుర్తించడంలో ‘గ్రాంట్‌ థాంటన్‌’ విఫలమైంది. దీంతో కోర్టు ‘గ్రాంట్‌ థాంటన్‌’కు 28 లక్షల డాలర్ల జరిమానా వేసింది. ఇలాంటి మరో నాలుగైదు కేసుల్లోనూ ‘గ్రాంట్‌ థాంటన్‌’ పలు ఆరోపణలు ఎదుర్కొన్నది.

ఇంత అధిక విలువపై ఇన్వెస్ట్‌ చేసేదెలా:
అదానీ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల్లో ఒక్క అదానీ పోర్ట్స్‌ మినహా మిగిలినవేవీ ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థల అనలిస్టుల కవరేజ్‌లో దాదాపు లేవు. కవరేజ్‌ చేయనందున వీటిని కొనమని లేదా విక్రయించమంటూ అనలిస్ట్‌ల సిఫార్సులు కూడా ఉండవు. ఈ కారణంగా ఆయా కంపెనీల ఆర్థిక స్థితిగతుల్ని ఇన్వెస్టర్లు అర్థం చేసుకోవడం కష్టమని విశ్లేషకులు అంటున్నారు. ఈ షేర్ల అధిక విలువలే వాటిని ట్రాక్‌ చేయకపోవడానికి కారణమని అనలిస్టులు, ఫండ్‌ మేనేజర్లు ఆరోపిస్తుంటారు. ‘అదానీ కంపెనీల షేర్ల విలువలు చాలా ఎక్కువ. వీటిలో ఇన్వెస్ట్‌చేసి సమాధానం చెప్పుకునేదెలా? వీటి బదులు ఇతర కంపెనీలపై మేము దృష్టిపెట్టడం మంచిది’ అని ఒక స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ రీసెర్చ్‌ హెడ్‌ చెప్పారు.

పలు కేసుల్లో ‘గ్రాంట్‌ థాంటన్‌’కు చురకలు:
కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన సమాచారాన్ని తీసుకొని గుడ్డిగా రిపోర్ట్‌ తయారు చేయడమేంటి? దీన్ని ఆడిటింగ్‌ అంటారా?? అసలు మీది అకౌంటెన్సీ కంపెనీనేనా?
-‘పాటిస్సెరీ వలేరియా’ కేసులో బ్రిటన్‌ కోర్టు

ఓ సంస్థకు అనుబంధంగా మరో కంపెనీ నడుస్తుందా? లేదా? అన్న విషయాన్ని కూడా పరీక్షించకుండా ఆడిటింగ్‌ రిపోర్ట్‌ ఇస్తారా? ఏమైనా అంటే బ్రిటన్‌లో ఆరో అతిపెద్ద అకౌంటెన్సీ కంపెనీ మాదేనంటూ గొప్పగా చెప్తారు.
-‘స్పోర్ట్స్‌ డైరెక్ట్‌’ కేసులో బ్రిటన్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ కౌన్సిల్‌

ఆడిటింగ్‌ అంటే.. వేల రూపాయల్లో తేడా రావడం చూశాం. ఏకంగా రూ.4 వేల కోట్లు తేడా రావడం తొలిసారిగా చూస్తున్నాం.
-కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కేసులో రుణదాత