Politics

జేపీ నడ్డాతో బండి సంజయ్ భేటీ

జేపీ నడ్డాతో బండి సంజయ్ భేటీ

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ భేటీ అయ్యారు. బండి సంజయ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమాకం అయిన తర్వాత జేపీ నడ్డాను కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా తనకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశమిచ్చినందుకు జేపీ నడ్డాకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. ఇక, బండి సంజయ్‌తో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం దక్కించుకున్న రాధా మోహన్ దాస్ అగర్వాల్ కూడా జేపీ నడ్డాతో సమావేశమయ్యారు.

జేపీ నడ్డాను మర్యాదపూర్తకంగా కలిసినట్టుగా బండి సంజయ్ వెల్లడించారు. జేపీ నడ్డా మార్గదర్శకత్వంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. పార్టీ అధిష్టానం ఏ బాధ్యతలు అప్పగించినా పని చేస్తానని చెప్పారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. కేంద్రంలో బీజేపీని మూడోసారి అధికారంలోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఇదిలాఉంటే, బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు దక్కించుకున్న బండి సంజయ్ గురించి ఆసక్తికర ప్రచారం సాగుతుంది. ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా బండిని నియమించనున్నారన్నది దాని సారాంశం. ప్రస్తుతం ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న సునీల్ దేవధర్‌ను జాతీయ కార్యవర్గం నుంచి తొలగించచారు. ఈ పరిణామాలు నేపథ్యంలో ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా సునీల్ స్థానంలో మరో నాయకుడిని నియమించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ పేరు తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ బాధ్యతలు బండి సంజయ్‌కు అప్పగిస్తారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది.