NRI-NRT

లండన్​లో అట్టహాసంగా కింగ్​ ఛార్లెస్​ 3 పట్టాభిషేకం

లండన్​లో అట్టహాసంగా కింగ్​ ఛార్లెస్​ 3 పట్టాభిషేకం

బ్రిటన్ 40వ చక్రవర్తిగా రాజకుటుంబ వారసుడు కింగ్ ఛార్లెస్ 3 ఇవాళ పట్టాభిషేకం చేసుకుంటున్నారు. గతంలో రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్ మరణం నేపథ్యంలో ఆమె వారసుడిగా పెద్ద కుమారుడైన కింగ్ ఛార్లెస్ బాధ్యతలు చేపట్టారు. ఇవాళ అధికారింగా బ్రిటన్ రాజుగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో పాల్గొన్న బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్.. కింగ్ ఛార్లెస్ ప్రమాణం తర్వాత బైబిల్ వాక్యాలు చదివి వినిపించారు

బ్రిటన్ కొత్త రాజుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కింగ్ ఛార్లెస్ రాజ ప్రమాణపత్రంపై సంతకం చేశారు. అనంతరం పట్టాభిషేకం నిర్వహించే కుర్చీపై కూర్చున్నారు. దీంతో కాంటర్ బరీ ఆర్చ్ బిషప్ ఆయనకు అధికారికంగా రత్నాలతో పొదిగిన ఖడ్గాన్ని అందజేశారు. ఆ తర్వాత కాంటర్‌బరీ ఆర్చ్‌బిషప్ దానిని “న్యాయం చేయడానికి, అన్యాయం యొక్క ఎదుగుదలను ఆపడానికి, పవిత్రమైన దేవుని, సద్భావన గల ప్రజలందరినీ రక్షించడానికి ఉపయోగించమని చెప్పారు.

వెస్ట్‌మినిస్టర్ అబే జరుగుతున్న కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేక కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన 2200 మంది అతిథులు విచ్చేశారు. ఆర్చ్ బిషప్ కాంటర్‌బరీ పూర్తిగా క్రైస్తవ మత సంప్రదాయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తన పాలనలో చట్టాలను, ఇంగ్లండ్ చర్చిని గౌరవిస్తానని చెప్పాల్సిందిగా ఆయన్ను కోరారు. ‘నేను సేవ చేయించుకోవడానికి కాదు..సేవ చేయడానికి వచ్చా’ అని కింగ్ చార్లెస్-3 ప్రకటించారు. తన విధులకు కట్టుబడి ఉంటానంటూ ఆయన బైబిల్ మీద ప్రమాణం చేశారు. అనంతరం ఆర్చ్ బిషప్ కాంటర్‌బరీ కింగ్‌ ఛార్లెస్ ను భగవంతుడు రక్షిస్తాడని (గాడ్ సేవ్ కింగ్) ప్రకటించారు.

ఆ తర్వాత ఆర్చ్‌బిషప్ వెస్ట్ మినిస్టర్ అబ్బేలోని వ్యక్తులను, అలాగే ఇంట్లో ఈ కార్యక్రమం చూసే, వినేవారిని ఈ పదాలతో విధేయతను ప్రతిజ్ఞ చేయమని ఆహ్వానిస్నించారు. “నేను మీ మెజెస్టికి, చట్ట ప్రకారం మీ వారసులు, వారి వారసులకు నిజమైన విధేయత చూపుతానని ప్రమాణం చేస్తున్నాను. కాబట్టి దేవుడా నాకు సహాయం చెయ్యి అని చెప్పాల్సిందిగా కోరారు. దీంతో వారంతా ఆ విధంగా ప్రతిజ్ఢ చేశారు.