Politics

ఎన్నికల్లో మాయమాటలు నమ్మి మోసపోవద్దు: కేసీఆర్‌

ఎన్నికల్లో మాయమాటలు నమ్మి మోసపోవద్దు: కేసీఆర్‌

ఎన్నికల్లో మాయమాటలు నమ్మి మోసపోతే నష్టపోతామని సీఎం కేసీఆర్‌ ప్రజలకు వివరించారు. ఆదివారం సాయంత్రం హుస్నాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసీఆర్‌ ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో తొమ్మిదేళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేసే కార్యాచరణతో వెళ్తున్నామన్నారు. హుస్నాబాద్‌ నియోజకవర్గానికి ఆరు నెలల్లో లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయని తెలిపారు. ప్రాజెక్టులు, చెక్‌ డ్యామ్‌లతో భూగర్భ జలాలు పెరిగాయని వివరించారు. వీరభద్ర స్వామి ఆలయాన్ని అభివృధ్ధి చేస్తామని, ఎల్కతుర్తిలో బస్టాండ్‌, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని, శనిగరం ప్రాజెక్టుకు మరమ్మతులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

‘‘మాయమాటలు నమ్మి మోసపోవద్దు.. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తెలివిగా ఆలోచించాలి. కొన్ని పార్టీలు వచ్చి మాయమాటలు చెప్తాయి. ఒక్క అవకాశం ఇవ్వమని కాంగ్రెస్‌ పార్టీ అడుగుతోంది. పదిసార్లు అవకాశాలు పొందిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని అంధకారం చేసింది. స్పష్టమైన అవగాహనతో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది. 9 ఏళ్ల క్రితం విద్యుత్‌ కొరత, సాగునీరు, తాగునీరు లేదు. రాష్ట్రం నుంచి లక్షలాది ప్రజలు వలస వెళ్లేవారు. సమస్యల పరిష్కారానికి కొన్ని నెలల పాటు మేధోమథనం చేశాం. అందరి సహకారంతో రాష్ట్రాన్ని ఎన్నో అంశాల్లో నంబర్‌ వన్‌గా నిలిపాం. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో మనకు ఎవరూ సాటి రారు. ఇప్పటి వరకు సాధించిన విజయాలు ఇలాగే కొనసాగాలి. రైతు బంధుతో రాష్ట్ర వ్యవసాయ విధానమే మారిపోయింది. 95 నుంచి 105సీట్లు గెలవడానికి హుస్నాబాద్‌ సభ నాంది కావాలి’’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z