ScienceAndTech

చేతికి చేయి. ఇదొక అద్భుత వైద్యం….

చేతికి చేయి. ఇదొక అద్భుత వైద్యం….

కేరళలోని కొచ్చికు చెందిన ఆయన రైలు ప్రమాదంలో రెండు చేతులనూ కోల్పోయారు. చాలా కాలంపాటు కుటుంబ సభ్యుల మీదే ఆధారపడి బతికాడు. కానీ ఇప్పుడు ఆయనకు రెండు చేతులూ ఉన్నాయి. అందరిలాగే తానూ పనిచేసుకుని బతుకుతున్నాడు. కొచ్చిలోని అమృత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆస్పత్రి ఆయనకు ఈ కొత్త జీవితాన్ని కల్పించింది.

ఈ ఆస్పత్రికి చెందిన తల, మెడ, ప్లాస్టిక్‌ సర్జరీ శస్త్రచికిత్స విభాగాధిపతి సుబ్రమణ్యం అయ్యర్‌ దేశంలోనే తొలిసారిగా మనుకు చేతి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. బ్రెయిన్‌డెడ్‌ అయిన ఒక వ్యక్తికి చెందిన రెండు చేతులను తీసుకుని మనుకు అమర్చారు. ఇందుకోసం క్లిష్టమైన సర్జరీ చేయడంతోపాటు ఆరు నెలల పాటు ఫిజియోథెరపీ, ఇతర చికిత్సలు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మను తన ‘కొత్త’చేతులను మామూలుగా వినియోగించడం మొదలుపెట్టారు. ఈ చేతి మార్పిడి తర్వాత.. మరెంతో మంది ఇలాంటి చికిత్సల కోసం వస్తున్నారని వైద్యులు చెప్తున్నారు.

మన దేశంలో కిడ్నీ, లివర్, గుండె మార్పిడి వంటి శస్త్రచికిత్సలు చాలా ఆస్పత్రులలో జరుగుతున్నాయి. కానీ ఏదైనా ప్రమాదంలో రెండు చేతులూ కోల్పోయిన వారికి ఇతరుల చేతులను అమర్చే శస్త్రచికిత్సలు ఐదారు ఆస్పత్రుల్లో మాత్రమే జరుగుతున్నాయి. అందులో మొట్టమొదటగా కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో జరిగింది.

ఎక్కువ చికిత్సలూ అక్కడే చేశారు. దేశంలో ఇప్పటివరకు దాదాపు 40 మంది రోగులకు చేతులు మార్పిడి చేయగా.. అందులో 14 మంది రోగులకు అమృత ఆస్పత్రిలోనే జరిగాయి. ఈ 14 మందికి కలిపి 26 చేతులను మార్పిడి చేశారు. ఇద్దరికి భుజాలు దెబ్బతినడంతో ఒక్కో చేతిని మాత్రమే మార్పిడి చేశారు. ఇలాంటి ఇన్ని చికిత్సలు చేయడం ప్రపంచంలోనే అమృత ఆస్పత్రిలో ఎక్కువని అక్కడి వైద్యులు చెప్తున్నారు.