అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లను తమ భూభాగంలో చూపుతూ చైనా (China) విడుదల చేసిన మ్యాప్‌పై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) డిమాండ్ చేశారు. చైనా దురాక్రమణ విషయంలో మోదీ(Modi) చెప్పే మాటలు అబద్ధమని పునరుద్ఘాటించారు.‘లద్దాఖ్‌లో అంగుళం భూమిని కూడా చైనా ఆక్రమించలేదని ప్రధాని మోదీ చెప్తున్నారు. కానీ ఆ మాటలు అబద్ధమని నేను కొన్నేళ్లుగా మొత్తుకుంటున్నాను. చైనా దురాక్రమణ గురించి లద్దాఖ్ ప్రజలందరికీ తెలుసు. ఈ మ్యాప్ అంశం చాలా తీవ్రమైంది. వారు మన భూభాగాన్ని లాగేసుకున్నారు. ప్రధాని మోదీ దీనిపై ప్రకటన చేయాలి’ అని రాహుల్ డిమాండ్ చేశారు.
అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లను తమ భూభాగంలో చూపుతూ చైనా రూపొందించిన మ్యాప్‌పై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇది సరిహద్దుల వివాదాలను మరింత రగల్చడమేనని అభిప్రాయపడింది. చైనా ఆధారాల్లేకుండా మ్యాప్‌ను రూపొందించిందని స్పష్టం చేసింది. ‘అసంబద్ధమైన వాదనల ద్వారా ఇతరుల భూభాగాలను తమవని చెప్పుకోజాలరు’ అని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. భారత్ కొద్ది రోజుల్లో జి-20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ఈ మ్యాప్‌ను విడుదల చేయడం గమనార్హం.దాదాపు పదిరోజుల పాటు లద్దాఖ్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ మంగళవారం దిల్లీకి చేరుకున్నారు. తాజాగా ఆయన కర్ణాటకకు బయల్దేరి వెళ్లేప్పుడు చైనా మ్యాప్ వివాదంపై మాట్లాడారు. ఇదిలా ఉంటే.. బుధవారం కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం గృహ లక్ష్మి యోజన(Gruha Lakshmi Yojana)ను ప్రారంభించనుంది. మైసూర్‌లో జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ పాల్గొననున్నారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు.