Agriculture

వర్షాలకు దెబ్బతిన్న రైతుల కోసం చంద్రబాబు ‘పోరుబాట’

వర్షాలకు దెబ్బతిన్న రైతుల కోసం చంద్రబాబు ‘పోరుబాట’

కాల వర్షాలకు దెబ్బతిన్న రైతుల కోసం తెలుగుదేశం పార్టీ పోరుబాట పట్టనుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో 12వ తేదీ రైతులతో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టేందుకు నిర్ణయించింది. ‘రైతు పోరుబాట’ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రైతులతో కలిసి పాదయాత్ర నిర్వహించనున్నారు. అనంతరం భారీ సభలో ప్రసంగిస్తారు. తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం నుంచి తణుకు వరకు 12 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుంది. 12వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగే ఈ పాదయాత్ర పలు గ్రామాల మీదుగా వెళుతుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు 11 తేదీ సాయంత్రమే ఉండవల్లి నుంచి తణుకు వెళతారు.

ఈ నెల 4, 5, 6 తేదీల్లో చంద్రబాబు పంట నష్ట ప్రాంతాల్లో పర్యటించారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రతిపక్షం ఇచ్చిన డెడ్‌లైన్‌పై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో టీడీపీ పోరుబాటను ఎంచుకుంది. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వకపోవడం, దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై టీడీపీ అధినేత ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలి అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో అగ్రికల్చర్, హార్టి కల్చర్ పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా.