NRI-NRT

కెనడాలో సిలికానాంధ్ర మనబడి పోటీలు

కెనడాలో సిలికానాంధ్ర మనబడి పోటీలు

కెనడాలోని (Canada) టొరంటో (toronto) నగరంలో సిలికానాంధ్ర మనబడి కెనడా ఆధ్వర్యంలో ‘తెలుగు మాటల పోటీలు’ ఘనంగా నిర్వహించారు. జూన్‌ 18న ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కేవలం ‘మనబడి’ చిన్నారులే కాకుండా కెనడాలోని తెలుగు మాట్లాడే సుమారు 50 మంది పిల్లలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో పదరంగం, తిరకాటం, ఒనిమా అనే మూడు సరదా పోటీల ద్వారా పిల్లలకు తెలుగు భాషపై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు.

5-9 సంవత్సరాల కేటగిరీలో పదరంగం పోటీల్లో అనీష్‌ కప్పగంతుల ప్రథమ స్థానం సాధించగా.. గీతిక పోతిరెడ్డి ద్వితీయ స్థానంలో నిలిచింది. తిరకాటంలో చార్విశ్రీ రాళ్లపల్లి, గీతిక పోతిరెడ్డి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. ఒనిమా పోటీలో గీతిక పోతిరెడ్డి మొదటిస్థానంలో నిలవగా.. చార్వశ్రీ రాళ్లపల్లి రెండో స్థానంలో నిలిచింది. 10-15 సంవత్సరాల కేటగిరీలో పదరంగం ప్రథమ విజేతగా అద్వైత్‌రెడ్డి చిన్నకలప్ప నిలిచాడు. తన్వి వడ్రేవు రెండోస్థానం సాధించాడు. తిరకాటం పోటీలో జనని దేవినేని, రాజ్‌దీప్‌ యనమలచింతల ప్రథమ,ద్వితీయ స్థానాల్లో నిలిచారు. ఒనిమాలో శ్రేయాస్‌ నేతి ప్రథమ, అధ్వైత్‌ రెడ్డి చిన్నకలప్ప ద్వితీయ స్థానాలు సాధించారు. ఈ టొరంటో ప్రిలిమినరీ రౌండ్స్‌లో గెలిచిన చిన్నారులు సెప్టెంబరు మొదటి వారాంతం డల్లాస్‌ మహానగరంలో జరిగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొననున్నారు.

మాతృభాషను కాపాడుకుంటూ ఆ భాషానిధిని భవిష్యత్ తరానికి అందించాలనేది ‘ సిలికానాంధ్ర మనబడి’ లక్ష్యం అని సంఘం సభ్యులు తెలిపారు. తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తిని చాటాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రారంభమై ఖండాంతరాలకు విస్తరింపజేశామన్నారు. 2013లో ప్రారంభమైన సిలికానాంధ్ర మనబడి కెనడా విభాగం సుమారు 1500పైగా విద్యార్థులకు తెలుగు పాఠాలు నేర్పిస్తోంది. తెలుగు భాష మీద ఉన్న మక్కువతో ఎందరో భాషా సైనికులు ఉపాధ్యాయులుగా, సమన్వయకర్తలుగా స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. పిల్లలని మనబడిలో నమోదు చేయాలనుకుంటే సమీప మనబడి కేంద్ర సమన్వయకర్తను సంప్రదించాలని, మరిన్ని వివరాలను https://manabadiportal.siliconandhra.org/ వెబ్‌సైట్‌లోనూ చూడొచ్చని మనబడి సంఘం సభ్యులు పేర్కొన్నారు.