Business

నకిలీ ఈ-చలాన్లు పంపించి దోచుకుంటున్నారు జాగ్రత్త!

నకిలీ ఈ-చలాన్లు పంపించి దోచుకుంటున్నారు జాగ్రత్త!

ఈ మధ్య కాలంలో మరో కొత్త సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ మోసం రవాణా శాఖ పేరుతొ జరుగుతోంది. సాధారణంగా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినపుడు రవాణా శాఖ నుంచి ఈ చలాన్లు వస్తుంటాయి. దానిని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. నకిలీ ఈ-చలాన్లు పంపించి దోచేసుకుంటున్నారు. ఈ విషయాన్ని పోలీసులు.. సమాచార మంత్రిత్వ శాఖ తమ X పోస్ట్‌లో వివరించారు. దీనికి సంబంధించిన హెచ్చరికలు జారీ చేశారు. ‘నకిలీ ఇ-ఇన్‌వాయిస్ స్కామ్‌కు బలైపోకండి, మీ భద్రత మీ బాధ్యత’ అని ఆ X పోస్ట్ లో పేర్కొన్నారు.

ఇ-చలాన్ స్కామ్ అంటే ఏమిటి, అది ఎలా పని చేస్తుంది? చూద్దాం.. ఈ స్కామ్‌తో మన డబ్బు దోచేయడానికి, స్కామర్ మీ ఫోన్‌కి ఇ-చలాన్ మెసేజ్ పంపిస్తారు. ఈ మెసేజ్ కూడా స్కామర్ మీ ఫోన్‌కి ఇ-చలాన్ మెసేజ్ పంపిస్తారు. ఆ మెసేజ్ కూడా నకిలీ వెబ్ సైట్ నుంచి వస్తుంది. ఆ మెసేజ్‌లో పేమెంట్ లింక్ ఉంటుంది. మీరు ఈ లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే, మోసగాళ్లు మీ డెబిట్/క్రెడిట్ కార్డ్‌తో సహా మొత్తం మీకు సంబంధించిన రహస్య సమాచారాన్ని స్కాన్ చేస్తారు.

ఈ మోసాన్ని ఎలా నివారించాలి? ఈ స్కామ్‌లో మీ ఫోన్‌లో వచ్చే టెక్స్ట్ మెసేజ్, అందులో ఇచ్చిన లింక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ లాగా ఉంటుంది. కానీ ఆ లింక్ వెబ్సైట్ నకిలీది. నిజానికి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్కామర్లు https://echallan.parivahan.in/ లింక్‌ను షేర్ చేస్తారు. అయితే రవాణా శాఖ వెబ్‌సైట్ లింక్ https://echallan.parivahan.gov.in/. ప్రభుత్వం జారీ చేసిన లింక్ చివరన “gov.in” అని ఉండటం ఇక్కడ గమనించదగ్గ విషయం. అందువల్ల, ఏదైనా ఇటువంటి లింక్ వచ్చినపుడు లింక్ చివరలో ఉన్న అక్షరాలను జాగ్రత్తగా చూడాలి.

ఎప్పుడూ కూడా ప్రభుత్వ ఈ చలాన్ లింక్ ఫోన్ నెంబర్ నుంచి రాదు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఏదైనా ఎలర్ట్ మెసేజ్ రావచ్చు. కానీ, లింక్ పంపి డబ్బు చెల్లించమని ప్రభుత్వ సంస్థ ఏదీ కూడా మెసేజ్ పంపించదు. అలాగే ఏదైనా లింక్ మెసేజ్ వచ్చినపుడు దానిని తొందర పడి క్లిక్ చేయవద్దు. సైబర్ పోలీసు అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. అటువంటి లింక్‌లపై క్లిక్ చేసే ముందు, వాహన యజమానులు అన్ని వివరాలను మీకు మీరుగా చెక్ చేసుకోవాలి. నిజంగా ఒకవేళ ఏదైనా ఈ చలాన్ కు సంబంధించిన మెసేజ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తే అందులో ఇంజిన్ నంబర్, ఛాసిస్ నంబర్ వంటి మీ వాహనం వివరాలు ఉంటాయి. అయితే స్కామర్ సందేశంలో అలాంటి వివరాలు ఉండే అవకాశం లేదు. ఇది కాకుండా, డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌ను చెక్ చేయడం ద్వారా ఏదైనా చలాన్ మీ వాహనంపై ఉందా లేదా అనేవిషయాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల ట్రాఫిక్ చలాన్ల కోసం ప్రత్యేకంగా అధికారిక యాప్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించి తెలుసుకోవచ్చు.

ఒకవేళ మీరు మోసానికి గురైనట్లయితే ఏమి చేయాలి?
మీరు ఈ స్కామ్‌కు గురైనట్లయితే, వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCCRP) హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేసి, మోసం గురించి తెలియజేయండి. దీనితో పాటు వెంటనే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో దాని గురించి ఫిర్యాదు చేయండి. ఇది కాకుండా, మీ బ్యాంక్ – సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో మోసానికి సంబంధించిన ఫిర్యాదును నమోదు చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా అప్రమత్తంగా ఉండండి.