Politics

నన్ను ఆదరించిన ప్రపంచ తెలుగు వారందరికీ ధన్యవాదాలు

నన్ను ఆదరించిన ప్రపంచ తెలుగు వారందరికీ ధన్యవాదాలు

కష్టకాలంలో తెలుగు ప్రజలు చూపిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని తెదేపా అధినేత చంద్రబాబు (chandrababu) అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన తర్వాత పార్టీశ్రేణులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.‘‘తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు.. అభినందనలు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు 52 రోజులుగా నాకోసం రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ సంఘీభావం తెలిపారు. పూజలు చేశారు. తెలుగురాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మీరు చూపించిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. సంఘీభావం తెలపడంతో.. నేను చేసిన అభివృద్ధిని కూడా మీరు వివరించారు. నా జీవితం ధన్యమైంది. ఇలాంటి అనుభూతి ఏ నాయకుడికీ రాదు. 45 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు.. చేయనివ్వను. నాకు మద్దతుగా నిలిచిన ప్రపంచంలోని తెలుగువారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. భాజపా, సీపీఐ, భారాస, కొందరు కాంగ్రెస్‌ నేతలు ప్రత్యేకంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) నా అరెస్టు ఖండిస్తూ సంపూర్ణ మద్దతు తెలిపారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. తెలుగుదేశం కార్యకర్తలు 52 రోజులుగా, ఏమాత్రం అధైర్యపడకుండా పోరాడారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు కొందరు కార్యకర్తలు సైకిల్‌ యాత్ర చేశారు. 45ఏళ్లుగా ప్రజా జీవితంలో నేను చేసిన అభివృద్ధి పనులను అంతా నెమరవేసుకున్నారు. సైబర్‌ టవర్స్‌ నిర్మించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో నాకు కృతజ్ఞత తెలుపుతూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. నా విధానాల వల్ల లబ్ధిపొందిన ఐటీ ఉద్యోగులంతా ఆ కార్యక్రమంలో పాల్గొని వివరించారు. వారందరికీ అభినందనలు’’ అని చంద్రబాబు తెలిపారు. 52 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన చంద్రబాబును చూసిన తెదేపా నేతలు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. జైలు వద్దకు వచ్చిన నేతలు ఆలింగనం చేసుకుని, కార్యకర్తలకు అభివాదం చేస్తూ చంద్రబాబు (chandrababu) ముందుకు కదిలారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z