Business

పసిడి బాండ్లపై బంపర్ ఆఫర్. రేపటి నుండి అమ్మకాలు.

పసిడి బాండ్లపై బంపర్ ఆఫర్. రేపటి నుండి అమ్మకాలు.

సార్వభౌమ పసిడి బాండ్ల మలివిడత ఇష్యూ ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కొన్ని నెలలుగా పసిడి ధర స్తబ్దుగా, పరిమిత శ్రేణికి లోబడి కదలాడుతోంది. ఇప్పటికే బాగా పెరిగినందున.. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉంటుందా? అనే సందిగ్ధత ఉండడమూ సాధారణమే. మరి ఇలాంటప్పుడు పసిడి బాండ్లలో మదుపు చేయొచ్చా?

*** ఎందుకు దరఖాస్తు చేసుకోవాలి..
అంతర్జాతీయంగా అనిశ్చితితో కూడిన పరిస్థితులు నెలకొనడం వల్ల సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే పసిడికి గిరాకీ పెరుగుతుందని కొందరు పెట్టుబడిదార్లు అభిప్రాయపడుతున్నారు. దేశీయంగా పండుగ సీజను ప్రారంభం కానుండడం కూడా పసిడికి కలిసొచ్చే పరిణామంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మున్ముందు పసిడి ధరలు పెరిగేందుకు అవకాశాలున్నందున.. దీర్ఘకాల ప్రతిఫలాన్ని ఆశిస్తూ పసిడి బాండ్లలో మదుపు చేయడం మంచిదేనని సలహా ఇస్తున్నారు. పసిడి బాండ్ల దరఖాస్తుతో ఎందుకు ప్రయోజనమో వాళ్ల విశ్లేషణ ఇలా..

పసిడి ధరలు ఇప్పటికే గరిష్ఠ స్థాయిల (10 గ్రాముల ధర రూ.61,845) నుంచి బాగా దిద్దుబాటు అయ్యాయి. అందువల్ల దశలవారీగా పసిడిలో పెట్టుబడులు పెంచుకుంటూ పోవడానికి దీనిని ఓ సానుకూల అవకాశంగా భావించవచ్చు. దీర్ఘకాలంలో మంచి ప్రతిఫలాలు పొందేందుకు సార్వభౌమ పసిడి బాండ్లు అత్యుత్తమైన పెట్టుబడి మార్గంగా చెబుతున్నారు.

ఆర్థిక అనిశ్చితుల కారణంగా పలు దేశాల కేంద్ర బ్యాంకులు(సెంట్రల్‌ బ్యాంక్స్‌) భారీ పరిమాణంలో పసిడిని కొనుగోలు చేస్తున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపుల కోసం డాలర్ల మీద ఆధారపడడాన్ని తగ్గించే దిశగా కొన్ని దేశాలు యోచన చేస్తున్నాయి. ఇవన్నీ సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి గిరాకీ పెరిగేందుకు తోడ్పడవచ్చని అంచనా వేస్తున్నారు.

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఇటీవల కొన్ని నెలలుగా కీలక వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే పసిడి ధరలపై ప్రభావం ఉంటుంది. ఒకవేళ వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియను యూఎస్‌ ఫెడ్‌ ఆపితే.. ఆ పరిణామం పసిడికి కలిసొచ్చేదిగా భావించవచ్చు.

అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించాయనే ఆందోళనల వల్ల కూడా సురక్షిత పెట్టుబడి సాధనమైన పసిడిలో పెట్టుబడులు పెరిగేందుకు దారితీయొచ్చు. ద్రవ్యోల్బణం, ఆర్థిక అస్థిరత్వం సందర్భాల్లో మదుపర్లు వాళ్ల పెట్టుబడులకు పసిడితో హెడ్జింగ్‌ చేస్తుండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.

మధ్య-దీర్ఘకాలానికి పసిడి సానుకూలంగా కనిపిస్తోంది. ఆర్థిక అనిశ్చితుల వల్ల కలిగే ముప్పు నుంచి పెట్టుబడులను కాపాడుకునేందుకు మదుపర్లు కూడా తమ పెట్టుబడుల్లో పసిడికి కేటాయింపులను పెంచే అవకాశం ఉంది. ఇది కూడా పసిడి ధరపై సానుకూల ప్రభావం చూపించవచ్చని అంచనా వేస్తున్నారు.

*** పసిడి బాండ్ల ఇష్యూ వివరాలు..

ఇష్యూ ధర- గ్రాముకు రూ.5,923 (ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌. అప్పుడు ధర రూ.5,873)

దరఖాస్తు సమయం- ఈ నెల 11వ తేదీ నుంచి 15 వరకు

ఎక్కడ విక్రయిస్తారు- బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌హెచ్‌సీఐఎల్‌)

పెట్టుబడి పరిమితి- కనిష్ఠంగా ఒక గ్రాము; గరిష్ఠంగా వ్యక్తులకు, హెచ్‌యూఎఫ్‌లకు 4 కిలోలు, ట్రస్టులకు 20 కిలోలు

వడ్డీ రేటు- వార్షికంగా 2.50%

కాలపరిమితి- ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తర్వాత వడ్డీ చెల్లింపు తేదీన ముందస్తు ఉపసంహరణకు అవకాశం.