Politics

రేపు రాష్ట్రపతిని కలవనున్న విపక్షాలు

రేపు  రాష్ట్రపతిని కలవనున్న విపక్షాలు

మణిపూర్‌ అంశంపై మాట్లాడటానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విపక్ష ఎంపీలకు సమయమిచ్చారు. రేపు ఉదయం 11.30 గంటలకు ఇండియా ఎంపీలకు రాష్ట్రపతి సమయం కేటాయించారు. మ‌ణిపూర్ హింసాకాండ‌పై విప‌క్షాల ఆవేద‌న‌ను ఆల‌కించాల‌ని కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే అభ్యర్ధనను రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము అంగీక‌రించారు. మ‌ణిపూర్ అంశంపై చ‌ర్చించేందుకు బుధ‌వారం 11.30 గంట‌ల‌కు విప‌క్ష ఎంపీల‌తో స‌మావేశ‌మ‌య్యేందుకు ముర్ము స‌మ‌యం కేటాయించారు. గ‌త రెండు నెల‌లుగా మ‌ణిపూర్ అట్టుడుకుతుండ‌గా ఈశాన్య రాష్ట్రంలో హింసాకాండ‌పై చ‌ర్చించేందుకు పార్లమెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మైన‌ప్పటి నుంచి విప‌క్షాలు పార్లమెంట్‌లో ప‌ట్టుబ‌డుతున్నాయి. మ‌ణిపూర్ ప‌రిస్ధితిపై ప్రధాని న‌రేంద్ర మోదీ పార్లమెంట్ వేదిక‌గా ప్రక‌ట‌న చేయాల‌ని కూడా విప‌క్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ స‌ర్కార్ ఉన్న మ‌ణిపూర్‌లో హింస అదుపుత‌ప్పడంతో ప‌లువురు ప్రాణాలు కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. మ‌రోవైపు అల్లర్లతో అట్టుడికిన మ‌ణిపూర్‌లో క్షేత్రస్ధాయి ప‌రిస్ధితుల‌ను మ‌దింపు చేసేందుకు ఇటీవ‌ల విప‌క్ష ఎంపీల బృందం ఆ రాష్ట్రంలో రెండు రోజుల పాటు ప‌ర్యటించింది. మ‌ణిపూర్‌లో ప‌రిస్ధితిని చ‌క్కదిద్దేందుకు జోక్యం చేసుకోవాల‌ని విప‌క్ష నేత‌లు రాష్ట్రప‌తిని కోరారు.

విపక్ష నేతల కూటమి ఇండియా (INDIA) ఫ్లోర్ లీడర్లు, మణిపూర్‌‍లో పర్యటించిన 21 మంది ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)ను బుధవారం కలుసుకోనున్నారు. మణిపూర్‌లో పరిస్థితిని ఈ సందర్భంగా వారు రాష్ట్రపతికి వివరించనున్నారు. హర్యానాలో మత ఘర్షణలు చెలరేగడం, పార్లమెంటు పనితీరు వంటి అంశాలను కూడా ప్రతినిధి బృందం రాష్ట్రపతితో చర్చించే అవకాశం ఉంది. మణిపూర్ హింసాత్మక ఘటనలపై సోషల్ మీడియాలో జూలై 19న వచ్చిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇద్దరు మహిళలను వివస్త్రగా ఊరేగించినట్టు కనిపిస్తున్న ఆ ఘటన మే 4న జరిగింది. మే 3న జాతుల ఘర్షణ తలెత్తిన మరుసటి రోజు ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై ఇటీవల సీబీఐ దర్యాప్తు చేపట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐపీసీ, ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పటి నుంచి 180 మంది ప్రాణాలు కోల్పోగా, వీరిలో 60 మంది మెయితీలు, 113 మంది కుకీలు, ముగ్గురు సీఏపీఎఫ్ సిబ్బంది, ఒక నేపాలీ, ఒక నాగా, ఒక గుర్తుతెలియని వ్యక్తి, 20 మంది మహిళలు ఉన్నారు. 6500కు పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.