NRI-NRT

TANA: విజయవంతంగా “మన వారసత్వ సంపద” సాహిత్య సమావేశం

TANA: విజయవంతంగా “మన వారసత్వ సంపద” సాహిత్య సమావేశం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) సంస్థ సాహిత్యవిభాగం “తానా ప్రపంచ సాహిత్యవేదిక” నెల నెలా తెలుగు వెలుగులో భాగంగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాలం వేదికగా సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయస్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమ పరంపరలో జులై 30 (ఆదివారం) ఎందరో మహానుభావుల వారసులు పాల్గొన్న “మన వారసత్వ సంపద” అనే సాహిత్య సమావేశం విజయవంతంగా ముగిసింది. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు మన తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన ఇంతమంది పండితుల వారసులను ఒకే వేదికపైకి తీసుకురావడం తానా చరిత్రలో ఓ మైలురాయి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశిష్ట అతిథులందరికీ స్వాగతం పలికారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా విభిన్న సాహిత్య అంశాలపై అంతర్జాలం వేదికగా జరిపే ఈ సమావేశం ఎంతో విశిష్టమైందన్నారు. కట్టడాలు, పట్టణాలు కూలిపోవచ్చు గానీ వీరు సృష్టించిన సాహిత్యం మాత్రం అజరామరమైనదని తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ కొనియాడారు.

తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ‘వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో మన తెలుగు భాష, సాహిత్యాలను తమ కలాలతో, గళాలతో సుసంపన్నం చేసిన ఎంతో మంది కవులు, పండితుల తరతరాల వారసులు పాల్గొంటున్న ఇదో అపూర్వ సమ్మేళనం. ఇది కేవలం వారు తమ వారసుల కోసం మిగిల్చిన సంపద కాదు. ఇది తెలుగు జాతి సంపదన్నారు. వారు సృష్టించిన ఈ సాహిత్యాన్ని భద్రపరిచి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. మహాకవులైన తిక్కన, ఎర్రా ప్రగడ, కంచెర్ల గోపన్న, కొప్పరపు సోదర కవులు, పోతన, శ్రీనాథుడు, పరవస్తు చిన్నయసూరి, వేంకట, పార్వతీశ్వర జంట కవులకు ఈ వేదికపై వారి వారసులమధ్య పుష్పాంజలి ఘటించే అవకాశం రావడం మా అదృష్టం’’ అన్నారు.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విశిష్టఅతిథులుగా పాల్గొన్న తలుపూరు వెంకట రామకృష్ణ, మహాకవి తిక్కన 19వ తరం వంశీయులు; గుడ్లూరు వెంకట పద్మనాభరావు, మహాకవి ఎర్రాప్రగడ 9వ తరం వారసులు; ఎర్రాప్రగడ రామకృష్ణ, ప్రముఖ రచయిత; కంచర్ల శ్రీనివాసరావు, కంచెర్ల గోపన్న (భద్రాచల భక్తరామదాసు) 10వ తరం వారసులు; మా శర్మ, కొప్పరపు కవుల మనుమడు, ప్రముఖ పాత్రికేయులు, కొప్పరపు కళాపీఠం వ్యవస్థాపకులు; నెల్లుట్ల రమాదేవి, మహాకవి పోతన 10వ తరం వంశీయులు, ప్రముఖ రచయిత్రి; డా. కావూరి శ్రీనివాస్ శర్మ, శ్రీనాథ మహాకవి వంశీకుడు, ప్రముఖ కవి, శాసన, చారిత్రిక పరిశోధకుడు; డా. వోలేటి పార్వతీశం, వేంకట పార్వతీశ్వరకవుల పౌత్రుడు, వచనకవి, గేయకవి; పరవస్తు ఫణిశయన సూరి, పరవస్తు చిన్నయసూరి ఐదో తరం వారసులు పాల్గొని వారి వారి పాండిత్య వైభవాలను ఆవిష్కరించారు. ఈ సాహిత్యసభలో పాల్గొని విజయవంతంచేసిన అతిథులకు, ప్రసారం చేసిన మాధ్యమాలకు, కార్యకర్తలకు, తానా సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. దాదాపు నాలున్నర గంటలకు పైగా సాగిన ఈ పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది వీడియోలో వీక్షించవచ్చు.