DailyDose

వైఎస్ భాస్కర్ రెడ్డికి ఊరట-నేటి నేర వార్తలు

వైఎస్ భాస్కర్ రెడ్డికి ఊరట-నేటి నేర వార్తలు

గూడ్స్ రైలుపై ఉన్న ట్రక్కులో మంటలు

గూడ్స్‌పై ఉన్న ట్రక్కులో మంటలు చెలరేగిన ఘటన మంగళవారం బిజూర్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని కోలాడ్ నుంచి మంగళూరులోని సూరత్‌కల్‌కు ఓ గూడ్స్ రైలు ట్రక్కులతో బయలుదేరింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గూడ్స్ రైలు బిజూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే రైలులోని ఒక ట్రక్కులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైలులోని సిబ్బంది వెంటనే రైలును ఆపి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. బైందూరు అగ్నిమాపక సిబ్బంది కూడా రైల్వే స్టేషన్‌కు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లారీలో లోడ్ చేసిన తినుబండారాలు పాక్షికంగా దగ్ధమయ్యాయి.

లారీ ఢీకొనడంతో స్కూల్ బస్సు బోల్తా

మహబూబ్ నగర్ లో స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్ర‌మాదంలో 50 మందికి గాయాలు అయ్యాయి. మ‌హబూబ్ నగర్ జిల్లా మయూరి ఎకో అర్బన్ పార్కు సమీపంలో స్కూల్ బస్సును లారీ ఢీకొనడంతో 50 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డార‌ని సంబంధిత అధికారులు తెలిపారు.ఈ రోడ్డు ప్ర‌మాదం గురించి పోలీసులు, స్థానికులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా వున్నాయి.. మహబూబ్‌నగర్‌లోని మయూరి ఎకో అర్బన్ పార్క్ సమీపంలో సోమవారం పాఠశాల బస్సును లారీ ఢీకొనడంతో 50 మంది విద్యార్థులు గాయపడ్డారు.  కొత్తతండా గ్రామ సమీపంలోని మౌంట్ బాసిల్ స్కూల్ యాజమాన్యం పాఠశాల బస్సు విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్నట్లు సంఘటన స్థలంలో ఉన్నవారు సమాచారం అందించారు. అయితే, బస్సు పాఠశాల వద్దకు చేరుకోగానే యూ టర్న్ తీసుకుంటుండగా, ఎదురుగా వేగంగా వస్తున్న లారీ వెనుకవైపు నెమ్మదిగా వెళ్తున్న బస్సును ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది.దీంతో ప్రమాదానికి గురైన బస్సులో ఉన్న విద్యార్థులు ఇరుక్కుపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. చాలా మంది విద్యార్థులకు తలకు తీవ్ర గాయాలు కాగా, వారిలో ప‌లువురురికి చేతులు, కాళ్లు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. జడ్చర్ల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం ఎస్‌వీఎస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వైఎస్ భాస్కర్ రెడ్డికి ఊరట

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఎస్కార్ట్‌ బెయిల్‌ను సీబీఐ కోర్టు పొడిగించింది. తన ఎస్కార్ట్‌ బెయిల్‌ పొడిగించాలని కోరుతూ కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కంటికి కాటరాక్ట్‌ శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. వైద్యుల సూచన, తదుపరి చికిత్సల కోసం రెండు నెలల పాటు పొడిగించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన  సీబీఐ కోర్టు నవంబరు 1 వరకు ఎస్కార్ట్‌ బెయిల్‌ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

*  ఓ యువతి సొంత చెల్లెళ్లనే దారుణంగా హత్య

త్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో దారుణం చోటు చేసుకొంది. తన ప్రియుడితో సన్నిహితంగా ఉండగా చూశారని ఓ యువతి సొంత చెల్లెళ్లనే హత మార్చింది. ఆపై నేరాన్ని కప్పి పుచ్చుకునేందుకు యత్నించింది. ఈ ఘటన బల్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..బహదూర్‌పుర్‌ గ్రామానికి చెందిన అంజలి అనే 20 ఏళ్ల యువతి తన ఆరు, నాలుగేళ్ల వయసున్న చెల్లెళ్లను కడతేర్చింది. తల్లిదండ్రులు లేని సమయంలో ఆమె తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. అతడితో సన్నిహితంగా ఉండగా.. చిన్నారులిద్దరు వారిని చూశారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతారేమోనని ఆమె భయపడింది. దీంతో సొంత చెల్లెళ్లని కూడా చూడకుండా వారిని చంపేందుకు నిర్ణయించుకుంది. పదునైన ఆయుధంతో చిన్నారులను హత్య చేసింది.తనపై ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల వద్దకు వెళ్లి  చిన్నారులను ఎవరో చంపేశారని కట్టుకథ సృష్టించింది. చిన్నారుల మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడే రక్తపు మరకలతో ఉన్న అంజలి దుస్తులను గుర్తించిన పోలీసులు నిందితురాలిని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ నేరానికి పాల్పడిన యువతికి మరికొందరు సహకరించిన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  ఓ వృద్ధుడు మైనర్‌ బాలికతో పరార్

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులను చేయాల్సిన గురవులే తప్పుదారి పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా తమ కామ వాంఛ తీర్చుకోవడానికి పాఠశాలకు వచ్చే పిల్లలపై కన్నేస్తున్నారు. అచ్చం.. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లా కోత్వాలి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థినిని అదే పాఠశాలకు చెందిన ఓ 50 ఏళ్ల ఉపాధ్యాయుడు మచ్చిక చేసుకుని గత జూలై నెలలో తల్లిదండ్రులకు తెలియకుండా ఆమెను అపహరించాడు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, గత రెండు నెలలుగా నిందితుడి కోసం వారంతా తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఆ కీచక ఉపాధ్యాయుడు విద్యార్థినితో ఉన్న అసభ్యకర వీడియోలు, ఫొటోలు తీసి గ్రామానికి సంబంధించిన గ్రూప్‌లో పంపుతూ.. వైరల్‌ చేస్తున్నాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

పెద్దపల్లి జిల్లాలో విషాదం

పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో విషాదం చోటుచేసుకుంది. దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని బంధువులు, గ్రామస్థులు భావిస్తున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దంపతుల ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని నెల్లిపల్లికి చెందిన కటుకు అశోక్ సంగీతలకు ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. వ్యవసాయ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించే అశోక్ కుటుంబంలో.. గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నట్లు బంధువులు, స్థానికులు చెబుతున్నారు. ఈ ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంలో తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోజు తెల్లవారుజామున చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తలు చనిపోవడంతో ఇద్దరు చిన్న పిల్లలు అనాధలు అయ్యారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

దొంగలు ఇంట్లోకి చొరబడి విలువైన ఆభరణాలు చోరీ

దొంగలు ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి వస్తువులను దొచుకెళ్లిన ఘటన శివల్లి గ్రామానికి చెందిన లాలా లజపతిరాయ్‌ మార్గ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాలుగో క్రాస్‌లోని అమ్ముంజే విట్టల్‌దాస్‌ నాయక్‌ ఇంట్లో ఆదివారం మధ్య రాత్రి మొయిన్ డోర్ బద్దలుకొట్టి దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. ఈ క్రమంలో మొదట ఇంటి అల్మరాలో పెట్టిన రూ.లక్ష విలువైన బంగారం, అదేవిధంగా మాస్టర్ బెడ్ రూం తలుపులు పగులగొట్టిలో అందులో ఉన్న రూ.66.36 లక్షల విలువైన 1.882 కిలోల బంగారు ఆభరణాలు, రూ.6.75 లక్షల విలువైన 7.45 కిలోల వెండి సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడు విట్టల్ దాస్ నాయక్ ఫిర్యాదు మేరకు ఉడిపి నగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నల్లగొండ జిల్లాలో విషాదం

నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిడమనూరు మండలం వెంకటాపురం సమీపంలో అక్టోబర్ 09 రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందారు. మృతుడు మధు స్పెషన్ ప్రొటెక్షన్ ఫోర్స్(SPF) కానిస్టేబుల్ గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గత రాత్రి సమయంలో నల్గొండ హాలియా రహదరిపై గుర్తుతెలియని వాహనం కానిస్టేబుల్ ని ఢీకొని వెళ్లిపోయింది. దీంతో కానిస్టేబుల్ అక్కడిక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నాగార్జున సాగర్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here
<a href=”https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z”>https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z</a>