Politics

లోకేశ్‌తో జేసీ భేటీ

లోకేశ్‌తో జేసీ భేటీ

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 17 రోజుల పాటు కొనసాగిన నారా లోకేశ్ యువగళం పాదయాత్ర… మంగళవారం పల్నాడు జిల్లా వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. తొలిరోజు వినుకొండ నియోజకవర్గంలో వేలాది ప్రజలు, నాయకులు, కార్యకర్తలు యువనేతకు అపూర్వ స్వాగతం పలికారు. వినుకొండ నియోజకవర్గం ముప్పరాజుపాలెం వద్ద పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు నేతృత్వంలో యువనేతకు ఘనస్వాగతం పలికారు. వేదపండితుల ఆశీర్వచనాలతో యువనేతను పల్నాడు జిల్లా ప్రజలు స్వాగతించారు. యువగళానికి సంఘీభావంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. అక్కడ నుంచి రాముడుపాలెం, జేసీ నగర్, రవ్వవరం, పుచ్చనూతల, కొత్తరెడ్డిపాలెం, లక్ష్మీపురం, నూజెండ్ల మీదుగా గుర్రపునాయుడుపాలెం విడిది కేంద్రానికి చేరుకుంది.

ప్రకాశంజిల్లా నేతల ఘన వీడ్కోలు
వినుకొండ నియోజకవర్గ శివార్లలో యువనేతకు ప్రకాశం నేతలు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ… తనను తోబుట్టువులా ఆదరించిన ప్రకాశం జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. ఏ కష్టమొచ్చినా పార్టీ కేడర్ కు వెన్నంటి ఉంటానని భరోసా ఇచ్చారు. యువగళం స్పూర్తితో రాబోయే ఎన్నికల్లో పసుపుజెండా రెపరెపలాడాలని చెప్పారు. నాయకులంతా కలసికట్టుగా పనిచేసి పార్టీని విజయపథంలో నడిపించాలని కోరారు.

ఈనాటి పాదయాత్రలో అన్ని గ్రామాల ప్రజలతో లోకేశ్ ముచ్చటించారు. రాష్ట్రంలో ప్రజలకు గుక్కెడు నీళ్లందించడం చేతగాని ముఖ్యమంత్రి లక్షల కోట్లతో సంక్షేమం చేశానని ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సదుపాయం కల్పించుకునేందుకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా ఈ ప్రభుత్వం వినియోగించుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. జల్ జీవన్ మిషన్ అమలులో రాష్ట్రం 18వ స్థానంలో ఉందని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి, ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా స్వచ్చమైన మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామాభివృద్ధికి గ్రహణం పట్టిందని లోకేశ్ చెప్పారు. పంచాయతీల అభివృద్ధికి కేంద్రం విడుదల చేసిన రూ.9 వేల కోట్ల నిధులను జగన్ ప్రభుత్వం దొంగిలించిందని ఆరోపించారు. పంచాయతీల్లో బ్లీచింగ్ చల్లడానికి కూడా చిల్లిగవ్వ లేని దుస్థితి నెలకొందని అన్నారు. టీడీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశామని చెప్పారు. వాటర్ గ్రిడ్ ద్వారా సురక్షిత నీటిని ఇంటింటికీ కుళాయిల ద్వారా అందిస్తామని తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి స్కీమ్ లోనూ ఒక స్కామ్ ఉంటుందని లోకేశ్ విమర్శించారు. సెంటు పట్టాల పేరుతో పనికిరాని స్థలాలను కేటాయించి రూ. 7 వేల కోట్లు దోచుకున్నారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి పేదవాడికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చాక 9 సార్లు విద్యుత్ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి జనం నడ్డి విరిచారని మండిపడ్డారు.

మరోవైపు ఈనాటి పాదయాత్రలో లోకేశ్ ను జేసీ ప్రభాకర్ రెడ్డి కలుసుకున్నారు. లోకేశ్ ను హత్తుకుని అభినందలను తెలియజేశారు.
యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వివరాలు

ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2283.5 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 18.6కి.మీ.

173వ రోజు (2-8-2023) యువగళం వివరాలు
వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గం ( ఉమ్మడి గుంటూరు జిల్లా)
ఉదయం
8.00 – గుర్రపునాయుడుపాలెం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
10.00 – ఉప్పలపాడులో రైతులతో సమావేశం.
11.00 – చాట్రగడ్డపాడులో స్థానికులతో మాటామంతీ.
12.00 – వినుకొండ గంగినేని డిగ్రీ కాలేజి సమీపంలో భోజన విరామం.
సాయంత్రం
4.00 – వినుకొండ గంగినేని డిగ్రీ కాలేజి వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.20 – చెక్ పోస్టు వద్ద స్థానికులతో సమావేశం.
4.40 – ముండ్లమూరు బస్టాండులో స్థానికులతో మాటామంతీ.
5.00 – ఎన్టీఆర్ సర్కిల్లో బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.
6.15 – బస్టాండు వద్ద స్థానికులతో మాటామంతీ.
9.45 – నగరాయపాలెం విడిది కేంద్రంలో బస.